Abn logo
Nov 10 2020 @ 16:34PM

నితీశ్ కుమార్ సుపరిపాలకుడు!

పాట్నా : నాలుగోసారి ముఖ్యమంత్రిగా బిహార్‌కు సేవలందించాలని ఉవ్విళ్ళూరుతున్న నితీశ్ కుమార్ సుపరిపాలకుడని పేరు సంపాదించారు. ఆయన బంధుప్రీతి, అవినీతి వంటివాటికి దూరంగా ఉండటంతోపాటు ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడమే దీనికి కారణం. మద్యపానంపై నిషేధం విధించడంతో మహిళల ఆదరణ ఆయనకు మరింత కలిసొచ్చింది. మరోవైపు బిహార్‌ ఇబ్బందులకు కారణం దుష్పరిపాలన కాదని, అసలు పరిపాలనే లేకపోవడమని ఆయన గుర్తించారు. అందుకు తగిన విధంగా కృషి చేసి, రాష్ట్రాన్ని ఆర్థికంగా కూడా గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పదవిని నిర్వహించడంతో కొంత వరకు ప్రజల్లో అధికార పక్షంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ, సుపరిపాలకుడిగా ఆయన తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలిగారు. తాజా శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 128 స్థానాల్లో ఆధిక్యం కనిపిస్తున్న నేపథ్యంలో, నాలుగోసారి బిహార్‌కు సారథ్యం వహించే అవకాశాన్ని నితీశ్ చేజిక్కించుకోతున్నారు. 


2005లో రబ్రీ దేవి నుంచి నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవిని స్వీకరించారు. అప్పటికి బిహార్ ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందుల్లో ఉంది. దీనిని విశ్లేషించిన నితీశ్ కుమార్ తన రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కారణం దుష్పరిపాలన కాదని, అసలు పాలనే లేకపోవడమని ఆయన గుర్తించారు. ఆయన నేతృత్వంలోని జేడీయూ ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇవ్వడంతో  2005-06 నుంచి 2014-15  మధ్య కాలంలో మన దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రంగా బిహార్‌ నిలిచింది. 10 శాతానికి పైగా వార్షిక వృద్ధి రేటు నమోదైంది. తాజా ఎకనమిక్ సర్వే ప్రకారం, 2018-19 ఆర్థిక సంవత్సరంలో బిహార్ వృద్ధి రేటు 10.53 శాతం అని, ఇది జాతీయ సగటు కన్నా మెరుగ్గా ఉందని వెల్లడైంది. 


మరోవైపు శాంతిభద్రతల పరిస్థితులను కూడా నితీశ్ కుమార్ మెరుగుపరిచారు. 2005లో నితీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి బిహార్‌లో ఆటవిక రాజ్యం ఉందని పాట్నా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు ఉండేవి. 2000-2005 మధ్య కాలంలో డబ్బుల కోసం కిడ్నాప్‌లు చేయడం చిన్న తరహా పరిశ్రమగా ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అత్యంత జాగ్రత్తగా కఠిన చర్యలు అమలు చేసి, పరిస్థితులను గాడిలో పెట్టగలిగారు. ఆయన చేపట్టిన చర్యలు త్వరగా సత్ఫలితాలు ఇవ్వడం ప్రారంభమవడంతో సుపరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నారు. హత్య కేసులను పరిశీలించినపుడు 2004లో కన్నా 2016లో 33 శాతం తగ్గాయి. హత్య కేసుల మాదిరిగానే ఇతర నేరాలు కూడా తగ్గాయి. ఆర్జేడీ పరిపాలనలో చివరి సంవత్సరం 2004 కావడం గమనార్హం. నేరాలు తగ్గడానికి మరో కారణం నితీశ్ ప్రభుత్వం పోలీసు సిబ్బంది సంఖ్యను విపరీతంగా పెంచడమని చెప్పవచ్చు. 


నితీశ్ కుమార్ ప్రజాదరణ పొందడానికి మరొక కారణం మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తేవడం. రోడ్లు, అనుసంధానాలను మెరుగుపరచడం వల్ల ప్రజలు నితీశ్ పట్ల అభిమానం పెంచుకున్నారు. ప్రజలు ఇప్పటికీ ఓ విషయాన్ని చెప్పుకుంటూ ఉంటారు. అదేమిటంటే, హేమ మాలిని బుగ్గల మాదిరిగా మృదువైన రోడ్లను నిర్మిస్తానని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారని, ఆయన కన్న కలలను నితీశ్ కుమార్ నిజం చేశారని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను కూడా అభివృద్ధి చేశారని ప్రశంసిస్తున్నారు. 


నిరుపేదలకు సైతం విద్యుత్తు సదుపాయం అందడానికి నితీశ్ ప్రభుత్వం కృషి చేసింది. తాజా ఎకనమిక్ సర్వే నివేదిక ప్రకారం విద్యుత్తు లోటు బాగా తగ్గినట్లు తెలుస్తోంది. అంతకుముందు గ్రామీణ ప్రాంతాలకు రోజుకు దాదాపు 8 గంటలపాటు మాత్రమే విద్యుత్తు సరఫరా అయ్యేదని, నితీశ్ పాలనలో రోజుకు 22 గంటలపాటు విద్యుత్తు సరఫరా జరుగుతోందని తెలుస్తోంది. 


బాలికలకు సైకిళ్ళు, ధన సహాయం పథకాలను అమలు చేయడంతో, పాఠశాలల్లో చేరే బాలికల సంఖ్య పెరిగింది. 


నితీశ్ కుమార్ ఇటువంటి విజయాలను సాధించినప్పటికీ, 15 ఏళ్ళపాటు అధికారంలో కొనసాగడం వల్ల కొంత వరకు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగం, పేదరికం ఇంకా ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నారని విమర్శిస్తున్నారు.