గడ్కరీ హైడ్రోజన్ కారు కత!
మార్చి 16నే మనదేశంలో లాంచ్
కిలోమీటరుకు 2 రూపాయలే ఖర్చు
ఫుల్ ట్యాంకుతో 600 కి.మీ. జర్నీ
టొయోటా నుంచి అందిన కారు
పెట్రో ధరలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం పార్లమెంటుకు హైడ్రోజన్ కారులో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే.. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడుస్తుంది. కారు ఇంధన ట్యాంకు నింపడానికి 5 నిమిషాలే పడుతుంది. ఒకసారి ట్యాంకు నింపితే 600 కిలోమీటర్లు నడుస్తుంది. కిలోమీటరుకు 2 రూపాయల ఖర్చుతో ప్రయాణించవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు ఉండడంతో అంతా ఈ కారుపై ఆస క్తి చూపుతున్నారు. ఇంతకీ ఈ కారు కథా కమామిషు ఏమిటంటే.. జపాన్‌కు చెందిన టొయోటా కంపెనీ ‘మిరాయ్’ పేరుతో రూపొందించిన ఈ కారును గడ్కరీకి అందజేసింది. గ్రీన్ హైడ్రోజన్‌తో నడిచే ఈ కారును పైలట్ ప్రాజెక్టుగా నడిపిచూస్తానని జనవరిలోనే గడ్కరీ ప్రకటించారు. ఈ నెల 16న ‘దేశపు తొలి హైడ్రోజన్ ఆధారిత ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనం(హెచ్ఎ్ఫసీఈవీ)’గా ఆయన దీన్ని లాంచ్ చేశారు.
ఈవీ వర్సెస్ హెచ్ఎఫ్సీఈవీ..
ఎలక్ట్రిక్ వాహనాలకు, హైడ్రోజన్ ఆధారిత ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలకు మౌలికంగా ఒక తేడా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీతో పనిచేస్తాయి. ఆ బ్యాటరీని మనం ఎప్పటికప్పుడు చార్జ్ చేసుకుంటూ ఉండాలి. హెచ్ఎ్ఫసీఈవీలు తమకు కావాల్సిన విద్యుత్తును నడిచేటప్పుడు సొంతంగా తయారు చేసుకుంటాయి. అలా తయారుచేసుకోవడానికి అవసరమైన హైడ్రోజన్ ఇంధనాన్ని మాత్రం మనం నింపాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ హైడ్రోజన్ ఇంధన వాహనాలను చార్జింగ్ చేయనక్కర్లేదు.
మనం నింపే హైడ్రోజన్ లోపల ఉన్న ఇంధన ఘటంలోని ఆక్సిజన్‌తో కలవడం వల్ల విద్యుత్ రసాయన ప్రతిచర్య జరిగి శక్తి జనిస్తుంది. ఆ శక్తి మోటారును నడుపుతుంది. ఈ ప్రక్రియలో ఎలాంటి కర్బన ఉద్గారాలూ వెలువడవు. నీరు మాత్రమే బయటకు వస్తుంది. విద్యుత్తు వాహనాల చార్జింగ్కు ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువ దూరం వెళ్లాలంటే బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉండాలి. దానివల్ల కారు బరువు పెరుగుతుంది. అందు కే ఈవీలు తక్కువ దూరాలకే వెళ్తాయి. హైడ్రోజన్ ఇంధన వాహనాలైతే పెట్రోలు నింపుకున్నంత సులభంగా హైడ్రోజన్ నింపుకోవచ్చు. ఎక్కువ దూరాలు ప్రయాణించొచ్చు.
మూడు కంపెనీలే..
ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ ఇంధన వాహనాలను 3 కం పెనీలే తయారుచేస్తున్నాయి. అవి.. టొయోటా (జపాన్), హోండా (దక్షిణ కొరియా), హ్యుండాయ్ (దక్షిణ కొరియా). టొయోటా కంపెనీ మిరాయ్ పేరుతో వీటిని తయారు చేస్తుండగా.. హోండా కంపెనీ క్లారిటీ పేరుతో, హ్యుండా య్ ‘నెక్సో’ పేరుతో హైడ్రోజన్ వాహనాలను అభివృ ద్ధి చేశాయి. అమెరికాకు చెందిన నికోలా కంపెనీ హైడ్రోజన్‌తో నడిచే పికప్ ట్రక్కులను ‘బ్యాడ్జర్’ పేరు తో ఈ ఏడాదిలోనే మార్కెట్లోకి తేవడానికి కృషి చేస్తోంది. మనదేశంలో ఈ వాహనాల విస్తృతి ఇంకా లేదు. కాబట్టి హైడ్రోజన్ ఇంధనాన్ని నింపే స్టేషన్లు రెండే ఉన్నాయి. ఒకటి ఫరీదాబాద్ (యూపీ)లోని ఇండియన్ ఆయిల్ సంస్థ పరిశోధన, అభివృద్ధి విభాగంలో ఉంది. రెండోది గుర్గావ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో ఉంది.
హైడ్రోజన్ ఇంధన తయారీ ఎలా?
ముడిచమురు నుంచి పెట్రోల్ వస్తుంది. మరి హైడ్రోజన్ ఇంధనం ఎలా వస్తుంది? అంటే.. ప్రపంచంలోని మూలకాలన్నింటిలో విస్తారంగా ఉండేది హైడ్రోజనే. దాన్నుంచి శక్తిని ఉత్పత్తి చేసే క్రమంలో మిగిలేది నీరు మాత్రమే. ఇవి రెండూ సానుకూల అంశాలు. కానీ.. అంత విస్తారంగా ఉన్న హైడ్రోజన్ సులువుగా దొరకదు. దాన్ని వేరు చేయడం చాలా క్లిష్టమైన ప్రకియ్ర. విద్యుత్ విచ్ఛేదన (ఎలకా్ట్రలిసిస్) ప్రక్రియ ద్వారా నీటి నుంచి వేరు చేయాలి. లేదా శిలాజ ఇంధనాల్లోని కార్బన్ నుంచి హైడ్రోజన్‌ను విడదీయాలి. ఈ రెండింటికీ బోలెడంత శక్తి అవసరం. ఆ శక్తి కోసం మళ్లీ ముడి చమురుపైనే ఆధారపడాలి. దీన్ని అధిగమించడానికే చాలా సంస్థలు పరిశోధనలో తలమునకలయ్యాయి.
హైడ్రోజన్ ఇంధన వాహనాలు ఇప్పుడున్న అన్ని వాహనాల కన్నా సురక్షితమైనవని ఆటోమొబైల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. హైడ్రోజన్ మన చుట్టూ ఆవరించి ఉన్న గాలి కంటే పల్చనైనది. ట్యాంకులో లీకులున్నా వాటి నుంచి బయటికొచ్చే హైడ్రోజన్ గాలిలో ఇట్టే కలిసిపోతుంది. అయితే.. హైడ్రోజన్‌ను వెలికితీసే ప్రక్రియ ఖర్చుతో, కష్టంతో కూడుకున్నది. కాబట్టి ఈ వాహనాలు విస్తృతంగా అందుబాటులోకి రావడం ఆలస్యమవుతోంది.
కొసమెరుపు: ‘‘హైడ్రోజన్ ఇంధనమా.. బుల్షిట్. అది రాకెట్లకు సరిపోతుందిగానీ.. కార్లకు కాదు’’
టెస్లా విద్యుత్ కార్ల సృష్టికర్త.. స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఈలన్ మస్క్ హైడ్రోజన్ కార్ల గురించి 2013లో అన్నమాటలివి. కానీ, అంతటి టెక్ మార్గదర్శకుడి అంచనాలనూ తల్లకిందులు చేస్తూ ఇప్పటికే పలు హైడ్రోజన్ కార్లు అభివృద్ధి చెందిన దేశాల్లో రోడ్లపైకి వచ్చాయి. హైడ్రోజన్ ఇంధనంపై పరిశోధనలు మరింత జోరుగా సాగి సత్ఫలితాలు సాధిస్తే మన రోడ్ల మీదా హైడ్రోజన్ కార్లు రయ్యిరయ్యిన తిరుగుతాయి. ఇది తథ్యం.
-సెంట్రల్ డెస్క్