నిత్య చైతన్యశీలి!

ABN , First Publish Date - 2022-08-12T09:26:02+05:30 IST

భూదానోద్యమ సారథి ఆచార్య వినోభా భావే మాదిరిగానే వెంకయ్యనాయుడు కూడా సూటిగా, సముచిత పదాలతో స్పష్టంగా విషయాన్ని వ్యక్తీకరించే ప్రతిభాశాలి అని ప్రధాని మోదీ కొనియాడారు.

నిత్య చైతన్యశీలి!

వినోభా భావే మాదిరి ప్రతిభాశాలి

సూటిగా అభిప్రాయ వ్యక్తీకరణ

పదవీ విరమణ సందర్భంగా వెంకయ్యకు ప్రధాని మోదీ లేఖ

సైద్ధాంతిక నిబద్ధత, అనర్గళ వాగ్ధాటి..

ఆయన ఆతిథ్యం అసాధారణం: మోదీ


న్యూఢిల్లీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): భూదానోద్యమ సారథి ఆచార్య వినోభా భావే మాదిరిగానే వెంకయ్యనాయుడు కూడా సూటిగా, సముచిత పదాలతో స్పష్టంగా విషయాన్ని వ్యక్తీకరించే ప్రతిభాశాలి అని ప్రధాని మోదీ కొనియాడారు. రానున్న సంవత్సరాల్లో ఆయన క్రియాశీలంగా, నిత్య చైతన్యశీలిగా ఉండాలని ఆకాంక్షించారు. బుధవారం ఉపరాష్ట్రపతిగా వెంకయ్య పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని ఆయనకు మూడు పేజీల లేఖ రాశారు. వెంకయ్య అనుభవం, పరిజ్ఞానం భవిష్యత్‌లో ప్రభుత్వాలకు ఎంతో ఉపయోగపడతాయని.. ప్రజాజీవితంలో ప్రవేశించాలనుకునేవారికి ఆయన జీవన గమనం ఎంతో ప్రేరణ ఇస్తుందని అభిప్రాయపడ్డారు. నెల్లూరులోని ఇరుకు వీధుల నుంచి.. ఉపరాష్ట్రపతి దాకా ఎదగడం సామాన్యం కాదని.. నాడు ఎటువంటి ఉనికీ లేని రాజకీయ పార్టీలో పనిచేయడం, రాజకీయ ఉద్యమం నిర్వహించడం వెంకయ్య సైద్ధాంతిక నిబద్ధత, చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రధాని కొనియాడారు. ‘అత్యధిక భాగం ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్యే వంటి పదవులు నిర్వహిస్తూ తన యవ్వనమంతా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే గడిపారు. ఎన్ని సవాళ్లు, ఎదురుదెబ్బలు ఎదురైనా తట్టుకుని మరింత సాహసంతో పనిచేశారు. వెంకయ్యలో ఉన్న శక్తి అపారం. అది ఆయన వ్యంగ్యం, చమత్కారంలో కనిపిస్తుంది. ఎటువంటి సంక్లిష్ట విషయాన్నైనా అద్భుతంగా వ్యక్తీకరించడం వెంకయ్య బలం’ అని తెలిపారు.


ఆడ్వాణీ రథయాత్ర సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సభల్లో వెంకయ్య గుక్కతిప్పుకోకుండా అనర్గళంగా మాట్లాడి ప్రజలను మెప్పించేవారని మోదీ గుర్తు చేసుకున్నారు. రాజ్యసభ చైర్మన్‌గా వెంకయ్య అత్యంత ప్రతిభావంతంగా పనిచేశారని, ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చారని మోదీ పేర్కొన్నారు. జీవితంపై వెంకయ్యకున్న ఉత్సాహం తనను ఆయన అభిమానిగా మార్చిందని, ఆయన ఆతిథ్యం అసాధారణమని తెలిపారు. ఏటా సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశాల్లో తెలుగు ప్రజల వంటకాలు, సంస్కృతి ఆయన ఇంట శోభిల్లేదన్నారు.

Updated Date - 2022-08-12T09:26:02+05:30 IST