నాకు యూట్యూబ్ నెలకు రూ.4 లక్షలిస్తుంది : నితిన్ గడ్కరీ

ABN , First Publish Date - 2021-09-18T00:28:40+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి సమయంలో తన ఆదాయం పెరిగిందని

నాకు యూట్యూబ్ నెలకు రూ.4 లక్షలిస్తుంది : నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి సమయంలో తన ఆదాయం పెరిగిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం చెప్పారు. యూట్యూబ్‌లో తాను పోస్ట్ చేసిన లెక్చర్ వీడియోల వ్యూవర్‌షిప్ ఈ మహమ్మారి కాలంలో బాగా పెరిగిందని, అందువల్ల తనకు రాయల్టీ రూపంలో నెలకు దాదాపు రూ.4 లక్షలు వస్తోందని చెప్పారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే (డీఎంఈ) పురోగతిపై భరూచ్‌లో సమీక్షించిన సందర్భంగా ఆయన ఈ వివరాలు తెలిపారు. 


రోడ్ కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్, కన్సల్టెంట్లకు రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ రేటింగ్ ఇవ్వడం ప్రారంభమైందని చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తాను రెండు పనులు చేశానన్నారు. చెఫ్‌గా మారి ఇంట్లో వంట చేశానన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపన్యాసాలు ఇచ్చానన్నారు. ఆన్‌లైన్‌లో 950కి పైగా లెక్చర్లు ఇచ్చానన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాల విద్యార్థులకు కూడా లెక్చర్లు ఇచ్చానన్నారు. వీటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశానని, వాటికి వ్యూవర్‌షిప్ పెరగడంతో యూట్యూబ్ ఇప్పుడు నెలకు రూ.4 లక్షలు రాయల్టీగా చెల్లిస్తోందని చెప్పారు. మన దేశంలో మంచి పనులు చేసేవారికి ప్రశంసలు రావన్నారు. 


Updated Date - 2021-09-18T00:28:40+05:30 IST