డిజి..డల్ బడ్జెట్!

ABN , First Publish Date - 2022-02-02T07:54:42+05:30 IST

‘ఈ బడ్జెట్‌లో నాకేంటి!?’ అని ఎవరైనా ప్రశ్నించుకుంటే.. వారికి నిరాశ తప్పదు! ఓ మహిళ..

డిజి..డల్ బడ్జెట్!

‘ఈ బడ్జెట్‌లో నాకేంటి!?’ అని ఎవరైనా ప్రశ్నించుకుంటే.. వారికి నిరాశ తప్పదు! ఓ మహిళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మహిళల ఊసు లేదు! అహరహం దేశాభివృద్ధికి శ్రమించే అన్నదాతల ప్రస్తావన లేదు! ఉద్యోగులకు ఊరట లేదు! ఎప్పటి నుంచో ఆశిస్తున్న ‘స్టాండర్డ్‌ డిడక్షన్‌’ పెంచలేదు! ఆదాయ పన్ను పరిమితులను మార్చలేదు! నిరుద్యోగులకు నిర్దిష్ట హామీ లేదు! మధ్య తరగతి ముచ్చట లేదు! ఇక, పేదలు, అణగారిన వర్గాలు సహా సామాన్యుల సంబోధన అసలే లేదు! ‘మీరు కట్టిన పన్నులతోనే దేశం ఆర్థికంగా కోలుకుంది’ అన్న ప్రశంసలు తప్ప.. పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహకాలు లేవు! అనేక రంగాలకు నిధులు తగ్గించారు. లేదంటే, యథాతథంగా ఉంచారు! చివరికి, కరోనా కాలంలో కొలువులు కోల్పోయి విద్యావంతులూ ఉపాధి పొందిన ఉపాధి హామీ నిధుల్లోనూ కోత కోశారు. మరి, ఈ బడ్జెట్‌లో ఏముంది!? అంటే.. సంస్థాగతంగా, సంస్కరణలపరంగా కొన్ని మార్పులు! గత ఏడాదిలాగే.. మౌలిక సదుపాయాలకు పెద్దపీట! వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏం జరగనుంది!? అంటే.. ఈ ఏడాది ఏం జరిగిందో.. వచ్చే ఏడాది కూడా అదే కొనసాగుతుంది (స్టేటస్‌ కో) అన్నమాట!! డిజిటల్‌ దిశగా మరో అడుగు ముందుకు పడుతుంది! 


ప్రైవేటీకరణ మరో అంతస్తు పైకి చేరుతుంది!! వెరసి, ఎవరినీ పెద్దగా సంతృప్తిపరచని బడ్జెట్‌ ఇది!!

అందరినీ నిరాశపరిచిన నిర్మల

ఎరువులు, ఆహారం, చమురు సబ్సిడీల్లోనూ కోత

మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు.. ఎవరికీ ఏమీ లేవు

డిజిటల్‌ యూనివర్సిటీ ఏర్పాటు.. 200 చానళ్లలో ఈ-విద్య

ఈ-కంటెంట్‌, ఈ-పాస్‌పోర్ట్‌, ఈ-రిజిస్ట్రేషన్‌ కూడా

రక్షణ పరిశోధనలో ప్రైవేటు సంస్థలకూ భాగస్వామ్యం

రక్షణ కొనుగోళ్లలో 68 శాతం స్వదేశీ కంపెనీల నుంచే

మౌలిక సదుపాయాలకు పెద్దపీట.. క్యాపిటల్‌ వ్యయం పెంపు

మూడేళ్లలో 400 వందే భారత్‌ రైళ్లు.. 100 కార్గో టెర్మినళ్లు

పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

డిజిటల్‌ డాంబికాలు తప్ప సంక్షేమ ఊసు లేదు


పెరిగేవి

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 

అన్ని వస్తువులు, గొడుగులు, 

ఇయర్‌ ఫోన్స్‌, స్మార్ట్‌ మీటర్లు, సోలార్‌ ప్యానెల్స్‌, ఇమిటేషన్‌ నగలు 


మొత్తం బడ్జెట్‌ 39,44,909 కోట్లు.. అందులో దాదాపు మూడో వంతు అప్పులే 

5జీ స్పెక్ట్రమ్‌ వేలానికి లైన్‌ క్లియర్‌.. ఆస్తుల అమ్మకం ద్వారా ఆర్జన టార్గెట్‌ 65,000 కోట్లు

3 లక్ష్యాలు.. 4 ప్రాథమ్యాలు.. ‘గతిశక్తి’కి పెద్దపీట.. దాని గమనానికి 7 ఇంజన్లు

5.25 లక్షల కోట్లతో దేశ రక్షణ.. 80,00,000 ఇళ్లతో ప్రజలకు నివాస యోగం

ఈ-విద్య కోసం 200 టీవీ చానెళ్లు.. 100% డిజిటలైజేషన్‌తో పోస్టల్‌లో బ్యాంకింగ్‌

ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పు లేదు.. డిజిటల్‌ కరెన్సీ లావాదేవీలపై 30% బాదుడు

సహకార సంఘాలపై పన్ను తగ్గింపు.. పన్ను ఎగవేతదారుల పట్ల ఇక మరింత కