‘నిట్’పై చిన్నచూపు

ABN , First Publish Date - 2020-09-25T17:01:41+05:30 IST

ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వం..

‘నిట్’పై చిన్నచూపు

పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం 

మౌలిక వసతుల కల్పనలో అలసత్వం

మంచినీటి సరఫరాలోనూ జాప్యం 

ఫేజ్‌-1బీ పనులపై ఇసుక ధరల ప్రభావం 


(తాడేపల్లిగూడెం-ఆంధ్ర జ్యోతి): ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పరంగా మౌలిక వసతుల కల్పనలో జాప్యం జరుగుతోంది. నిట్‌లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. బీటెక్‌లోనే ఈ ఏడాది 600 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. మరోవైపు ఎంటెక్‌ కోర్సులను ప్రారంభించారు. పీహెచ్‌డీ కోర్సులను అమలు చేస్తున్నారు. ఇలా నిట్‌లో దాదాపు 1900 మంది విద్యనభ్యసించనున్నారు. వారందరికీ మంచినీటి వసతి కల్పి ంచాల్సిన అవసరం మునిసిపాలిటీపై ఉంది. ప్రస్తుతం బోరుబావుల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు.


భూగర్భ జలాల్లో ఉన్న గాఢత వల్ల పైప్‌లైన్‌లు దెబ్బతింటున్నాయి. వేడినీళ్ల కోసం ఏర్పాటు చేసిన ఉపకరణాలు పాడవుతు న్నాయి. ప్రధానంగా మునిసిపాలిటీ నుంచి మంచినీటి వసతి కల్పించాల్సి ఉంటుంది. ప్రతిరోజు 8 లక్షల లీటర్ల మంచినీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం అంగీకరిం చింది. అయితే ఇప్పటిదాకా పట్టించుకోలేదు. మునిసిపాలిటీ సరఫరా చేసే మంచినీటి కోసం ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ను ప్రభుత్వం నిర్మించాలి. అయితే ఆ బాధ్యతను ఏపీ నిట్‌పైనే పెట్టేశారు. నిట్‌లో అంతర్గత వసతులన్నీ కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసుకోవాలని అందులో భాగంగానే ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ నిర్మించుకోవాలని అధికారులు చెబుతున్నారు. అయితే పంపుల చెరువు నుంచి ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌తో నీటి శుద్ధి ప్లాంట్‌లకు అనుసంధానం చేయాలి. పంపుల చెరువు వద్ద అటువంటి ఏర్పాటుకు ఇంకా మునిసిపాలిటీ ప్రయత్నం చేయడం లేదు.  


గతమెంతో ఘనం...

వాస్తవానికి నిట్‌కు కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో గత ప్రభుత్వం కృషి చేసింది. నిట్‌లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండడంతో శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి తక్షణమే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నుంచి వినతులు వెళ్లాయి. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ప్రభుత్వంలో అటువంటి ప్రయత్నాలు లేకుండా పోయాయి. కేంద్రీయ విద్యాలయాన్ని తాడేపల్లిగూడెంలో నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. అందుకు భూమి అవసరం కానుంది. కనీసం 5 ఎకరాల భూమి కేటాయించినా కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి నిట్‌ అధికారులు భూమి అవసరంపై ప్రతిపాదించారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకుండా పోయింది.  


ఇసుక ధరలతో ఏజన్సీ గగ్గోలు 

గతంలో 5 యూనిట్‌ల ఇసుక 10 వేలకు లభ్యమయ్యేది. అదే ధరలతో ఫేజ్‌-1బి పనులు ఖరారు చేశారు. సుమారు రూ.196 కోట్లతో పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం ఇసుక ధరలు పెరిగిపోయాయి. ఫలితంగా తమకు గిట్టుబాబు కాదంటూ ఏజన్సీ గగ్గోలు పెడుతోంది. 


మురుగు వెళ్లే మార్గం లేదు..

మరోవైపు నిట్‌కు ఆనుకుని గణేష్‌నగర్‌ జంక్షన్‌ వరకు డ్రెయిన్‌ ఏర్పాటు చేయాలి. డ్రెయిన్‌ లేక పోవడం వల్ల నిట్‌ నుంచి వచ్చే నీరు మురుగు కాలువను తలపిస్తోంది. ఇటీవల నిట్‌ను కొవిడ్‌ కేర్‌  సెంటర్‌కు కేటాయించారు. అక్కడి నుంచి వచ్చే మురుగునీరు గణేష్‌ నగర్‌వైపు వచ్చేసింది. దీనివల్ల ఆ ప్రాంతమంతా మురికి కుంటగా మారిపోయింది. వాస్తవానికి నిట్‌లో వినియోగించిన నీరు బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. మురుగునీరు శుద్ధి చేసి పచ్చదనానికి ఉపయోగపడేలా చర్యలు చేపట్టా రు. వర్షాకాలంలో వాన నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. పైనుంచి వచ్చేనీరు కూడా నిట్‌ కు ఆనుకుని గణేష్‌ నగర్‌వైపు వస్తోంది. దానికోసం నిట్‌నుంచి డ్రెయిన్‌ నిర్మించాలి. దీంతో నిట్‌ పరిసర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.  




Updated Date - 2020-09-25T17:01:41+05:30 IST