ఫాస్టాగ్ లేకపోతే పోలీసు దర్యాప్తు : నితిన్ గడ్కరీ

ABN , First Publish Date - 2021-03-18T20:59:16+05:30 IST

త్వరలోనే టోల్ బూత్‌లను తొలగించబోతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల

ఫాస్టాగ్ లేకపోతే పోలీసు దర్యాప్తు : నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ : త్వరలోనే టోల్ బూత్‌లను తొలగించబోతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్‌సభకు చెప్పారు. వాహనాల నుంచి టోల్ వసూళ్ళకు జీపీఎస్-బేస్డ్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఫాస్టాగ్ లేని వాహనాలపై పోలీసు దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపారు. 


లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ మాట్లాడుతూ, 93 శాతం వాహనాలు ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన ఏడు శాతం వాహనాలు డబుల్ టోల్ చెల్లిస్తున్నప్పటికీ ఫాస్టాగ్‌ను తీసుకోలేదన్నారు. ఓ ఏడాదిలోగా దేశవ్యాప్తంగా రోడ్లపై ఉన్న టోల్ ప్లాజాలను పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. జీపీఎస్ విధానంలో టోల్‌ను వసూలు చేస్తామని చెప్పారు. వాహనాలపై జీపీఎస్ ఇమేజింగ్ ఆధారంగా టోల్‌ వసూలు చేస్తామన్నారు. టోల్ చెల్లించేందుకు ఫాస్టాగ్‌ను ఉపయోగించని వాహనాలపై దర్యాప్తు జరపాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. వాహనాలకు ఫాస్టాగ్స్‌ను అమర్చకపోతే టోల్ దొంగతనం, జీఎస్‌టీ ఎగవేత జరుగుతోందని చెప్పారు. 


2016 నుంచి ఫాస్టాగ్స్ అమల్లోకి...

వాహనాలు టోల్ ఫీజును టోల్ ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానంలో చెల్లించడమే ఫాస్టాగ్. ఇది 2016లో అమల్లోకి వచ్చింది. ఫాస్టాగ్ లేని వాహనాలు ఎలక్ట్రానిక్ టోల్ ప్లాజాల వద్ద డబుల్ టోల్ ఫీజు చెల్లించాలనే నిబంధన ఫిబ్రవరి 16 నుంచి అమలవుతోంది.



Updated Date - 2021-03-18T20:59:16+05:30 IST