నితీశ్‌కు ఎదురు దెబ్బ, మోదీకి ఎదురు లేదు

ABN , First Publish Date - 2020-11-10T23:40:51+05:30 IST

బిహార్ శాసన సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఎదురు దెబ్బ

నితీశ్‌కు ఎదురు దెబ్బ, మోదీకి ఎదురు లేదు

పాట్నా : బిహార్ శాసన సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాకూటమి, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీ, అధికార పక్షంపై వ్యతిరేకత కలగలసి నితీశ్ నేతృత్వంలోని జేడీయూకు స్థానాలు తగ్గిపోయేలా చేశాయి. మొత్తం మీద ఎన్డీయే అధికార పీఠం వైపు చూడగలగడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభంజనం దోహదపడుతున్నట్లు వెల్లడవుతోంది. మోదీ పట్ల ప్రజల్లో ఇప్పటికీ సద్భావం ఉండటంతో బీజేపీకి జేడీయూ కన్నా ఎక్కువ స్థానాలు లభించాయని బీజేపీ వర్గాలు సంతోషిస్తున్నాయి. 


మూడు దశల్లో జరిగిన బిహార్ శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం, ఎన్డీయే కూటమికి 121 స్థానాల్లో ఆధిక్యత కనిపిస్తోంది. ఈ కూటమిలోని బీజేపీ 72, జేడీయూ 41, వీఐపీ 5, హెచ్ఏఎం 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. దీనినిబట్టి జేడీయూ గతం కన్నా దాదాపు 30 స్థానాలను కోల్పోయే అవకాశం కనిపిస్తుండగా, బీజేపీ అదనంగా 19 స్థానాలను పొందే అవకాశం కనిపిస్తోంది.  


తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించడంతోపాటు నితీశ్ కుమార్‌పైనా, కేంద్ర ప్రభుత్వంపైనా ఘాటైన విమర్శలు గుప్పించారు. మరోవైపు చిరాగ్ పాశ్వాన్ జేడీయూ లక్ష్యంగానే బరిలోకి దిగారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహించడం నితీశ్ కుమార్‌కు మరొక మైనస్ పాయింట్ అయింది. దీంతో ఇంత వరకు జేడీయూకు జూనియర్ పార్టనర్‌గా ఉన్న బీజేపీ, తాజాగా పెద్దన్న పాత్రలోకి వచ్చింది. జేడీయూపై పైచేయి సాధించే దిశగా దూసుకెళ్తోంది. అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ, జేడీయూకు తక్కువ స్థానాలు లభించినప్పటికీ, నితీశ్ కుమారే ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి అని స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వాగ్దానం ఆచరణలో నిజమవుతుందో, లేదో ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెల్లడైన తర్వాత తెలుస్తుంది. ఒకవేళ నితీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటికీ, బీజేపీ దాతృత్వాన్ని ఆయన భరించగలరా? అనేది మరొక ప్రశ్న. 


జేడీయూ నేతల్లో మరొక అనుమానం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చిరాగ్ పాశ్వాన్‌ను పురిగొల్పినది బీజేపీయేనని జేడీయూ నేతలు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఎన్డీయే కూటమికి స్థానాలు తగ్గితే, ప్రభుత్వ ఏర్పాటుకు ఎల్‌జేపీ సహకారం తీసుకోవడంపై ఉత్కంఠ నెలకొంది. కూటమిలోని పార్టీలను బలహీనపరిచే ఎత్తుగడలను జాతీయ పార్టీలు అమలు చేస్తాయని జేడీయూ నేతలు ఆందోళన చెందుతున్నారు. 


Updated Date - 2020-11-10T23:40:51+05:30 IST