పంటను మింగిన నివర్‌

ABN , First Publish Date - 2020-11-28T05:21:16+05:30 IST

నివర్‌ తుఫాన్‌ రైతులను ముంచేస్తోంది. భారీ వర్షాలకు చేతికందిన పంటలు నీటి పాలయ్యాయి.

పంటను మింగిన నివర్‌
రుద్రవరం మండలం ఆర్‌.నాగులవరంలో నేలవాలిన అరటి

  1. 82 వేల హెక్టార్లలో వరి నీటిపాలు
  2. పత్తి, మొక్కజొన్న, కందికి భారీ నష్టం 
  3. 29 మండలాల్లో ఎడతెరిపిలేని వర్షం 


ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, నవంబరు 27: నివర్‌ తుఫాన్‌ రైతులను ముంచేస్తోంది. భారీ వర్షాలకు చేతికందిన పంటలు నీటి పాలయ్యాయి. అక్టోబరు దాటినందున ఇక వర్షాలు ఉండవని, పంటలకు వచ్చిన ఇబ్బంది లేదని భావించిన రైతులను తాజా పరిస్థితి కుంగదీస్తోంది. జిల్లా అంతటా గురువారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దాదాపు లక్ష ఎకరాల్లో పక్వానికి వచ్చిన పంటలు నీట మునిగాయి. వరి, కంది, మొక్కజొన్న, ఉల్లి, మిర్చి తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వరి పంట సాధారణ విస్తీర్ణానికి మించి 82,407 హెక్టార్లలో సాగు చేశారు. కొన్ని మండలాల్లో కోత కోసి పొలాల్లోనే ఆరబెట్టారు. మరి కొన్ని చోట్ల కోతకు సిద్ధమవుతున్నారు. ఈసారి వరి పంట దిగుబడి బాగా ఉంటుందని ఆశించారు. తుఫాన్‌ కారణంగా చేతికి అందాల్సిన పంట నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


నీట మునిగిన పంటలు

గోస్పాడు మండలంలో 1364 హెక్టార్లల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారి సుధాకర్‌ తెలిపారు. వరి, జొన్న, మినుము, శనగ పంటలు నీట మునిగాయని తెలిపారు. 


మహానంది, బండిఆత్మకూరు, శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ మండలాలలో సుమారుగా 1200 హెక్టార్లలో అరటి పంట నేలకూలినది. 

నంద్యాల వ్యవసాయ డివిజన్‌ పరిధిలోని 6 మండలాల్లో 3,900 హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగిందని ఏడీఏ రాజశేఖర్‌ తెలిపారు.


పాణ్యం మండలంలో 475 హెక్టార్ల వరికి నష్టం వాటిల్లింది. 

తుగ్గలి మండలం పగిడిరాయి, ముక్కెళ్ళ, బొందిమడుగుల తదితర గ్రామాల్లో చెరువు కింద, బోర్లు కింద సాగుచేసిన వరి నేలకొరిగింది. 


ఆలూరు మండలం అరికెర, కురువల్లి చెరువుల కింద వరి నేలవాలింది. మిరప, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది.

ఆళ్లగడ్డ ప్రాంతంలో వరి, మినుము పంటలు దెబ్బతిన్నాయి. కేసీ ఆయకట్టు కింద 20 వేల హెక్టార్ల వరి పంట నేలవాలింది. 


మిడుతూరు మండలంలో మొక్కజొన్న ధాన్యాన్ని టార్పాలిన్‌ కప్పి భద్ర పరిచారు. కల్లాల్లో ధాన్యం కింది భాగం నుంచి నీరు చేరి కొందరు రైతులు నష్టపోయారు.


బనగానపల్లె మండలంలో వరి 518 హెక్టారల్లో,  కంది 240 హెక్టార్లలో పాక్షికంగా దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారి విజయకుమార్‌ తెలిపారు. 

జిల్లాలో తుఫాన్‌ కారణంగా 15 వేల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని ఏడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. ఇందులో 12 వేల హెక్టార్లు వరి, 3 వేల హెక్టార్లు ఇతర పంటలు ఉన్నాయని తెలిపారు. రుద్రవరం మండలం నరసాపురం సమీపంలో దెబ్బతిన్న వరి పంటను ఆమె పరిశీలించారు.


