ముంబైకి తప్పిన ముప్పు

ABN , First Publish Date - 2020-06-04T07:52:30+05:30 IST

నిసర్గ తుఫాను నుంచి ముంబై నగరానికి ముప్పు తప్పింది. భారీ ఈదురు గాలులు.. వర్షాలతో నిసర్గ విరుచుకుపడుతుందన్న ఆందోళన నేపథ్యంలో తీరం దాటిన తర్వాత బలహీనపడటంతో ఆర్థిక రాజధానికి ఊరట...

ముంబైకి తప్పిన ముప్పు

ముంబై, జూన్‌ 3: నిసర్గ తుఫాను నుంచి ముంబై నగరానికి ముప్పు తప్పింది. భారీ ఈదురు గాలులు.. వర్షాలతో నిసర్గ విరుచుకుపడుతుందన్న ఆందోళన నేపథ్యంలో తీరం దాటిన తర్వాత  బలహీనపడటంతో ఆర్థిక రాజధానికి ఊరట లభించింది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ నిసర్గ తుపాను, మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలోని ముంబైకి 110 కిలోమీటర్ల దూరంలో గల అలీబాగ్‌ పట్టణం వద్ద తీరాన్ని దాటింది.  మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఈదురు గాలులతో వర్షాలు పడుతున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలాచోట్ల చెట్లు, స్తంభాలు కూలిపోయాయి. బుధవారం మధ్యాహ్నం 12:30 నిమిషాలకు తుపాను తీరాన్ని తాకిన సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.


తీరం దాటే గమనం సాయంత్రం 4గంటల వరకు, సుమారు 3గంటల పాటు సాగింది. ఈ క్రమంలో ముంబై, థానే మీదుగా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. వర్షాలతో మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో ఒకరు, పుణె జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. మహారాష్ట్ర, గుజరాత్‌లలోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అన్ని రైళ్లను రీషెడ్యూల్‌ చేశారు. విమానాలను రద్దు చేశారు.   బుధవారం సాయంత్రానికి తుపాను ప్రభావం తగ్గడంతో  ముంబైలో విమానాలను పునరుద్ధరించారు. మత్స్యకారులను వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. తుపాను ప్రభావంతో ముంబైలో బుధవారం 144 సెక్షన్‌ విధించారు. ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. ముంబైలోని ఓ ఇంట్లో పై నుంచి పెచ్చులు ఊడి పడటంతో ముగ్గురు గాయపడ్డారు. తీర ప్రాంతాల్లో వేల సంఖ్యలో నివాసం ఉంటున్న ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలీబాగ్‌ వద్ద తీర ప్రాంతంలోని 1500 మందిని, ముంబై తీర ప్రాంతంలో ఉంటున్న  40వేల మందిని, గుజరాత్‌లో 63,700 మందిని ముందే ఖాళీ చేయించి మరోచోటుకు తరలించారు. మునిసిపల్‌ స్కూళ్లను తాత్కాలిక ఆవాసాలుగా మార్చేసి అక్కడ బాధితులకు ఆహారం, మంచి నీళ్లు అందిస్తున్నారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా మిరక్వాడ తీరంవద్ద 10మంది నావికులను రక్షించారు.


తుపాను ప్రభావంతో పశ్చిమ-దక్షిణ ముంబైని కలిపే బాంద్రా-వర్లీ వంతెనను మూసివేశారు. నిసర్గ ప్రభావం మహారాష్ట్రలోని ఉత్తర ప్రాంతం, రాయ్‌గఢ్‌, రత్నగిరి, దుర్గ్‌, థానే, పుణె, అహ్మద్‌నగర్‌, పుణెపై తీవ్రంగా ఉంది.  తుపాను తీరం దాటిన తర్వాత గుజరాత్‌ ఊపిరి పీల్చుకుంది. తుపాను ప్రభావం గుజరాత్‌పై అంత తీవ్రంగా ఉండదని, తీర ప్రాంతంలోని వల్సద్‌, నవ్‌సరీ జిల్లాల్లో గాలుల తీవ్రత సాధారణంగానే ఉందని అహ్మదాబాద్‌ వాతావరణ విభాగం పేర్కొంది.

Updated Date - 2020-06-04T07:52:30+05:30 IST