Bihar: మాజీ సహచరుడు ఆర్‌సీపీ సింగ్‌కు సీఎం నితీష్ షాక్..!

ABN , First Publish Date - 2022-08-06T21:08:37+05:30 IST

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒకప్పటి తన మాజీ సహచరుడైన ఆర్‌సీపీ సింగ్‌కు...

Bihar: మాజీ సహచరుడు ఆర్‌సీపీ సింగ్‌కు సీఎం నితీష్ షాక్..!

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) ఒకప్పటి తన మాజీ సహచరుడైన ఆర్‌సీపీ సింగ్ (RCP Sing)కు షాక్ ఇచ్చారు. పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడుగా ఆర్‌సీపీకి సింగ్‌ పనిచేశారు. గత తొమ్మిదేళ్లలో సంపాదించిన ఆస్తుల వివరాలపై సమాధానం ఇవ్వాలని కోరుతూ అధికార జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) తాజాగా ఆయనకు ఒక లేఖ రాసింది. ఆయన (సింగ్) సంపాదించిన ఆస్తుల్లో పలు అవకతవకలు జరగడం తమ దృష్టికి వచ్చిందని ఆ లేఖలో జేడీయూ పేర్కొంది. సింగ్ భవిష్యత్ ముఖ్యమంత్రి అంటూ నినాదాలతో కూడిన ఒక వీడియో వారం రోజుల క్రితం వెలుగుచూసిన నేపథ్యంలో జేడూయూ ఈ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


కాగా, తనకు జేడీయూ పంపిన లేఖపై ఆర్‌సీపీ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను చిన్నబుచ్చే ప్రయత్నం పార్టీ చేస్తోందన్నారు. 2010 నుంచి తన భార్య, కుమార్తె పన్నులు చెల్లిస్తున్నారని, అవి వాళ్లు కొనుగోలు చేసిన ఆస్తులని చెప్పారు.


మాజీ ఐఏఎస్ అధికారి కూడా అయిన ఆర్‌సీపీ సింగ్‌ను గత జూన్‌లో పాట్నా వీఐపీ జోన్‌లోని సువిశాల భవంతి నుంచి ఖాళీ చేయించారు. నితీష్‌కు ఒకప్పుడు అత్యంత విశ్వసనీయుడుగా ఆర్‌సీపీ సింగ్‌‌కు పేరుంది. అయితే ఇటీవల ఆయనకు మరో విడత రాజ్యసభ టిక్కెట్ ఇచ్చేందుకు జేడీయూ నిరాకరించింది. దీంతో ఆయన కేంద్ర మంత్రి పదవి నుంచి దిగిపోయారు. ముఖ్యమంత్రి అనుమతి లేకుండానే ఆయన కేబినెట్ పదవిని అంగీకరించడంపై జేడీయూ కన్నెర్ర చేసిందని, అందుకే మరో విడత రాజ్యసభ టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించిందని చెబుతారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆర్‌సీపీ సింగ్ నలందా జిల్లాలోని తన స్వగ్రామంలోనే ఉంటున్నారు. చుట్టుపక్కల జిల్లాల్లో పర్యటిస్తూ తనకంటూ సొంత గ్రౌండ్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Updated Date - 2022-08-06T21:08:37+05:30 IST