నిత్యశత్రుఘ్నుడు

ABN , First Publish Date - 2020-07-25T08:27:26+05:30 IST

రఘువంశ మహారాజుల శౌర్యపరాక్రమాలు, విద్యా వినయాలు, ప్రజారంజకమైన పరిపాలన మొదలైన గుణగణాలను కాళిదాసమహాకవి రఘువంశ మహాకావ్యారంభంలో వర్ణించాడు.

నిత్యశత్రుఘ్నుడు

రఘువంశ మహారాజుల శౌర్యపరాక్రమాలు, విద్యా వినయాలు, ప్రజారంజకమైన పరిపాలన మొదలైన గుణగణాలను కాళిదాసమహాకవి రఘువంశ మహాకావ్యారంభంలో వర్ణించాడు. రఘువంశరాజులు ఎల్లప్పుడూ యుద్ధంలో తమ పరాక్రమాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉండేవారట. రఘువంశ రాజులందరూ అరివీర భయంకరులై అవలీలగా శత్రుసంహారం చేయగల శక్తిసామర్థ్యాలు కలవారే అయినా.. అపూర్వంగా దశరథ మహారాజు  నలుగురు పుత్రులలో ఒకరికి ప్రత్యేకించి ‘శత్రుఘ్నుడు’ అనే పేరును వసిష్ఠ మహర్షి పెట్టడంలో ఉన్న ఔచిత్యాన్ని మనం గుర్తించాలి. శత్రుఘ్నుడు అంటే.. శత్రువులను సంహరించేవాడు. శత్రువులంటే బయటి శత్రువులే కాదు. నిజానికి బయటి శత్రువుల వల్ల మనకు అన్ని వేళలా ప్రమాదం ఉండదు. కానీ, ఇంద్రియాలు అనే శత్రువులు మాత్రం అందరినీ, అన్నిచోట్లా బాధిస్తూనే ఉంటాయి. 


‘‘బలవానింద్రియగ్రామో విద్వాంసమపికర్షతి’’

అని వేదవ్యాస భగవానుడు శ్రీమద్భాగవతంలో పేర్కొన్నాడు. ఇంద్రియాల బలం విద్వాంసులను సైతం ఆకర్షిస్తూ, అతణ్ని తమ వశం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇంద్రియాలు, వాటికి నాయకత్వం వహించే మనసే మనుషుల బంధమోక్షాలకు, పేరుప్రతిష్ఠలకు.. అన్నింటికీ మూలకారణంగా నిలుస్తుంది.


‘‘ఇంద్రియాణి హయానాహుః’’

అంటూ కఠోపనిషత్తు ఇంద్రియాలను గుర్రాలతో పోల్చింది. గుర్రాల్లా విషయ సుఖాల వైపు పరుగులు తీసే నిత్య శత్రువుల వంటి అంతరింద్రియాలను, బాహ్యేంద్రియాలను శత్రుఘ్నుడు తన వశంలో పెట్టుకున్నాడు. ఏనాడూ ఇంద్రియాల వశంలోకి వెళ్లలేదు. భరతుణ్ని ఎప్పుడూ నీడలా వెన్నంటి ఉంటూ అతడి శత్రువులను ఓడించడమే కాక.. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాన్ని కూడా జయించిన వాడు శత్రుఘ్నుడు. ప్రజలందరి ప్రేమాదరాలను పొందిన శ్రీరాముడి సేవలో కాకుండా శ్రీరామభక్తుడైన భరతుడి సేవలోనే సంపూర్ణంగా నిమగ్నమయినాడు. తనకంటూ వేరుగా ఏ ప్రయోజనాన్ని ఆశించని పాపరహితుడు, నిత్య శత్రుఘ్నుడు అయిన శత్రుఘ్నుడు సోదర ప్రేమతో భరతుని ఎంతో ప్రీతిగా అనుసరించాడని 


గచ్ఛతా మాతులకులం భరతేన తదానఘః

శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న; నీతః ప్రీతి పురస్కృతః


వాల్మీకి మహర్షి అయోధ్యకాండలోని ప్రారంభ శ్లోకంలో పేర్కొన్నాడు. అందుకే.. భరతుడు శ్రీరామపాదుకా సేవకుడైతే శత్రుఘ్నుడు భరత సేవా తత్పరుడుగా ప్రఖ్యాతిని పొందాడు. ‘‘మమ మద్భక్త భక్తేషు ప్రీతిరత్యధికా భవేత్‌’’ అని పరమాత్ముడు చెప్పినట్లు.. శ్రీరామచంద్రప్రభువుకు కూడా తనకు ప్రియ భక్తుడైన భరతుని సేవలోనున్న శత్రుఘ్నడంటే అమితమైన ప్రేమాభిమానాలు ఉండేవి.


సముద్రాల శఠగోపాచార్యులు, 9059997267

Updated Date - 2020-07-25T08:27:26+05:30 IST