నిశ్చల!

ABN , First Publish Date - 2022-07-25T05:55:53+05:30 IST

ఈ రోజు కూడా ప్రపంచం, కిటికీ లోనుండి నా మీదుగా చాలా హడావిడిగా వెళ్తుంది, ఎక్కడికో! ఎవరిదో పాటలపెట్టె నుండి, అతినెమ్మదిగా, ప్రేమగా, గుండె తీగలను మీటుతూ...

నిశ్చల!

ఈ రోజు కూడా ప్రపంచం, కిటికీ లోనుండి నా మీదుగా చాలా హడావిడిగా వెళ్తుంది, ఎక్కడికో! ఎవరిదో పాటలపెట్టె నుండి, అతినెమ్మదిగా, ప్రేమగా, గుండె తీగలను మీటుతూ అపరిచిత గాయకుడు, ఏ రోజైనా, ఏ రాత్రయినా, ఏ సమయమైనా సిద్ధమే అంటున్నాడు.


వెలుతురు చురుకుకి కళ్లు విప్పగానే, ఎదురు చూసే మనిషి లేని తన ఇంటి శూన్యత గురించి చెప్పిన, నిన్నటి ఆ స్త్రీ, హఠాత్తుగా హృదయంలోకి, గొంగళి పురుగులా పాకడం మొదలుపెట్టింది.


దుప్పటి మెడ వరకూ లాక్కుని మళ్లీ మూడంకె వేసుకుంటుంటే, ప్రియురాలి కోసం, ప్రపంచాన్ని ఒక పాదంతో తన్ని పరుగులెత్తిన, ఆ చిన్ని ప్రియురాలి లేత ముఖంలోని సుఖాన్ని, జ్ఞాపకం నెమ్మదిగా గాలం వేసి పైకి లాగింది.


నిన్న రాత్రి వచ్చిన కలలోని దుర్బలత, నిర్భయంగా తనకు తానే పాది తవ్వుకొని, నీళ్ళు పోసుకుని చక చక మారాకులు వేసుకుంటూ వళ్లంతా విసుగు విషం నింపింది.


గదిలోకి వచ్చిన అమ్మాయి, పియానో పలికించే నిరంతర విషాద స్రవంతి గురించి వివరించి i like the state of perpetual sadness అన్నది. మధువిషాదం.


కడుపులో ఆకలి దుప్పటి తీసి, కొంచెం కదిలి పక్కకి తిరిగి కాళ్ళు చాపుకుని మళ్లీ పడుకుంది.


దేవుడి లాగే, బుద్ధి వున్న ఆడవాళ్ళని ద్వేషించే అతను, తన రెండు పాదాలతో దుప్పటి నుండి దుఃఖ నదిలోకి తన్నటం మొదలెట్టాడు. వైద్యులు ఆశావాదులు.


దొరికిన దారుల్లో హడావిడిగా సగం దూరం నడిచి వచ్చేసిన జీవితం, హఠాత్తుగా వెనక్కి తిరిగి చూసుకుని, పెదవి విరిచి చతికిలపడి, ఇక కదలనని ఛీకొట్టి మొరాయిస్తుంది ఒక వైపు నుండి మరో వైపుకు తిరుగుతూ, స్వయంకృత వదులు వూబకాయం, అప్పటి వంపుసొంపులను తలచి నిట్టూర్చింది.


కిటికీలోని ప్రపంచం మధ్యాహ్న భోజనానికి కూర్చున్నట్టుంది. నిశ్శబ్దం కావ్‌ కావ్‌ మని ఒక్కటే నల్లగా దిక్కులు చూస్తూ అరుస్తుంది. వచ్చే వాళ్ళెవరూ లేరు. వెళ్ళేందుకూ లేరు.


నాలుగిళ్లల్లో చక చక పనిచేసే ఆవిడ, నలభైయ్యో ఇంటి గంట నొక్కినట్లుంది. చైతన్యం, ఆకలి కడుపు, రోజూ అదే దారిలో వెళ్తుంటాయి, ఇంట్లో బిడ్డల కోసం పరుగుపెట్టే పాచి పనులావిడని ప్రతిరోజూ పలకరిస్తూ వుంటాయి.


ఆకాశానికి, హడావిడి రోడ్డుకి మధ్యనున్న పచ్చిక మైదానం అమాయకంగా ఆశపడుతూ నగరం వైపు తొంగి, నిక్కి చూస్తూ ఉంది. పాపం, మొసళ్ళ పండుగ గురించి ఆరాటపడే పడుచు పిల్ల!డ్వోరక్‌ బొహేమియా, మనసూ కలిసి, రమిస్తున్న రెండు బలిష్టమైన పాముల్లా, ఒకదానికొకటి బంధాలు వేసుకుని, అలవి కాని యుక్త వయస్సు అబ్బాయిలా కన్నీటి ధారలయ్యాయి.


కిటికీలోని ప్రపంచం బిర బిరా పరుగులు తీస్తుంది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అని ఈ ప్రపంచానికి ఒక లెక్క వుంది. కాలమానం పనిచేయని జీవితాలు కూడా వుంటాయి. లెక్కలు తెలీని జీవితాలూ!

సామాన్య


Updated Date - 2022-07-25T05:55:53+05:30 IST