ప్రాణ రక్షణలో ఎన్‌డీఆర్ఎఫ్‌ సేవలు ప్రశంసనీయం : కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2021-01-21T01:55:41+05:30 IST

విపత్తులు సంభవించిన సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటంలో జాతీయ

ప్రాణ రక్షణలో ఎన్‌డీఆర్ఎఫ్‌ సేవలు ప్రశంసనీయం : కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ : విపత్తులు సంభవించిన సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటంలో జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్ఎఫ్‌) ప్రదర్శిస్తున్న కర్తవ్యబద్ధత ప్రశంసనీయమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పేర్కొన్నారు. ఎన్‌డీఆర్ఎఫ్ 16వ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 


విపత్తులు సంభవించినపుడు ఎన్‌డీఆర్ఎఫ్ అత్యున్నత స్థాయి వృత్తి నైపుణ్యం, దృఢ నిశ్చయం, కఠోర శ్రమ ప్రదర్శిస్తోందని, ప్రజల ప్రాణాలను కాపాడటంలో కర్తవ్యబద్ధతతో వ్యవహరిస్తోందని నిత్యానంద రాయ్ ప్రశంసించారు. కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఎన్‌డీఆర్ఎఫ్ అసాధారణ కృషి చేసిందన్నారు. ప్రజారోగ్య సేవల వంటి ప్రభుత్వ కార్యక్రమాలను సమన్వయపరచడంలో చురుకైన పాత్ర పోషించిందన్నారు. విపత్తు నిర్వహణ పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు తెలిపారు. ఎన్‌డీఆర్ఎఫ్‌కు సాధ్యమైనంత సహాయాన్ని అందజేసేందుకు హామీ ఇచ్చారన్నారు. 


ఇటీవల మహిళా రెస్క్యూయర్స్‌ను కూడా ఎన్‌డీఆర్ఎఫ్‌లో నియమించినట్లు తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసినవారికి దేశం రుణపడి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలందించిన సిబ్బందికి సేవా పతకాలను ప్రదానం చేశారు. 


Updated Date - 2021-01-21T01:55:41+05:30 IST