ముంచేసిన.. నివర్‌

ABN , First Publish Date - 2020-11-28T05:13:59+05:30 IST

జిల్లాలో నివర్‌ తుపాను పంటలను అతలాకు తలం చేసింది. రెండు రోజులుగా విడవకుండా కురు స్తున్న వర్షాలు పంట పొలాలను ముంచేసింది.

ముంచేసిన.. నివర్‌
నానిపోతున్న వరి ఓదెలను చూపుతున్న రైతులు

కోతకొచ్చిన ధాన్యం వర్షార్పణం

ఖరీఫ్‌ను తుడిచి పెట్టేసిన తుపాను

నేలవాలిన కంకుల  నుంచి మొలకలు

పల్నాడులో వరి, పత్తి పంటలకు తీవ్రనష్టం

వీడని వర్షాలతో పొంగి ప్రవహిస్తున్న వాగులు


   నివర్‌  నిండా ముంచేసింది. తుపాను ప్రభావం జిల్లాపై తీవ్రంగా ఉంది. రెండు రోజులుగా విడవ కుండా వర్షం పడుతూనే ఉంది. చేతికి అందాయి అనుకున్న పంటలు వర్షార్పణమ య్యాయి. ఖరీఫ్‌లో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి.. అని ఆనం దంగా ఉన్న అన్నదాతల వెన్ను విరిచేసింది. డెల్టా ప్రాంతంలో ఒక్క ఎకరాను కూడా మిగల్చకుండా సర్వం తుడిచిపెట్టేసింది. కోతకోసి చేలపై ఎండేందుకు ఉంచిన ఓదెలు వాన నీటి ప్రవాహానికి కొట్టుకు పోతున్నాయి. నేలవాలిన వరి కంకుల నుంచి మొలకలొస్తున్నాయి. ఇటీవల వచ్చిన వరదల నుంచి కొనూపిరితో బయటపడేందుకు చిగురు తొడుగుతున్న వాణిజ్య పంటలనూ తుపాను పెనుగాలులు వదిలిపెట్టలేదు.  ఇటు ఖరీఫ్‌నే కాకుండా, రూ.వేల కోట్లు ఇప్పటికే నష్టపోయి మూలుగుతున్న మెట్ట రైతు నడ్డి విరిచేశాయి. రెండు రోజుల నుంచి జిల్లాలో సుమారు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 


(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌) 

జిల్లాలో నివర్‌ తుపాను పంటలను అతలాకు తలం చేసింది. రెండు రోజులుగా విడవకుండా కురు స్తున్న వర్షాలు పంట పొలాలను ముంచేసింది. కుప్ప లు వేసిన రైతులూ నిలువునా వాన నీటిలో మునిగిపోయారు. కొతకోసి ఇంటికి తెచ్చుకుందామన్న తరుణంలో తుపాను రూపంలో పంట నీటిపాలైందని రైతులు భోరున విలపిస్తున్నారు. గాలుల తీవ్రతకు వరి పైరు పూర్తిగా పడిపోయి చాపలాగ మారింది. ఈ చాపలా మారిన వరి పైరు సైతం నీటిలలో నానుతుండటంతో దెబ్బతినే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. పడిపోయిన వరి కంకుల నుంచి మొక్కలొస్తున్నాయి. జిల్లాలో సుమారు 30- 35 మండలాల్లో నాలుగు లక్షల ఎకరాలలో కోత కొచ్చిన వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. 23 మండలాల్లో సుమారు ఐదువేల హెక్టార్లలో కూరగాయలు, అరటి, బొప్పాయి, మిర్చి, పసుపు పంటలు దెబ్బతిన్నట్లు అధి కారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. కోతకొచ్చిన మినుము కాయలు వాన నీటికి నాని మొక్కలొచ్చాయి. గుంటూరు, నరసరావుపేట, గురజాల డివిజన్లలో మిర్చి, పత్తి తదితర పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసా యశాఖ జేడీ విజయభారతి కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌ దృష్టికి తెచ్చారు. జిల్లాలో శుక్రవారం ఉద యం 8 గంటల వరకు 57 మండలాల్లో 7.38 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలి పారు. రెండు రోజులుగా ఎడతెరపిలేని వర్షాలతో పొలాలన్నీ నీటిలోనే నానుతున్నాయి. డ్రెయిన్లు పూడుకుపోయి ఉండటంతో పంట పొలాల్లోని నీరు బయటకు వెళ్ళే పరిస్థితిలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం బ్యారేజి దిగువున తాడేపల్లి మొదలుకుని రేపల్లె, బాపట్ల తీర మండలాల వరకు వాన నీటిలోనే ఓదెలున్నాయి. కొల్లూరు, భట్టిప్రోలు, వేమూ రు మండలాల్లో వర్షపు నీటికి కొట్టుకుపోతున్నాయి. కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లోని లంక గ్రామాల్లో అరటి దెబ్బతింటే, తెనాలి, దుగ్గిరాల, మంగళగిరి మండలాల్లో మాగాణిలో వేసిన అరటి తోటలు గాలులకు నేలకొరిగాయి. ఈ మండలాల్లో సుమారు 1800 ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయనేది ప్రాథమిక అంచనా. రేపల్లె నియోజకవర్గంలో సుమారు 1,40,000  ఎకరాలలో వరి పంట వేయగా 40 వేల ఎకరాలకుపైనే వరి పైరు నేలవాలి నీటిలో నానుతుంది. పొన్నూరు మండలంలో వెయ్యి ఎకరాల్లోని తమలపాకు తోటల్లో నీరు నిలిచి ఉంది. బాపట్ల మండలంలోని 29 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. తాడేపల్లి మండలంలో దాదాపు 600 హెక్టార్లలో వరిపైరు నేలవాలింది. కందపంట కూడా నీటిలో మునిగిపోయింది. కుంచనపల్లి ప్రాం తంలో ఆకు కూరలకు నష్టం వాటిల్లింది. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, వ్యవ సాయ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌, జేసీ దినేష్‌ శుక్రవారం రేపల్లె, భట్టిప్రోలు తదితర ప్రాం తాల్లో పర్యటించారు. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పర్యటించారు. మంత్రివర్గం సమావేశంలో రాష్ట్రం మొత్తంమీద 29,752 హెక్టార్లలో మాత్రమే పంట దెబ్బతిన్నట్టు ప్రాఽథమిక అంచనా వేయడం దారుణమన్నారు. ప్రభుత్వం రైతు కష్టాన్ని కళ్లతో చూస్తోందో, లేక దీనికికూడా కొత్త యాప్‌ను తీసుకొచ్చిందో అర్ధం కావటంలేదన్నారు. అంచనాల్లో జిల్లాను ప్రస్తావించలేదన్నారు. ఇక్కడ ఒక్క ఎకరా కూడా మిగలకుండా తుడిచిపెట్టుకు పోతే, నష్టం లేదన్నట్టు చూపటం విడ్డూరంగా ఉందన్నారు.  