రుద్రవరం మండలంలో వరి, మినుము, మునగ, వరి, అరటి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. నరసాపురం, హరినగరం, ముకుందా పురం, చిత్రేణి పల్లె, రుద్రవరం గ్రామాల్లో పొలాల్లో నిల్వ ఉన్న 60 వేల బస్తాలు వరి ధాన్యం తడిచిపోయింది.


ప్యాపిలి మండలంలో వరి దెబ్బతినింది. రూ.50 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలిసింది. 


అవుకు మండలం అన్నవరం, గుండ్లశింగవరం, అవుకు, శివవరం, వేములపాడు, మెట్టుపల్లె, చెర్లోపల్లె, రామాపురం గ్రామాల్లో 1100 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది.


కోవెలకుంట్ల మండలం గుళ్లదుర్తి, భీమునిపాడు, కంపమల్ల, పొట్టిపాడు, సౌదరదిన్నె, జొళదరాశి, కలుగొట్ల, రేవనూరు, లింగాల, చిన్నకొప్పెర్ల తదితర గ్రామాల్లో 596 హెక్టార్లలో వరి దెబ్బతినింది. 


చాగలమర్రి మండలం శెట్టివీడులో దెబ్బతిన్న వరి, జొన్న, మినుము పంటలను జేడీఏ ఉమామహేశ్వరమ్మ పరిశీలిం చారు. మండలంలో 500 ఎకరాల్లో వరి, 800 ఎకరాల్లో మినుము నీళ్లపాలైంది. 50 ఎకరాల అరటి దెబ్బతినింది. 


చాగలమర్రి మండలం కలుగొట్లపల్లె సమీపంలో వక్కిలేరును ఆళ్లగడ్డ డీఎస్పీ రాజేంద్ర పరిశీలించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. బ్రాహ్మణపల్లె, కలుగొట్లపల్లె సమీపంలో వక్కిలేరు వంతెనపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. రాజోలి ఆనకట్ట వద్ద కుందూనది ప్రవాహం పెరిగింది. 


శిరివెళ్ల మండలంలో 4,277 హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగింది. వర్షం, ఈదురు గాలులకు అరటి తోటలు దెబ్బతిన్నాయి. 

ఉయ్యాలవాడ మండలంలో 607 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వ్యవసాయ అధికారి స్వాతి తెలిపారు. వరి 366 హెక్టార్లలో, పత్తి 239 హెక్టార్లలో, రెండు హెక్టార్లలో కంది పంటలు దెబ్బ తిన్నాయన్నారు. 


సంజామల మండలంలో 4 వేల హెక్టార్లలో వరి, వంద హెక్టార్లలో శనగ దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారి సుధాకర్‌రెడ్డి తెలిపారు. 

గడివేముల మండలంలో 408 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 


బండి ఆత్మకూరు మండలంలో జేసీ రామసుందర్‌ రెడ్డి పర్యటించారు. తుఫాన్‌ ప్రభావం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 


29 మండలాల్లో వర్షం

జిల్లాలోని 29 మండ ల్లాల్లో వర్షం కురిసిం దని నమోదైందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. చాగలమర్రిలో అత్యధికంగా 84.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆళ్లగడ్డలో 61.8, కోవెలకుంట్లలో 55.2, ఉయ్యాలవాడలో 52.6, సంజామల 51.4, రుద్రవరం 50.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. దొర్నిపాడులో 48.4, శిరివెళ్ల 47.6, గోస్పాడు 46.8, మహానంది 46.4, బండి ఆత్మకూరు 44.2, నంద్యాల 39.8, గడివేముల 35.4, శ్రీశైలం 32.2, బనగానపల్లె 32, వెలుగోడు 28.6, పాణ్యం 27.4, పాములపాడు 26.2, కొలిమిగుండ్ల 25, మిడ్తూరు 24.6, బేతంచెర్ల 23.2, జూపాడుబంగ్లా 22.6, నందికొట్కూరు 22.4, ఆత్మకూరు 22.2, కొత్తపల్లి 21.6, అవుకు 19.4, పగిడ్యాల 16.4, ఓర్వకల్లు 13.4, కల్లూరులో 11.2 మి.మీ. వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో 8 మి.మీ వరకూ స్పల్ప వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. నవంబరులో 27.6 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, గురు, శుక్రవారాల్లో ఏకంగా 25.9 మి.మీ. వర్షం కురిసింది. రైతులకు తీవ్ర నష్టం జరిగిందని జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. గ్రామాల వారీగా పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఆమె తెలిపారు.


