నత్రజని ఒక్క శాతమే!

ABN , First Publish Date - 2022-05-09T05:19:40+05:30 IST

రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో సాగు భూములు రోజురోజుకూ వట్టిపోతున్నాయి.

నత్రజని ఒక్క శాతమే!
ఫమూడేళ్లుగా కొద్దిమేర మెరుగుపడిన యూరియా పరిమాణం


  • ఉమ్మడి జిల్లాలో భూసారంలో భారీ అసమతుల్యం
  • 93.1శాతం భూముల్లో భాస్వరం, 56.5శాతం భూమిలో పొటాష్‌ అధికం
  • కాంప్లెక్స్‌ ఫర్టిలైజర్‌ విచ్చలవిడి వాడకమే కారణం

రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో సాగు భూములు రోజురోజుకూ వట్టిపోతున్నాయి. భూసార పరీక్షల్లో ఇది తేటతెల్లం అయింది. ధాతు లోపాలపై రైతులకు అవగాహన లేకపోవడంతో భూములు సహజత్వాన్ని కోల్పోతున్నాయి. ముఖ్యంగా భూమిలో నత్రజని శాతం చాలా తక్కువగా ఉంది. అలాగే కాంప్లెక్స్‌ ఎరువుల వాడకం భారీగా పెరగడంతో పొటాషియం, పాస్ఫర్‌సల శాతం ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉంది. దీంతో భూమి సహజ గుణాన్ని కోల్పోవడంతో పంటల్లో దిగుబడి, నాణ్యత తగ్గుతున్నాయి. డీఏపీ అధిక వాడకంతో రైతులకు పెట్టుబడి ఖర్చూ పెరుగుతోంది.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడడంతో ఉమ్మడి జిల్లాలో భూసారంలో భారీ వ్యత్యాసాలు కలగడం ఆందోళనలు కలిగిస్తోంది. భూసార పరీక్షలు ఏటా చేయిస్తున్నా అధికారుల సిఫారస్సుల మేరకు రైతులు ఎరువులు వాడడం లేదు. మోతాదుకు మించి రసాయన ఎరువులు చల్లుతుండడంతో భూములు సహజత్వాన్ని కోల్పోతూ విషతుల్యమవుతున్నాయి. కేంద్రం తాజాగా విడుదల చేసిన భూసార పరీక్షల ఫలితాల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాదీ 99శాతం భూముల్లో నత్రజని లోపం తేటతెల్లమైంది. వరుసగా మూడేళ్లుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పంట భూముల్లో నత్రజని శాతం మెరుగుపడ లేదు. ఇదే సమయంలో భాస్వరం, పొటాష్‌ పరిమాణం మాత్రం ఉండాల్సిన దానికంటే అనేక రెట్లు ఎక్కువ ఉన్నట్టు భూసార పరీక్షల్లో వెల్లడైంది. గతంతో పోలిస్తే పొటాష్‌ వాడకం కొద్దిమేర తగ్గడం ఆహ్వానించతగ్గ పరిణామం. దేశ వ్యాప్తంగా నిర్వహించిన భూసార పరీక్షల వివరాలను కేంద్ర వ్యవసాయశాఖ ఇటీవల విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో భూసారం భారీగా దెబ్బతిన్నట్టు ఈ నివేదికల్లో పేర్కొన్నారు. 

విచ్చలవిడిగా ఫర్టిలైజర్‌ వాడకం

రైతులు అవగాహన లేకుండా విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడుతుండడంతో భూమిలో ప్రధాన పోషకాలు, సూక్ష్మదాతు లోపాలకు కారణంగా కనిపిస్తోంది. భూసార పరీక్షల ఆధారంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు సిఫారసు మేరకు కాకుండా రైతులు ఇష్టానుసారం రసాయన ఎరువులు చల్లుతుండటంతో భూసారంలో సమతుల్యత లోపిస్తోంది. సాంకేతికంగా ఆలోచించకుండా ఎడాపెడా రైతులు ఎరువులు చల్లుతున్నారు. ముఖ్యంగా దుక్కుల్లో పొటాషియం, పాస్ఫరస్‌ పాలు ఎక్కువగా ఉండే కాంప్లెక్స్‌ ఎరువులను ఎక్కువ వాడుతున్నారు. భూముల్లో సమతుల్యత లోపించి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోంది. తాజా పరీక్షల నివేదికల ప్రకారం ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది కూడా 99శాతం భూముల్లో నత్రజని లోపాన్ని గుర్తించారు. వీటిలో 17శాతం భూముల్లో నత్రజని కనీస స్థాయిలో కూడా లేదు. ఇది మరింత ఆందోళన కలిగించే అంశం. భాస్వరం, పోటాషియం ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువ స్థాయిలో ఉన్న విషయం బయటపడింది. ఇక్కడ విశేషమేమంటే తక్కువ ధర ఉన్న యూరియాను రైతులు పంట కాలంలో మూడు నాలుగు సార్లు చల్లాలి. కానీ రెండు సార్లే వెదజల్లి ఊరుకుంటున్నారు. కానీ యూరియా ధరకు రెట్టింపు రేటు ఉన్న కాంప్లెక్స్‌ ఎరువులను అధికంగా వాడుతున్నారు. అంటే పంటకు ఎక్కువ అవసరం, పత్రహరితానికి ఎక్కువ అవసరం ఉన్న యూరియాను తక్కువ చల్లుతున్నారు. 

