అలా చేయాలని టెస్లాను కోరాం : నితిన్ గడ్కరీ

ABN , First Publish Date - 2021-10-08T21:37:30+05:30 IST

ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను భారత్‌లో తయారు చేయాలని, అందుకు

అలా చేయాలని టెస్లాను కోరాం : నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను భారత్‌లో తయారు చేయాలని, అందుకు అవసరమైన సహకారం అందిస్తామని  అమెరికాకు చెందిన టెస్లాకు అనేకసార్లు చెప్పినట్లు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం చెప్పారు. టాటా మోటార్స్ తయారు చేసే ఎలక్ట్రిక్ కార్లు టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కన్నా తీసికట్టేమీ కాదన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 


చైనాలో తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్లను భారత దేశంలో అమ్మవద్దని, భారత దేశంలోనే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసి, భారత దేశం నుంచి ఎగుమతి చేయాలని టెస్లాకు అనేకసార్లు చెప్పానని నితిన్ గడ్కరీ చెప్పారు. భారత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతిపై సుంకాలను తగ్గించాలని టెస్లా డిమాండ్ చేసిందన్నారు. ‘‘మీకు (టెస్లాకు) ఎలాంటి సహకారం కావాలన్నా భారత ప్రభుత్వం అందిస్తుంది’’ అని తాను చెప్పానన్నారు. పన్ను రాయితీలకు సంబంధించిన డిమాండ్‌పై టెస్లా అధికారులతో తాను ఇప్పటికీ చర్చలు జరుపుతున్నానన్నారు. 


ఇదిలావుండగా భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కూడా గత నెలలో టెస్లాకు ఓ విజ్ఞప్తి చేసింది. పన్ను రాయితీల గురించి పరిశీలించడానికి ముందు భారత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రారంభించాలని కోరింది. 


అంతకుముందు గడ్కరీ మాట్లాడుతూ, మన దేశంలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి టెస్లాకు సువర్ణావకాశం ఉందని చెప్పారు. మన దేశం ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎదురు చూస్తోందన్నారు. టెస్లా ఇప్పటికే ఇండియన్ ఆటోమేకర్స్ నుంచి ఆటో విడి భాగాలను తీసుకుంటోందని, ఓ యూనిట్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఆ కంపెనీకి ఆర్థికంగా కలిసొస్తుందని తెలిపారు. 


Updated Date - 2021-10-08T21:37:30+05:30 IST