‘నిసర్గ’ తుపాను వస్తోంది, జాగ్రత్తలు తీసుకోండి : మోదీ

ABN , First Publish Date - 2020-06-03T00:22:37+05:30 IST

అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం బలపడి తుపానుగా

‘నిసర్గ’ తుపాను వస్తోంది, జాగ్రత్తలు తీసుకోండి : మోదీ

ముంబై : అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం బలపడి తుపానుగా మారింది. ఇది పెను తుపానుగా మారే అవకాశం ఉండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ ట్వీట్ చేశారు. భారత దేశ పశ్చిమ తీరంలో కొన్ని ప్రాంతాల్లో తుపాను పరిస్థితుల నేపథ్యంలో అన్ని వివరాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అందరూ సాధ్యమైన ముందు జాగ్రత్తలు, రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరారు.


పెను తుపాను ‘నిసర్గ’ బుధవారం మధ్యాహ్నానికి మహారాష్ట్రలోని అలీబాగ్ వద్ద తీరాన్ని తాకనుంది. ముంబై నుంచి దక్షిణ దిశలో 94 కిలోమీటర్ల దూరంలో ఈ తుపాను తీరాన్ని తాకుతుంది. గంటకు సుమారు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలుల వేగం గంటకు 120 కిలోమీటర్ల వరకు  పెరగవచ్చు. ఈ పెను తుపాను ప్రభావం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలపై తీవ్రంగా ఉంటుందని ఇండియన్ మెటియరలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) ప్రకటించింది. 


తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ‘నిసర్గ’ తుపాను ఏర్పడింది. దీని ప్రభావం మంగళవారం సాయంత్రం నుంచి కనిపించింది. ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం చిరు జల్లులు కురిశాయి. బొరివలి, దాదర్, బాంద్రా, అంధేరీ వెస్ట్, పరేల్, ములుంద్‌లలో కూడా జల్లులు కురిశాయి. 


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కార్యాలయం మంగళవారం ఉదయం ఓ ప్రకటనలో నిసర్గ తుపాను వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. జాతీయ విపత్తు స్పందన దళానికి చెందిన 10 బృందాలను తీర ప్రాంతాల్లో మోహరించినట్లు తెలిపింది. 


ఇండియన్ మెటియరలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కేఎస్ హోసలికర్ మాట్లాడుతూ, పెను తుపాను ‘నిసర్గ’ బుధవారం మధ్యాహ్నానికి మహారాష్ట్రలోని అలీబాగ్ వద్ద తీరాన్ని తాకనుందని తెలిపారు. హరిహరేశ్వర్, డామన్ మధ్యలో అలీబాగ్ సమీపంలో తీరాన్ని తాకుతుందని తెలిపారు. ఈ తుపాను ప్రస్తుతం పంజిమ్‌కు పశ్చిమ-నైరుతి దిశలో 280 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. ముంబై నుంచి దక్షిణ-నైరుతి దిశలో 430 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. 


Updated Date - 2020-06-03T00:22:37+05:30 IST