పాట్నా : దేశవ్యాప్తంగా కులాలవారీ జనగణన జరగాలనే డిమాండ్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తామని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. సోమవారం 10 పార్టీల నేతలతో కలిసి తాను మోదీని కలుస్తానన్నారు.
నితీశ్ కుమార్ శనివారం విలేకర్లతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కులాలవారీ జనగణన నిర్వహించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సోమవారం కలవబోతున్నట్లు తెలిపారు. తనతోపాటు 10 పార్టీల నేతలతో కూడిన ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్తున్నట్లు తెలిపారు. జనాభా లెక్కల సేకరణ కులాలవారీగా జరగాలనేది ప్రజల ఆకాంక్ష అని చెప్పారు. దీనిపై సకారాత్మక (పాజిటివ్) చర్చ జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో మాట్లాడుతూ, జనాభా లెక్కల సేకరణను కులాలవారీగా నిర్వహించబోమని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన తర్వాత నితీశ్ కుమార్ కులాలవారీ జనగణన జరగాలని డిమాండ్ చేశారు.
నితీశ్ జూలై 24న ఇచ్చిన ట్వీట్‌లో, కులాలవారీ జనగణన జరగాలని బిహార్ శాసన సభ, శాసన మండలి 2019 ఫిబ్రవరి 17న, 2020 ఫిబ్రవరి 27న ఏకగ్రీవంగా తీర్మానాలు చేశాయని, వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచించాలన్నారు.
జూలై 31న ఢిల్లీలో జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో కూడా నితీశ్ కుమార్ ఈ డిమాండ్‌ను మరోసారి వినిపించారు.