నిషేధం సాధ్యమేనా!?

ABN , First Publish Date - 2022-07-02T04:38:30+05:30 IST

16 రకాల సింగిల్‌ చూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులపై కేంద్ర నిషేధించింది.

నిషేధం  సాధ్యమేనా!?

జిల్లాలో విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగం

కేంద్రం ఆదేశాలతో మరోమారు రద్దు

నెల్లూరులో ఇప్పటికి రెండుస్లారు నిషేధాజ్ఞలు

ఆత్మకూరు, కావలిలోనూ అంతే!

దాడులు చేసి సరిపెట్టుకుంటున్న యంత్రాంగం

కొందరికి కల్పతరువుగా మారిన వైనం

ఈసారైనా కఠినంగా వ్యవహరిస్తారా!?


ప్రపంచానికి పెనుభూతంలా మారిన ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం నుంచి హానికర ప్లాస్టిక్‌ తయారీ, వినియోగం ఆపేయాలని సూచిస్తూ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు నెల్లూరు కార్పొరేషన, ఆత్మకూరు మున్సిపల్‌ కమిషనర్లు ఈ ఆదేశాలు అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. అయితే నెల్లూరులో ఇప్పటికే రెండు పర్యాయాలు ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన కార్పొరేషన అధికారులు తనిఖీలతో సరిపెట్టేశారు. అక్కడక్కడ జరిమానాలు, అవగాహన సదస్సులు తూతూమంత్రంగా చేపట్టి మమ మనిపించారు. ఆత్మకూరు, కావలి మున్సిపాలిటీల్లోనూ గతంలో నిషేధించినా షరామామూలేంది. ఈసారైనా ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో నిషేఽధం అమలు చేస్తారా!? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. 


నెల్లూరు(సిటీ), జూలై 1 : 16 రకాల సింగిల్‌ చూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులపై కేంద్ర నిషేధించింది. ఇయర్‌ బడ్స్‌ నుంచి బెలూన్లు, క్యాండీ, ఐస్‌క్రీమ్‌ కోసం వాడే ప్లాస్టిక్‌ పుల్లలు, ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు, కత్తులు, ట్రేలు, ప్లాస్టిక్‌ స్వీట్‌ బాక్సులు, ఆహ్వాన పత్రికలు, సిగిరెట్‌ ప్యాకెట్లు, 100 లోపు మైక్రాన ఉండే పీవీసీ బ్యానర్లు, అలంకరణ కోసం వాడే ఽథర్మల్‌కోల్‌ వంటి 16 రకాల వస్తువులు ఉన్నాయి.


నగరంలో మితిమీరి..


నెల్లూరులో ప్లాస్టిక్‌ వినియోగం ప్రస్తుతం హద్దులు దాటింది. బహిరంగ మార్కెట్లలో ప్లాస్టిక్‌ సంచులు మితిమీరి వినియోగిస్తున్నారు. వాటిని రోడ్లపై, కాలువల్లో పడేస్తుండటం వల్ల మురుగు కాలువల్లో మరుగు ముందుకు పోవడానికి ఇవే ప్రధాన కారణంగా పారిశుధ్య విభాగం గుర్తించింది. రోడ్లపై వ్యర్థాలను ప్లాస్టిక్‌ సంచుల్లో వేయడం వల్ల అవి తిని ఆవులు, పందులు, కుక్కలు జీర్ణవ్యవస్థ పని చేయక మరణిస్తున్నాయి. నగర, పట్టణ ప్రాంతాల్లో మరణించిన జీవాల్లో 90 శాతం ఇదే కారణంగా ఉన్నట్లు పశుసంవర్థక శాఖ తేల్చింది. పెట్రో కెమికల్‌ ద్వారా తయారయ్యే  ప్లాస్టిక్‌ కవర్లలో వేడి పదార్థాలు వేయడం వల్ల కార్సినోజెనిక్‌ అనే ఉత్పాదిక రసాయనం విడుదలై కేన్సర్‌ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూమిలో వందేళ్లయిన కరగని ఏకైక వస్తువు ప్లాస్టిక్‌గా గుర్తించిన కొన్ని అధ్యయన సంస్థలు దీనిని పూర్తిగా నిషేధించాలని సూచిస్తున్నాయి. 


తనిఖీలతో సరి..


