పేద ఎస్సీ, ఎస్టీలకు నగదు బదిలీ

ABN , First Publish Date - 2020-11-28T07:20:42+05:30 IST

సబ్‌ ప్లాన్‌ నిధుల్లో కొంతమేర దేశవ్యాప్తంగా నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నగదు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు నీతి ఆయోగ్‌ ప్రణాళికలు రూపొందిస్తోంది. నెలకు రూ.5 వేలకన్నా తక్కువ ఆదాయం కలిగిన దళిత, గిరిజన కుటుంబాలకు షరతులతో కూడిన నగదు బదిలీ చేయడానికి పథకాన్ని రూపొందిస్తోంది

పేద ఎస్సీ, ఎస్టీలకు నగదు బదిలీ

కేంద్రం మదిలో కొత్త ఆలోచన

సబ్‌ప్లాన్‌లో 40 శాతం నిధులు పథకానికి

పిల్లలు తప్పక స్కూలుకు వెళ్లాలి

నీతి ఆయోగ్‌ ప్రణాళికలు 


న్యూఢిల్లీ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): సబ్‌ ప్లాన్‌ నిధుల్లో కొంతమేర దేశవ్యాప్తంగా నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నగదు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు నీతి ఆయోగ్‌ ప్రణాళికలు రూపొందిస్తోంది. నెలకు రూ.5 వేలకన్నా తక్కువ ఆదాయం కలిగిన దళిత, గిరిజన కుటుంబాలకు షరతులతో కూడిన నగదు బదిలీ చేయడానికి పథకాన్ని రూపొందిస్తోంది. బ్రెజిల్‌లో విజయవంతంగా అమలవుతున్న బోల్సా ఫ్యామిలియా తరహాలో ఈ పథకాన్ని రూపకల్పన చేస్తోంది. ఈ పథకం అమలుకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ను సంస్కరించాలని నీతి ఆయోగ్‌ ప్రతిపాదించింది. ప్రస్తుతం 41 మంత్రిత్వ శాఖలు తమ తమ బడ్జెట్లలో సబ్‌ ప్లాన్‌ కోసం 2 నుంచి 20 శాతం వరకు నిధులను కేటాయిస్తున్నాయి. వాటి మొత్తం విలువ రూ.లక్ష కోట్లకుపైగా ఉంటుందని నీతి ఆయోగ్‌ అంచనా. ఇందులో 40 శాతం నిధులను నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు నగదు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకు ప్రధానంగా రెండు షరతులను విధించనుంది. లబ్ధిదారులు తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపించాలి. ఇంద్రధనుష్‌ పథకం కింద అందించే టీకాలను వారికి వేయించాలి.


ఈ రెండు షరతులకు లోబడే నగదు బదిలీ చేయాలని నీతి ఆయోగ్‌ పేర్కొంది. మిగిలిన 60 శాతం నిధులను ఎస్సీ, ఎస్టీల జనాభా అధికంగా ఉన్న జిల్లాల్లో తాగునీటి సౌకర్యం కల్పించడం, రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణం, పారిశుధ్యం, పౌష్టికాహారం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించేలా నీతి ఆయోగ్‌ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. వీటిపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ అభిప్రాయాలను నీతి ఆయోగ్‌ కోరింది. దీన్ని అమలు చేయడానికి అదనపు బడ్జెట్‌ కేటాయించాల్సిన అవసరం లేదని, ఉన్న నిధులను సమీకృతం చేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖకు నీతి ఆయోగ్‌ తెలిపింది. నగదు బదిలీని ఆర్థిక శాఖ ద్వారా అమలు చేయాల్సి ఉంటుంది. అందుకే, ఆయా శాఖలకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కింద కేటాయించే నిధుల్లో 40 శాతం కోత విధించాలని ప్రతిపాదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉద్దేశించిన లక్ష్యాల మేరకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ లేదని, అందుకే దీనిని సంస్కరించాలని భావిస్తున్నామని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-11-28T07:20:42+05:30 IST