ఊరంతా ఒక వైపు, కేసీఆర్ మరో వైపు

ABN , First Publish Date - 2022-08-09T08:48:47+05:30 IST

ఆరుదశాబ్దాలకు పైగా మనుగడలో ఉన్న ప్రణాళికా సంఘం హయాంలో దేశంలో ఏమేరకు అభివృద్ధి జరిగింది? కేవలం ఎనిమిదేళ్లుగా మనుగడలో ఉన్న నీతిఆయోగ్ హయాంలో...

ఊరంతా ఒక వైపు, కేసీఆర్ మరో వైపు

ఆరుదశాబ్దాలకు పైగా మనుగడలో ఉన్న ప్రణాళికా సంఘం హయాంలో దేశంలో ఏమేరకు అభివృద్ధి జరిగింది? కేవలం ఎనిమిదేళ్లుగా మనుగడలో ఉన్న నీతిఆయోగ్ హయాంలో ఎంత మేరకు అభివృద్ధి జరిగింది? అన్న ప్రశ్నలకు జవాబులు అన్వేషించే ప్రయత్నం చేస్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలలకు ప్రతిరూపమైన నీతి ఆయోగ్ ఏమి సాధించిందో అర్థమవుతుంది. ఎనిమిదేళ్ల క్రితం వరకూ ప్రతి ఏడాదీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత మరో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రణాళికా సంఘానికి వచ్చి నిధులకోసం, ప్రణాళికా పెట్టుబడులకోసం, మార్కెట్ రుణాలకోసం ప్రాధేయపడేవారు. ప్రణాళికా సంఘానికి తమ లెక్కలు చెప్పుకుని వారడిగిన ప్రశ్నలకు సంజాయిషీ చెబుతూ బేరసారాలు ఆడిన తర్వాత వారి ప్రణాళిక మొత్తం ఖరారయ్యేది. దేశంలో కేంద్రం ఒక చక్రవర్తిలాగా, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామంతుల్లాగా వ్యవహరించే ప్రక్రియ కొనసాగేది.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తతంగం పూర్తిగా రద్దయింది. తన మొదటి స్వాతంత్ర్య దిన ప్రసంగంలోనే ప్రధానమంత్రి ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ స్థానంలో భారతదేశాన్ని పూర్తిగా పరివర్తనం చేసే ఒక జాతీయ సంస్థగా నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కీలక విధాన నిర్ణయంలోనూ రాష్ట్రాలను భాగస్వాములుగా చేసి సహకార సమాఖ్య విధాన స్ఫూర్తితో వ్యవహరించేందుకు నీతి ఆయోగ్ పనిచేయడం ప్రారంభించింది. సహకార సమాఖ్య విధానం మాత్రమే కాదు, రాష్ట్రాల మధ్య పోటీ ఏర్పడే సమాఖ్య విధానాన్ని కూడా ప్రోత్సహించడం తమ లక్ష్యంగా నీతి ఆయోగ్ ప్రకటించింది.


ప్రణాళికా సంఘం పంచవర్ష ప్రణాళికల రూపకల్పనే ప్రధాన లక్ష్యంగా పనిచేసేది. ఆర్థిక వనరులే అభివృద్ధికి కీలకమని భావించేది. నీతి ఆయోగ్ దేశ విధాన రూపకల్పనలో మేధావులు, నిపుణులను భాగం చేసింది. రాష్ట్రాలతో అర్థవంతమైన భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రణాళికా సంఘం మాదిరి నీతి ఆయోగ్ కేవలం నిధులు పంపిణీ చేసే ఏజెన్సీ కాదు. అది ఆధునిక భారతదేశ రూపకల్పనకు అనుగుణంగా మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీతిని నిర్ణయించేందుకు ఏర్పడింది. ప్రణాళికా సంఘం ఏకపక్షంగా విధానాలను ఢిల్లీ స్థాయి నుంచి రాష్ట్రాలపై రుద్దే విధంగా రూపొందిస్తే నీతి ఆయోగ్ క్రింది నుంచి పై వరకు విధానాలను రూపొందించేందుకు, రాష్ట్రాలతో కలిసి బ్లూప్రింట్‌ను ఏర్పాటు చేసేందుకు అవకాశాలను కల్పించింది. ప్రణాళికా సంఘం ఉన్నంత కాలం రాష్ట్రాలకు ఆర్థిక సార్వభౌమికత ఉండేది కాదు. అయితే రాష్ట్రాలు ఇప్పుడు తమ నిధులు తాము ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకోవచ్చు. తమ ఆర్థిక వనరులకు తామే జవాబుదారీ. ప్రణాళికా సంఘం దృష్టిలో కేంద్రమే ప్రధానం. నీతి ఆయోగ్‌కు రాష్ట్రాలే ప్రధానం. అందుకే నీతి ఆయోగ్ రూపొందించే ప్రతి విధాన నిర్ణయంలోనూ ముఖ్యమంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు భాగస్వామ్యం ఉంటుంది.


