Nitish KCR: ఇద్దరూ ఇద్దరే.. కానీ తేడా ఒక్కటే!

ABN , First Publish Date - 2022-09-06T21:16:54+05:30 IST

న్యూఢిల్లీ: మోదీపైన, కేంద్రంలోని బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంపైన యుద్ధం ప్రకటించి బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు,

Nitish KCR: ఇద్దరూ ఇద్దరే.. కానీ తేడా ఒక్కటే!

న్యూఢిల్లీ: మోదీపైన, కేంద్రంలోని బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంపైన యుద్ధం ప్రకటించి బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యత్నాలు ముమ్మరం చేశారు. కేసీఆర్ కొంతకాలంగా బీజేపీయేతర పక్షాల నేతలతో వరుస సమావేశాలు జరుపుతుండగా నితీశ్ మాత్రం సెప్టెంబర్ ఐదున ప్రారంభించారు. 


కేసీఆర్ ఇప్పటికే తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్, కేరళ సీఎం విజయన్, జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తదితరులతో సమావేశమై చర్చలు జరిపారు. 


బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, తేజస్వీ యాదవ్ తదితరులను కేసీఆర్ ఇటీవలే పాట్నాలో కలుసుకుని చర్చలు జరిపారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని కేసీఆర్ కోరుతున్నారు. ఇటీవలే బీజేపీతో కటీఫ్ చెప్పి ఆర్జేడీతో జత కట్టిన నితీశ్‌ కేసీఆర్‌తో సమావేశం తర్వాత తాను కూడా రంగంలోకి దూకేశారు. సెప్టెంబర్ 5న హస్తినకు బయలుదేరారు. హస్తినకు బయలుదేరేముందు నితీశ్ ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్, మాజీ సీఎం రబ్రీదేవి, ప్రస్తుత డిప్యూటీ సీఎం తేజస్వీతో చర్చలు జరిపారు. ఢిల్లీలో నితీశ్ ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి,రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలను కలుసుకున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఐఎన్ఎల్‌డీ నేత చౌతాలా, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తోనూ నితీశ్ చర్చలు జరపనున్నారు.  


నితీశ్‌ను ప్రధాని అభ్యర్ధిగా ప్రతిపాదిస్తారా అని కేసీఆర్‌ను పాట్నాలో విలేకరులు ప్రశ్నించగా ప్రతిపాదించడానికి తానెవరినంటూ దాటవేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలంతా కూర్చుని చర్చించుకుని, ఏకాభిప్రాయానికి వస్తామన్నారు. ప్రధాని అభ్యర్ధి ఎవరనేది ఎలా ఉన్నా కేసీఆర్, నితీశ్ రాజకీయ వ్యూహాలు పన్నడంలో ఎవరి ప్రత్యేకత వారిదే. నితీశ్ ఎప్పుడు ఎవరితో కటిఫ్ చెబుతారో, ఎప్పుడు బీజేపీ నచ్చుతుందో, ఎప్పుడు ఆర్జేడీ నచ్చదో ఎవరూ అంచనా వేయలేరు. అయితే నితీశ్ మాత్రం ఈ రెండు పార్టీలతోనూ వేర్వేరు సమయాల్లో దోస్తీ చేశారు. అధికారం నిలబెట్టుకున్నారు. కేసీఆర్ పాట్నా పర్యటన తర్వాత యాక్టివ్ అయిన నితీశ్ తాను కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హస్తినబాట పట్టారు. 


కేసీఆర్, నితీశ్ మధ్య ప్రధానమైన వ్యత్యాసం ఒకటుంది. 


నితీశ్ రాజకీయాల్లోకి తన సంతానాన్ని కానీ బంధువులను కానీ దగ్గరకు రానీయలేదు. బంధుప్రీతి ఏమాత్రం లేని నేతగా ఆయనకు దేశవ్యాప్తంగా క్లీన్ ఇమేజ్ ఉంది. 


అయితే కేసీఆర్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. రాజకీయాల్లోకి తన బంధువర్గాన్ని మొత్తం దించేశారు కేసీఆర్. కుమార్తెను, కుమారుడిని, మేనల్లుడిని, దగ్గరి, దూరపు బంధువులందరినీ రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. కీలక పదవులు కట్టబెట్టారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఐటీ మంత్రి కాగా, కుమార్తె కవిత ఎమ్మెల్సీ. మేనల్లుడు హరీశ్ ఆర్ధిక, ఆరోగ్యశాఖా మంత్రి. సమీప బంధువు సంతోష్ ఎంపీ. ఇలా జాబితా చాలా ఉంది. 



2024 పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని గద్దె దించడమే లక్ష్యంగా దక్షిణాది నుంచి కేసీఆర్, ఉత్తరాది నుంచి నితీశ్ ఏకకాలంలో దండయాత్ర మొదలు పెట్టారు. ఈ ఇద్దరు నాయకులు ఏ మేరకు విజయం సాధిస్తారనేది కాలమే నిర్ణయించనుంది. 

 


Updated Date - 2022-09-06T21:16:54+05:30 IST