మోదీజీ.... పునరాలోచించండి : నితిన్ రౌత్ డిమాండ్

ABN , First Publish Date - 2020-04-04T18:26:48+05:30 IST

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఆదివారం ప్రజలందరూ విద్యుత్ లైట్లన్నీ ఆర్పేయాలన్న ప్రధాని మోదీ పిలుపుపై

మోదీజీ.... పునరాలోచించండి : నితిన్ రౌత్ డిమాండ్

ముంబై : కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఆదివారం ప్రజలందరూ విద్యుత్ లైట్లన్నీ ఆర్పేయాలన్న ప్రధాని మోదీ పిలుపుపై మహారాష్ట్ర విద్యుత్ మంత్రి నితిన్ రౌత్ స్పందించారు. ఈ పిలుపుపై ప్రధాని మోదీ పునరాలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకేసారి లైట్లన్నీ ఆర్పేయడం వల్ల విద్యుత్ గ్రిడ్ల దెబ్బతినే అవకాశంతో పాటు ఎమర్జెన్సీ సర్వీసులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యుత్ దీపాలను ఎవరూ ఆర్పవద్దని ఆయన పిలుపునిచ్చారు.


‘‘అందరూ ఒకేసారి విద్యుత్ దీపాలు ఆర్పే విషయంలో పునరాలోచించుకోవాలి. ఇది విద్యుత్ గ్రిడ్లు దెబ్బతినే వైపు తీసుకెళ్లే ప్రమాదముంది. అలాగే ఈ నిర్ణయంతో అత్యవస సర్వీసులకు కూడా విఘాతం కలిగే అవకాశముంది’’ అని పేర్కొన్నారు.  అందరూ సామూహికంగా విద్యుత్ దీపాలను ఆర్పేస్తే... డిమాండ్, సప్లైలో తీవ్ర అంతరాయం ఏర్సడుతుందని ఆయన తెలిపారు. దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే ఫ్యాక్టరీ యూనిట్లేవీ పనిచేయడం లేదని, దీంతో 23,000 మెగవాట్ల నుంచి డిమాండ్ 13,000 మెగావాట్లకు తగ్గిపోయిందని అన్నారు. దీనిపై ప్రధాని మోదీ పునరాలోచించాలని నితిన్ రౌత్ డిమాండ్ చేశారు.


ఏప్రిల్‌ 5వ తేదీన అంటే ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో  9 నిమిషాలపాటు ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లవద్దనే ఉండి ఇళ్లల్లోని విద్యుత్‌ లైట్లన్నీ ఆపేసి, జ్యోతులు వెలిగించి, తమ ధృఢ సంకల్పాన్ని వెల్లడించాలి. చమురు దీపాలు లేదా కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు లేదా సెల్‌ఫోన్‌ ఫ్లాష్‌లైట్లు... ఏవి వీలైతే అవి వెలిగించి, కరోనా అనే చీకటిని, ఆ మహమ్మారిని తరిమేద్దాం అనే సంకల్పం తీసుకోవాలి. నా కోసం మీ విలువైన సమయంలో ఓ 9 నిమిషాలు కేటాయించండి. జనతా స్ఫూర్తిని మరోమారు చాటండి’ అని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-04-04T18:26:48+05:30 IST