BJP -JDU Alliance Ends: బీజేపీకి జేడీయూ బైబై.. సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌తో సీఎం నితీష్ కుమార్ సమావేశం

ABN , First Publish Date - 2022-08-09T19:15:02+05:30 IST

బిహార్‌లో(Bhihar) బీజేపీ - జేడీయూ(BJP -JD(U)) బంధానికి శుభంకార్డు పడింది. బీజేపీతో భాగస్వామ్యం ముగిసిపోయిందని పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు.

BJP -JDU Alliance Ends: బీజేపీకి జేడీయూ బైబై.. సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌తో సీఎం నితీష్ కుమార్ సమావేశం

పాట్నా: బిహార్‌లో(Bhihar) బీజేపీ - జేడీయూ(BJP -JD(U)) బంధానికి శుభంకార్డు పడింది. బీజేపీతో భాగస్వామ్యం ముగిసిపోయిందని పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం నితీష్ కుమార్(Nitish Kumar) ప్రకటించారు. ఈ మేరకు నితీష్ కుమార్ అధికారికంగా నిర్ణయించారని జేడీయూ వర్గాలు తెలిపాయి. బీజేపీ అవమానపరించిందని, పార్టీని బలహీనపరిచేందుకు ప్రయత్నించిందని నితీష్ వ్యాఖ్యానించారని పార్టీ వర్గాలు చెప్పాయి. కాగా ఈ రోజు(మంగళవారం) సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను నితీశ్ కుమార్ కలవనున్నారని వెల్లడించాయి. కాగా ఇటు జేడీయూ భేటీ జరుగుతున్న సమయంలోనే అటు ఆర్‌జేడీ(RJD), కాంగ్రెస్‌(Congress) పార్టీలు ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ మూడు పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


ప్రతిపక్షాల సమావేశం

వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం రబ్రీదేవి నివాసంలో ప్రతిపక్షాల మహాగట్‌బంధన్‌ కూటమి నేతలు మంగళవారం సమావేశమయ్యారు. నితీశ్‌ సీఎంగా కొనసాగేందుకు తాము మద్దతిస్తున్నామని తెలుపుతూ వీరంతా లేఖపై సంతకాలు కూడా చేశారు. ఈ లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశాలున్నాయి. అయితే కొత్త పొత్తులో భాగంగా తనకు హోంశాఖ కేటాయించాలని తేజస్వీ యాదవ్‌.. నీతీశ్‌ను కోరినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


అసెంబ్లీలో పార్టీల బలాబలాలు ఇవీ

బిహార్‌లో మొత్తం 243 మంది శాసనసభ్యులున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 122 మంది సభ్యుల మద్దతు కావాలి. పార్టీల పరంగా చూస్తే ఆర్‌జేడీకి అత్యధికంగా 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాత  జేడీ(యు) - 45, భాజపా -77, కాంగ్రెస్‌ - 19, వామపక్షాలు - 16, ఏఐఎంఐఎం - 1,  హెచ్‌ఏఎం - 4, స్వతంత్రులు - 2 చొప్పున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


బీజేపీ స్వయంకృతమేనా..

ప్రస్తుత పరిణామాలకు బీజేపీ స్వయంకృతాపరాధమే కారణమని విశ్లేషకులు అంటున్నారు. జనతాదళ్‌(యునైటెడ్‌) జాతీయ మాజీ అధ్యక్షుడు, కేంద్ర తాజా మాజీ మంత్రి ఆర్సీపీ సింగ్‌ శనివారం పార్టీకి రాజీనామా చేయడంతో బీజేపీ-జేడీయూ బంధంలో బీటలు మరింత తేలతెల్లమయ్యాయి. నిజానికి ఆయనను కేంద్ర మంత్రిగా బీజేపీ ఏకపక్షంగా ఎంపిక చేసింది. ఆయన అమిత్‌షాకు దగ్గరవుతున్నట్లు గుర్తించిన నితీశ్‌.. ఈసారి రాజ్యసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదు. ముందు నుంచీ.. కేంద్ర సర్కారులో రెండు బెర్తులు కావాలని నితీశ్‌ కోరినా.. బీజేపీ పట్టించుకోవడం లేదు. దాంతో.. లోక్‌ జనశక్తి మాదిరిగా.. ఆర్సీపీ సింగ్‌ ద్వారా జేడీయూను చీల్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని నితీశ్‌ అనుమానించారు. ఆర్సీపీ సింగ్‌ కూతురి అవినీతిపై నిలదీశారు. దీంతో.. ఆర్సీపీ సింగ్‌ రాజీనామా చేశారు. ఇక 2017లో లాలూ అవినీతిని ఎత్తిచూపుతూ.. సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగి, బీజేపీతో జతకట్టిన జేడీయూ.. 2020లో ఎన్డీయే తరఫున బరిలో దిగి.. భారీగా సిటింగ్‌ స్థానాలను కోల్పోయి, 43 సీట్లకు పరిమితమైంది. అదే సమయంలో 74 స్థానాలు సాధించిన బీజేపీ, నితీశ్‌కే అధికారాన్ని కట్టబెట్టింది. అయితే.. బిహార్‌పై పట్టుకు షా ప్రయత్నిస్తుండడంతో.. ఆర్సీపీ సింగ్‌ మరో ఏక్‌నాథ్‌ షిండేలా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని జేడీయూ చీఫ్‌ భావించారు. మరోవైపు.. మిత్రపక్షమే అయినా, రాష్ట్ర బీజేపీ నేతలు అడపాదడపా తనను టార్గెట్‌ చేయడం, ఇరకాటంలో పడేస్తుండడం నితీశ్‌కు కొత్త చికాకులు తెచ్చిపెడుతున్నాయి. దీంతో.. తెగదెంపులకు ఆయన నిర్ణయించారు.

Updated Date - 2022-08-09T19:15:02+05:30 IST