ఏడేళ్ల తర్వాత మోక్షం

ABN , First Publish Date - 2022-04-22T05:35:12+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే వంట మనుషులు, హెల్పర్స్‌కు ఇప్పటి వరకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచే నిర్ణయం తీసుకోవడంతో మధ్యాహ్నభోజన నిర్వాహకులకు ఏడేళ్ల తర్వాత మోక్షం లభించినట్లయింది.

ఏడేళ్ల తర్వాత మోక్షం
ప్రభుత్వ పాఠశాలలో వంట చేస్తున్న మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు

- మధ్యాహ్న భోజన కార్మికులకు పెరిగిన వేతనం

- రూ. వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంపు

- జిల్లాలో 1,863 మంది వంట మనుషులు, హెల్పర్స్‌కు ప్రయోజనం

- పాఠశాలల్లో వంట ఏజెన్సీల నిర్వాహణకు పెరుగనున్న డిమాండ్‌


కామారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 21: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే వంట మనుషులు, హెల్పర్స్‌కు ఇప్పటి వరకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచే నిర్ణయం తీసుకోవడంతో మధ్యాహ్నభోజన నిర్వాహకులకు ఏడేళ్ల తర్వాత మోక్షం లభించినట్లయింది. 2010 సంవత్సరం తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండుతున్న కార్మికులకు గౌరవ వేతనంగా ఒక్కొక్కరికి రూ.వెయ్యి చెల్లిస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 నుంచి ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో వంట ఏజెన్సీలను నిర్వహిస్తున్న మహిళలు తమ గౌరవ వేతనాన్ని రూ.5000లు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ వచ్చారు. ఈ విధంగా ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న వంట ఏజెన్సీ మహిళలు దాదాపు ఏడేళ్లుగా తమ డిమాండ్‌ను ప్రభుత్వానికి తెలియజేస్తూ రావడంతో ఇటీవల సీఎం కేసీఆర్‌ మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచనున్నట్లు ప్రకటించడంతో కొద్దిమేర వారికి ఊరట లభించినట్లయింది.

జిల్లాలో 1,863 మందికి లబ్ధి

జిల్లాలో 1011 ప్రభుత్వ పాఠశాలల్లో 1,863 మంది కుక్‌ కమ్‌ హెల్పర్స్‌ పని చేస్తున్నారు. వీరు ప్రతీ రోజు పాఠశాల పని వేళలకు వచ్చి మధ్యాహ్నానికి విద్యార్థులందరికీ భోజనం తయారు చేసి పెట్టాలి. ఈ విధంగా 300 మంది విద్యార్థుల కంటే తక్కువగా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో అయితే ముగ్గురు చొప్పున కుక్‌కమ్‌ హెల్పర్స్‌ను నియమించే అవకాశం ఉండగా, ఆ తర్వాత పెరిగిన ప్రతీ 50 మంది విద్యార్థులకు మరో హెల్పర్‌ను నియమించుకునే అవకాశం ఉంది. రూ.వెయ్యి గౌరవ వేతనం సరిపడక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండేవి. కరోనా సమయంలో రెండు సంవత్సరాలు పాఠశాలలు బంద్‌ కావడంతో చాలా వరకు మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులు ఆ పనికి ఫుల్‌స్టాప్‌ పెట్టి ఇతర పనుల వైపు వెళ్లారు. కొందరు మాత్రమే వేచిచూసే ధోరణిలో ఉండి పాఠశాలలు ప్రారంభమైన సమయంలో వంట చేస్తూ వచ్చారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు వంట ఏజెన్సీలను వదులుకోవడంతో విద్యాశాఖాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి రావడం లేదంటే రెండు, మూడు పాఠశాలలు ఒకే ఏజెన్సీకి ఇవ్వడం లాంటివి చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం చాలా వరకు పాఠశాలల్లో ఏజెన్సీలు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్వాహకులకు వేతనం పెంచే నిర్ణయంతో మళ్లీ ఏజెన్సీల నిర్వహణ వైపు దృష్టి సారించే అవకాశం లేకపోలేదు.

ఏజెన్సీలకు పెరగనున్న పోటీ

జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేస్తున్న వంట ఏజెన్సీలకు పెరిగిన గౌరవ వేతనం మూలంగా పోటీ కూడా పెరగనుంది. ఇప్పటి వరకు ఏడాదికి 10 నెలలకు గాను ప్రతినెల రూ.వెయ్యిని ప్రభుత్వం గౌరవ వేతనంగా ఇచ్చేది. దీంతో వంట ఏజెన్సీలు నిర్వహించేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోయేవారు. రోజువారి కూలీ పనులకు వెళ్లిన ప్రతీరోజు రూ.300 తగ్గకుండా నెలకు కనీసం రూ.9000 వరకు పోగు చేసుకునే అవకాశం ఉంది. పొలాలకు, బయటి పనులకు వెళ్లి ఇతరత్రా పనులు చేయలేని మహిళలు మాత్రమే వంట ఏజెన్సీ పనులు చేస్తూ ఉండేవారు. తాజాగా పెరిగిన రూ.3వేల వేతనం వల్ల భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయా పాఠశాలల పరిధిలో నిర్వహిస్తున్న వంట ఏజెన్సీల నిర్వాహణకు మహిళల నుంచి పోటీ పెరిగే అవకాశం కూడా లేకపోలేదు.


విధి విఽదానాలు ఇంకా రాలేదు

- రాజు, డీఈవో, కామారెడ్డి

గౌరవ వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచగా దానికి సంబంధించిన విధివిఽధానాలు మాకు ఇంకా రాలేదు. వారికి జీతాలు పెరగడం సంతోషకరమైన విషయం. జీతం తక్కువగా ఉందని చాలా మంది మహిళలు వంట ఏజెన్సీలను నిర్వహించేందుకు ఇష్టపడేవారు కాదు.

Updated Date - 2022-04-22T05:35:12+05:30 IST