పల్నాడులోనూ తీవ్ర నష్టం

ఎడతేరపి లే కుండా కురుస్తున్న వర్షాలతో పల్నాడు ప్రాంతంలోని పలు వా గులు ఉధృతంగా ప్రవహి స్తున్నాయి. కోత దశలో ఉన్న వరి పడి పోగా శనగ, పత్తి, మిరప పంటలు నీట మునిగాయి. పడి పోయిన వరి ఓదెలను నిలబెట్టే పనిలో రైతులు నిమగ్నమయ్యా రు. రొంపిచర్ల మండలంలో తుం గపాడు, నరసరావుపేట పట్టణం లోని గుంటూరు రోడ్డులో వరద నీరు రోడ్లపై ప్రవహించింది. వరి కంకి దశలో ఉండటంతో పైరు వాలిపోయి కం కులు నీటిలో నానుతున్నాయి. తాడికొండ మండ లంలోని కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. రెండు రోజులు నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, పొలాలు జలమయమయ్యాయి. పాము లపాడులో  రోడ్లుపైకి నీరు చేరటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  గుంటూరు - మాచర్ల ప్రధాన రహదారిపై సత్తెన పల్లి మండలంలోని మురళీనగర్‌ వద్ద శుక్రవారం చింతచెట్లు కూలిపోయింది. దీంతో మార్గంలో వెళ్ళే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మండలంలోని భృగుబండ వద్ద ఎద్దువాగుపై ఉన్న అప్రోచ్‌ రోడ్డు కొట్టుకుపోయింది.


రూ.1387.68 కోట్ల పంట వర్షార్పణం

తుపాను ప్రభావంతో జిల్లా పంటలు తీవ్రంగా నష్టపో యాయి. పశ్చిమ డెల్టాలో వర్షాలు, గాలులతో 4.5 లక్షల ఎకరా ల్లో వరి పూర్తిగా నేలపై వాలింది. ఈ సారి ప్రకృతి అనుకూలించటంతో ఎకరాకు సగటున 38 బస్తాల వరకు దిగుబడి వస్తుందని రైతులు ఆశించగా వారి ఆశలు నీటిపాలయ్యాయి. ప్రభుత్వం నిర్ణయించిన 75 కిలోల ధాన్యం బస్తా ధర రూ.1416 ప్రకారం చూస్తే 3.5 లక్షల ఎకరాల్లో 98 లక్షల బస్తా ల దిగుబడి దక్కనట్లే. అంటే రూ.1387.68 కోట్ల ధాన్యం దిగుబడి రైతులకు దక్కకుండా పోతోందని అంచనా.


ఆర్టీసీ సర్వీసుల రద్దు

తుపాన్‌ ప్రభావం ఆర్టీసీపై పడింది. గుంటూరు నుంచి బయల్దేరే చెన్నై, తిరుపతి, బెంగళూరు సర్వీసులను రద్దు చేసి నట్లు ఇన్‌చార్జి ఆర్‌ఎం శరత్‌ బాబు తెలిపారు.  పిడుగురాళ్ళ నుంచి వెళ్లే బెంగళూరు సర్వీసును కూడా రద్దు చేశారు. ప్రయాణికుల రద్దీ తగ్గటంతో పల్నాడు రూట్‌తో పాటు ఇతర రూట్‌లలో కొన్ని ట్రిప్పులను తగ్గించినట్లు తెలిపారు.  


Updated Date - 2020-11-28T05:13:59+05:30 IST