గత ఎనిమిదేళ్లుగా అభివృద్ధి విప్లవాన్ని నిశ్శబ్దంగా అమలు చేస్తున్న నీతి ఆయోగ్ మూలంగానే ఇవాళ దేశంలో లక్షల కోట్ల మేరకు మౌలిక సదుపాయాలు అమలు అవుతున్నాయి. అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న అనేక సంక్లిష్టమైన సమస్యలను కేంద్ర, రాష్ట్రాలతో కలిసి పనిచేయడం ద్వారా నీతి ఆయోగ్ పరిష్కరించింది. జీడీపీ పెరుగుదలలో మాత్రమే కాదు, అనేక నిర్మాణాత్మక ఆర్థిక సంస్కరణల వెనుక నీతి ఆయోగ్ హస్తం ఉన్నది. ఈ వాస్తవాలు ఎంతమందికి తెలుసు? దేశమంతా ఒక టీమ్ ఇండియా స్ఫూర్తితో పనిచేసినందుకే కరోనా మహమ్మారిని తిప్పిగొట్టగలిగామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నీతి ఆయోగ్ ఆదివారం నాడు జరిగిన ఏడవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో అన్నారు. దేశాన్ని ఈ విషయంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా చేయడంలో రాష్ట్రాలు ప్రముఖ పాత్ర పోషించాయని ఆయన ప్రశంసించారు. ఈ సమావేశం ఎజెండా రూపకల్పన చేసేందుకు ధర్మశాలలో కొద్ది రోజుల క్రితం రాష్ట్రాల ప్రభుత్వ ప్రదాన కార్యదర్శులంతా పాల్గొన్నారు, పప్పు ధాన్యాలు, చమురు గింజలు, ఇతర వ్యవసాయోత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధి, పంటల మార్పిడి, జాతీయ విద్యావిధానం అమలు, పట్టణ పాలనపై కీలక చర్చలు జరిగాయి. ఇవాళ వివిధ రంగాల్లో కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి దేశాన్ని అభివృద్ధి పరచడం ప్రపంచం దృష్టికి వచ్చిందని, అందుకే 2023లో జీ–20 నాయకత్వం భారత్‌కు లభించనున్నదని మోదీ ప్రకటించారు, భారతదేశమంటే ఢిల్లీ మాత్రమే కాదు, ప్రతి రాష్ట్రమూ, ప్రతి కేంద్ర పాలిత ప్రాంతమూ కూడా అని ప్రకటించే సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. వర్తకం, పర్యాటక రంగం, టెక్నాలజీని ప్రతి రాష్ట్రమూ ప్రపంచంలోని మన రాయబార కార్యాలయాల ద్వారా పెంపొందించుకోవాలని, ఎగుమతులు పెంచుతూ దిగుమతులను తగ్గించుకోవాలని సూచించారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు రూపొందించిన ‘వోకల్ ఫర్ లోకల్’ రాజకీయ నినాదం కాదని, అది కేంద్ర, రాష్ట్రాల సమాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జీఏస్టీ వసూళ్లు పెరిగేందుకు కూడా కలిసికట్టుగా పనిచేయాలని, దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కృషి చేయాలని చెప్పారు. జాతీయ విద్యావిధానాన్ని కూడా నిర్ణీత కాలంలో దేశమంతటా అమలు చేయాలని పిలుపునిచ్చారు.


నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బహిష్కరించడం దురదృష్టకరమైన విషయం. ఇది ఆయన హ్రస్వదృష్టికి నిదర్శనం. నీతి ఆయోగ్‌లో రాష్ట్రాలకు ప్రాధాన్యత లేదని, ముఖ్యమైన జాతీయ సమస్యలను చర్చించలేదని కేసీఆర్ ఆరోపించడం పచ్చి అబద్ధమని ప్రతి సామాన్యుడికీ అర్థమవుతోంది. నీతి ఆయోగ్ విలువ తెలిసినందువల్లే నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, అశోక్ గెహ్లాట్, పినరాయి విజయన్ తదితర ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఊరంతా ఒకవైపు, ఉలిపికట్టె మరొక వైపు అన్న సామెత కేసీఆర్ లాంటి వారిని చూసిన తర్వాతే పుట్టి ఉంటుంది.



వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2022-08-09T08:48:47+05:30 IST