నెల్లూరులో ప్లాస్టిక్‌పై నిషేధాజ్ఞలు పెట్టినప్పుడల్లా కొందరు అధికారులకు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. గతంలో రెండుసార్లు ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన కార్పొరేషన అధికారులు ఆకస్మిక దాడులతో కొన్ని రోజులు హడావుడి చేసి వదిలేశారు. బహిరంగ మార్కెట్లలో ప్లాస్టిక్‌ సంచులు యథేచ్ఛగా దర్శనమిస్తున్నాయి. పైగా శివారు ప్రాంతాలలో తయారు కూడా అవుతున్నాయి. నెల్లూరులోని స్టౌనహౌ్‌సపేట, నవాబుపేట, రేబాలవారివీధితోపాటు చిన్నబజార్‌, పెద్దబజార్‌, ఆచారివీధి, సంతపేట, ట్రంకురోడ్డు, జీఎనటీరోడ్డు ప్రాంతాలలో ప్లాస్టిక్‌ కవర్ల విక్రయాలకు హోల్‌సేల్‌ దుకాణాలు ఉన్నాయి. చెన్నై, బెంగళూరు కేంద్రంగా ఇవీ నెల్లూరులో దిగుమతవుతున్నాయి. 


జిల్లా మొత్తం అమలయ్యేనా!? 


కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని ప్రాంతాలలో ప్లాస్టిక్‌ నిషేధించాలి.  ఆ మేరకు  ఆదేశాలు అమలవుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకు నెల్లూరు కార్పొరేషనతోపాటు ఆత్మకూరు మున్సిపాలిటీలోనే కమిషనర్లు ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా మున్సిపాలిటీలతోపాటు గ్రామ పంచాయతీల్లో ఉత్తర్వులు బయటకు రావాల్సి ఉంది. ఒకేసారిగా పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధిస్తే కొంత కష్టమవుతుంది. కాబట్టి ప్రజలకు అలవాటయ్యే వరకు దశలవారీగా ఈ ప్రక్రియ చేపట్టాలని నిపుణులు  చెబుతున్నారు. ఇందులో కేంద్రం సూచించిన పరిమాణం కన్నా తక్కువ మైక్రాన్లు ప్లాస్టిక్‌ కవర్లను తయారు చేస్తున్న వారిపై దృష్టి పెట్టాల్సి ఉంది. ప్లాస్టిక్‌ వినియోగం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించడంతోపాటు  ప్లాస్టిక్‌ కవర్ల ఉత్పత్తిని నిలిపివేస్తేనే చాలా వరకు ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. 


నిషేధిత ప్లాస్టిక్‌ వాడకూడదు 

భారత ప్రభుత్వం కొన్ని ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధించింది. వాటిని పూర్తిగా వాడకూడదు. ఒక్కసారి వినియోగించే పడేసే కవర్లపైనే మా దృష్టంతా. బహిరంగ మార్కెట్లలో ప్లాస్టిక్‌ వినియోగంతోపాటు ఉత్పత్తిపైన నిఘా పెడుతున్నాం. ప్రజల సహకారం ముఖ్యం. నగర వ్యాప్తంగా ఆకస్మిక దాడులకు బృందాలను ఏర్పాటు చేస్తున్నాము. 

- ఎం జాహ్నవి, కమిషనర్‌ ఎనఎంసీ 


మూగజీవాలకు ప్రాణాంతకం

ప్లాస్టిక్‌ వినియోగం మూగజీవాలకు అత్యంత ప్రాణాంతకం. ఆహార వ్యర్థాలు ప్లాస్టిక్‌ కవర్లలో వేయడం వల్ల వాటిని తిని ఆవులు మరణిస్తున్నాయి. పశువుల మరణాల్లో ఎక్కువ శాతం ప్లాస్టిక్‌ వల్లే. 

- జానా చైతన్యకిషోర్‌, ఏడీ పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల 



పకడ్బందీగా అమలు చేస్తాం 

కేంద్రం ఆదేశాల మేరకు ఆత్మకూరులో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేఽధాన్ని అమలు పరిచేందుకు చర్యలు చేపడతాం. ముందుగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. దుకాణాదారులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించి సహకరించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాం. ఈ నెలాఖరు వరకు దశలవారీగా వార్డు సచివాలయాల పరిధిలో అవగాహన కార్యక్రమాలు  నిర్వహించి, ప్రజలను చైతన్య వంతులను చేస్తాం. ప్లాస్టిక్‌ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం.

-ఎం. రమేష్‌బాబు, మున్సిపల్‌ కమిషనర్‌, ఆత్మకూరు



Updated Date - 2022-07-02T04:38:30+05:30 IST