లోపిస్తున్న ఖనిజ లవణాల సమతుల్యత 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 93.1శాతం భూముల్లో సిఫారసుకు మించి భాస్వరం ఉన్నట్లు తేలింది. 80.2శాతం భూముల్లో అత్యధికస్థాయిలో భాస్వరం ఉంది. 5.9శాతం భూముల్లో మాత్రమే భాస్వరం ఉండాల్సిన మోతాదులో ఉంది. ఒక్క శాతం భూమిలో మాత్రమే భాస్వరం తక్కువగా ఉంది. సాధారణంగా భాస్వరం ఒక హెక్టార్‌(రెండున్నర ఎకరాల)కు 25కిలోలకు మించి ఉండకూడదు. కానీ కొన్ని ప్రాంతాల్లో అంతకుమించి వాడుతుండడం గమనార్హం. అలాగే పొటాషియం 56.5శాతం భూముల్లో అధికంగా ఉన్నట్లు తేలింది. ఇందులో 12.1శాతం భూముల్లో అత్యధిక స్థాయిలో నమోదైంది. 12.1శాతం భూమిలో పొటాషియం తక్కువగా ఉంది. మూడేళ్లతో పోలిస్తే భూమిలో పొటాషియం శాతం కొంత తగ్గడం గమనార్హం. మూడేళ్ల కింద పొటాషియం జిల్లాలోని 88శాతం భూముల్లో మోతాదుకు మించి ఉండగా ఇప్పుడా భూముల శాతం 56.5కి పడిపోయింది. రైతులు పొటాష్‌ వాడకం తగ్గించిన కారణంగానే పరిస్థితి మెరుగుపడినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పొటాషియం ఒక హెక్టార్‌లో 280కిలోలకు మించి ఉండకూడదు. పొటాష్‌ వాడకం తగ్గినా ఇంకా 56.5శాతం భూముల్లో అధికంగా ఉండడంతో ఈ ఏడాది కూడా పొటాష్‌ వాడకాన్ని మరింత నియంత్రించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఇక పంటలకు ముఖ్యమైన సేంద్రీయ కర్బనాలు 0.5శాతం మాత్రమే ఉండడం గమనార్హం. సూక్ష్మదాతువులు జింక్‌, మాంగనీస్‌, కాపర్‌, బోరాన్‌ పుష్కలంగా ఉండగా ఇనుము, సల్ఫర్‌ కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూసార పరీక్షల నివేదికల ప్రకారం ఉమ్మడి జిల్లాలో డీఏపీ, పొటాష్‌ వాడకాన్ని రైతులు బాగా తగ్గించాల్సి ఉంటుంది. ఇందుకు మండల స్థాయి, గ్రామస్థాయిల్లో ఉండే ఏవోలు, ఏఈవోలు క్షేత్ర పర్యటనలు చేసి రైతుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. భూసార పరీక్షా ఫలితాలకు అనుగుణంగా సిఫారస్సుల మేరకే రైతులు ఎరువులు వినియోగిస్తే రైతులకు, సమాజానికి ప్రయోజనం కలుగుతుంది. భూసారంలో సమతుల్యత కాపాడుకోవడమేకాకుండా పెట్టుబడి ఖర్చు తగ్గి ఆదాయం కూడా పెరుగుతుంది. అదేకాకుండా ప్రజలు వినియోగించే పంట ఉత్పత్తుల్లో నాణ్యత మెరుగుపడుతుంది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూసార పరీక్షల ఫలితాలు

నత్రజని 99శాతం తక్కువ

భాస్వరం 93.1శాతం అధికం

పొటాష్‌         56.5శాతం అధికం

Read more