అప్రమత్తంగా ఉండండి

కర్నూలు(అర్బన్‌), నవంబరు 27: నివర్‌ తుఫాన్‌ నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశించారు. తన క్యాంప్‌ కార్యాలయం నుంచి జిల్లా, డివిజన్‌, మున్సిపల్‌, మండల స్థాయి అధికారులతో శుక్రవారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. తుఫాన్‌ నష్టంపై ఎప్పటికప్పుడు నివేదికలు  పంపాలని సూచించారు. కడప సరిహద్దు, ఆత్మకూరు చుట్టు పక్కల ఉన్న నల్లమల ప్రాంతాల అధికారులు, చాగలమర్రి, ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల, బనగానపల్లె, కోవెలకుంట్ల మండలాల అధికారులు, రుద్రవరం సమీపంలో ఉన్న వక్కీలేరు వద్ద అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, వంకలో ప్రజలు దిగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. చాగలమర్రి, ఆళ్లగడ్డ ప్రాంతాలను జేసీ రామసుందర్‌ రెడ్డి, ఆత్మకూరు ప్రాంతాన్ని జేసీ సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్‌ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. దెబ్బతిన్న వరి, పత్తి, పసుపు, కంది, అరటి పంటల వివరాలను తెలియజేయాలని ఆదేశించారు. రహదారులపై వాగులు ప్రవహించే చోట పోలీసులు, అర్‌అండ్‌బీ అధికారులు రెడ్‌ కలర్‌ సూచికలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి 2 గంటలకు ఒక సారి తుఫాన్‌ ప్రభావంపై రియల్‌ టైమ్‌కు రిపోర్టులు తెప్పించడంతో పాటు అప్రమత్తంగా ఉండాలని డీఆర్‌వో, విపత్తుల నిర్వహణ డీపీఎంలను ఆదేశించారు. 

చాగలమర్రి మండలంలో కలెక్టర్‌ వీర పాండియన్‌, ఎస్పీ ఫక్కీరప్ప, సబ్‌ కలెక్టర్‌ కల్పనకుమారి పర్యటించారు. కలుగొట్లపల్లె, బ్రాహ్మణపల్లె వద్ద వక్కిలేరు వంతెనల వద్ద  పరిస్థితిని సమీక్షించారు. వాగుదాటే ప్రయత్నం చేయరాదని కలెక్టర్‌ సూచించారు. వంతెన ఎత్తు పెంచాలని కలెక్టర్‌కు ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఆళ్లగడ్డ డీఎస్పీ రాజేంద్ర,  పశుసంవర్థక శాఖ డీడీ నరసింహరావు ఉన్నారు. తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలకు త్వరలోనే పరిహారం అందచేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి తెలిపారు. మహానంది మండలం మసీదుపురం, సీతారామపురం, గాజులపల్లి, తిమ్మాపురం, మహానందిలోని తుఫాన్‌ వల్ల దెబ్బతిన్న వరి, మెక్కజొన్న, అరటి పంటలను నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారితో కలిసి పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం సీతారామపురం గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు.



30 వరకు వర్షాలు

ఎమ్మిగనూరు టౌన్‌, నవంబరు 27: నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో ఈనెల 30 వరకు జిల్లాలో వర్షాలు కురుస్తామని జిల్లా వ్యవసాయ వాతావరణ విభాగం, బనవాసి కేవీకే శాస్త్రవేత్త మహదేవయ్య ప్రకటనలో తెలిపారు. నవంబరు 28న  పాములపాడు, ఆత్మకూరు మండలాలు మినహా మిగత మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. 29న పాములపాడు, ఆత్మకూరు మినహా మిగతా అన్ని మండలాల్లో చిరుజల్లుల నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. 30న ఎమ్మిగనూరు, జూపాడుబంగ్లా, నందికొట్కూరు, నందవరం, శ్రీశైలం, మంత్రాలయం, పాములపాడు, కోసిగి, ఆత్మకూరు మండలాలు మినహా మిగతా అన్ని మండలాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. పొలాల్లో నీరు నిలిచి ఉంటే తీసివేయాలని, అలాగే 10 గ్రాముల పోటాషియం నైట్రేట్‌ను లీటర్‌ నీటిలో కలిపి 10రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలని సూచించారు. 



Updated Date - 2020-11-28T05:21:16+05:30 IST