Modi Vs Nitish : మోదీపై బాణం ఎక్కుపెట్టిన నితీశ్ కుమార్

ABN , First Publish Date - 2022-08-10T21:16:33+05:30 IST

బిహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్

Modi Vs Nitish : మోదీపై బాణం ఎక్కుపెట్టిన నితీశ్ కుమార్

పాట్నా : బిహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్ (Nitish Kumar) చాలా ఉత్సాహంగా కనిపించారు. ఆయన 2024లో ప్రధాన మంత్రి (Prime Minister) అభ్యర్థి అని ఆర్జేడీ (RJD) వ్యాఖ్యానించడంతో మరింత సంతోషంగా ఉన్నారు. ఆ ఊపు మీద ఆయన మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  (Narendra Modi) 2014లో గెలిచారని, అయితే 2024 గురించి ఆయన ఇక ఆందోళన చెందవలసిందేనని అన్నారు. 


జేడీయూ, ఆర్జేడీ తదితర పార్టీల కూటమి ప్రభుత్వం బుధవారం ఏర్పాటైన సంగతి తెలిసిందే. రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.  ప్రమాణ స్వీకారం అనంతరం ఇరువురూ పరస్పరం ఆత్మీయతను పంచుకున్నారు. నితీశ్‌కు పాదాభివందనం చేసేందుకు తేజస్వి ప్రయత్నించగా, నితీశ్ చిరునవ్వుతో అడ్డుకుని, కరచాలనం చేశారు. ఎన్డీయే నుంచి జేడీయూ మంగళవారం వైదొలగింది. 


నితీశ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఈ నూతన ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోతుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానించడంపై స్పందించారు. తన ప్రభుత్వం బాగా నడుస్తుందన్నారు. బీజేపీని వదిలిపెట్టాలని జేడీయూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకుందన్నారు. తన ప్రభుత్వం 2024 వరకు ఉన్నా, లేకపోయినా, వాళ్లు (బీజేపీ) తమకు కావాలనుకున్నది మాట్లాడవచ్చునన్నారు. కానీ తాను మాత్రం 2014లోనే ఉండిపోనని చెప్పారు. 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే విజయం సాధించిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. 


అంతకుముందు బీజేపీ నేత సుశీల్ మోదీ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, నితీశ్ కుమార్ నేతృత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తన పదవీ కాలం ముగియక ముందే (2025కు ముందే) పతనమవుతుందన్నారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్య పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకుని ఆ పార్టీని చీల్చుతారని ఆరోపించారు. మాజీ కేంద్ర మంత్రి ఆర్‌సీపీ సింగ్ ద్వారా జేడీయూను చీల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని జేడీయూ చేస్తున్న ఆరోపణలను కూడా సుశీల్ మోదీ తోసిపుచ్చారు. నితీశ్ కుమార్ అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే సింగ్‌కు కేంద్ర మంత్రి పదవిని ఇచ్చినట్లు తెలిపారు. 


ఇదిలావుండగా, ఆర్జేడీ నేత శరద్ యాదవ్ మాట్లాడుతూ, 2024 లోక్‌సభ ఎన్నికలకు నితీశ్ కుమార్ ఆదర్శప్రాయమైన ప్రధాన మంత్రి అభ్యర్థి అని చెప్పారు. ఆయన మహాకూటమి తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి కాగలరన్నారు. 


Updated Date - 2022-08-10T21:16:33+05:30 IST