Advertisement
Advertisement
Abn logo
Advertisement

నివేదిక అందిన తర్వాతే ఏపీకి వరద సాయం: నిత్యానంద్‌ రాయ్‌

న్యూఢిల్లీ: గత నెలలో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల నష్టంపై కేంద్ర బృందం నివేదిక సమర్పించిన అనంతరం అదనపు ఆర్థిక సహాయం అందించే విషయాన్ని పరిశీలిస్తామని రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ వెల్లడించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా 25 మంది మరణించినట్లు, రోడ్లు, విద్యుత్‌ వ్యవస్థతోపాటు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపిందని ఆయన చెప్పారు. భారీ వర్షాలపై నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నవంబర్‌ 23న వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఈ బృందం నవంబర్‌ 26 నుంచి 29 వరకు భారీ వర్షాల ప్రభావానికి గురైన ప్రాంతాలను సందర్శించి జరిగిన నష్టాన్ని మదింపు చేసిందని, దీనిపై ఆ బృందం తుది నివేదిక సమర్పించిన అనంతరం నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా ఆర్థిక సహాయం అందించే అంశాన్ని పరిశీలించడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవలసిన ప్రాధమిక బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుందని నిత్యానంద్‌ రాయ్‌ అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ప్రజలకు సహాయ చర్యలు చేపట్టడానికి రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) అందుబాటులో ఉంటుందని, విపత్తు తీవ్రతరమైనదిగా కేంద్ర బృందం నివేదికలో పేర్కొంటే జాతీయ విపత్తుల ప్రతిస్పందన నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) నుంచి రాష్ట్రానికి అదనంగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఏ విపత్తును కూడా జాతీయ విపత్తుగా ప్రకటించే అధికారం ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు ఉండదని నిత్యానంద్‌ రాయ్‌ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement