సభను ఇలాగేనా నడిపేది?: స్పీకర్‌తో నితీష్ వాగ్వాదం

ABN , First Publish Date - 2022-03-14T22:02:30+05:30 IST

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారంనాడు రాష్ట్ర అసెంబ్లీలో సహనం కోల్పోయారు. బీజేపీ సభ్యుడు..

సభను ఇలాగేనా నడిపేది?: స్పీకర్‌తో నితీష్ వాగ్వాదం

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారంనాడు రాష్ట్ర అసెంబ్లీలో సహనం కోల్పోయారు. బీజేపీ సభ్యుడు కూడా అయిన స్పీకర్‌ విజయ్ కుమార్ సిన్హాను నిలదీశారు. రాజ్యాంగం ప్రకారం సభను నడపపాలని అన్నారు. స్పీకర్ తన వాదన వినిపించేందుకు ప్రయత్నించినప్పటికీ నితీష్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆయతో వాగ్వాదానికి దిగారు. ''సభను ఇలాగే నడపాలని మీరు అనుకుంటున్నారా? ఇలాగే నడపాలని అనుకుంటే మేము సభను ముందుకు సాగనీయం. చర్చలు జరగాల్సిన తీరు ఇది కాదు'' అని నితీష్ వ్యాఖ్యానించారు.


దీనిపై స్పీకర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ''మీరంతా కలిసే నన్ను అసెంబ్లీ స్పీకర్ చేశారు. ఇంతటి ఉన్నత స్థానంలో కూర్చున్నప్పటికీ నా ప్రాంతానికి సంబంధించిన అంశానని నేను ప్రస్తావించలేక పోతున్నాను. సభ్యులందరినికీ సమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుంది'' అని అన్నారు.


వాగ్వాదం ఇలా మొదలైంది...

తొలుత లఖిసరాయ్‌కి చెదిన అంశాన్ని బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ సరావుగి లేవనెత్తారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసినప్పటికీ వారిపై తదుపరి చర్యలు తీసుకేలేదని అన్నారు. ఈ దశలో సిన్హా జోక్యం చేసుకుంటూ ''పోలీసులు లఖిసరాయి అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీనిపై మాకంటే సీఎంకే ఎక్కువ తెలిసి ఉంటుంది. మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను'' అని అన్నారు. దీంతో సభలో మూడు సార్లు గంగరగోళం చెలరేగింది. ప్రభుత్వం ఈ అంశాన్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదంటూ స్పీకర్ నిలదీయడంతో సీఎం ఆగ్రహానికి లోనయ్యారు. రాజ్యాంగం ప్రకారం సభను నడపాలని స్పీకర్‌ను కోరారు.


''పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. వారి పనిలో ఎవరి జోక్యం ఉండదు. విచారణ నివేదికను పోలీసులు కోర్టులో సమర్పిస్తారు. ఇక్కడ (అసెంబ్లీలో) ఫైల్ చేయరు. నేను ఎవరినీ చిక్కుల్లోనూ పెట్టను, ఎవరినీ రక్షించే పనీ చేయను. పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు. పదేపదే ఇలాంటి అంశాలను సభలో ఎందుకు లేవనెత్తుతున్నారు. నా సుదీర్ఘ అనుభవంలో ఇలాంటి సందర్భాలు ఎప్పుడూ చూడలేదు'' అంటూ నితీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లఖిసరాయ్ వ్యవహారంలో పోలీసులు ఎవరి ఆస్తులైనా స్వాధీనం చేసుకున్నారా లేదా అనేది కోర్టు చూసుకుంటుందని, సభ (అసెంబ్లీ) కాదని అన్నారు. ''మీరు రాజ్యాంగాన్ని ఓసారి పరిశీలించండి. సభను నడిపేది ఇలాకాదు. సభ్యులు ఏ ప్రశ్న అయినా అడగొచ్చు. ప్రభుత్వం దానికి సమాధానం చెబుతుంది. అంతేకానీ, ఫలానా వ్యక్తి నియోజకవర్గం కాబట్టి ఇదే అంశాన్ని పదేపదే పునరావృతం చేస్తామంటే స్పీకర్ అనుమతించ కూడదు'' అని చైర్‌ను ఉద్దేశించి నితీష్ పేర్కొన్నారు. సభ్యుడు లేవెనత్తిన అంశంపై 60 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి కావాలనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, ఆ విషయంలో జాప్యం ఏవైనా జరిగిందా అనేది తాను సమీక్షిస్తానని చెప్పారు. ఈ అంశం హక్కుల కమిటీ ముందుకు కూడా ఉన్నందున, కమిటీ ఏ సిఫారసులు చేసినా దానిని ప్రభుత్వం పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు.

Updated Date - 2022-03-14T22:02:30+05:30 IST