పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి తొందరలోనే రాజ్యసభకు వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని జనతాదళ్ యూనియన్ పార్టీ స్పష్టం చేసింది. ప్రజలు నితీశ్ నేతృత్వంలోని కూటమిని ఎన్నుకున్నారని, నితీశ్ బిహార్ ప్రజల కోసమే పని చేస్తారని ఆ పార్టీ శుక్రవారం పేర్కొంది. జేడీయూ నేత, బిహార్ మంత్రి సంజయ్ కుమార్ ఝా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
‘‘నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లబోతున్నట్లు వస్తున్న వార్తలు తప్పుడు ప్రచారంలో భాగం. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కొందరు చేస్తున్న ప్రచారం ఇది. ఆయన బిహార్ ప్రజల్ని వదిలేసి ఎక్కడికీ వెళ్లడం లేదు. ప్రజానిర్ణయం ప్రకారం.. ఆయన బిహార్ ప్రజల సేవలోనే పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా ఉంటారు. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ నేతృత్వంలోని ఎన్డీయేకు అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజాసేవపై ఆయనకు ఉన్న అంకితభావం, బిహార్‌ను మరింత అభివృద్ధి చేయాలన్న సంకల్పం చెక్కుచెదరవు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజల్ని కోరుతున్నాను’’ అని సంజయ్ కుమార్ ఝా ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి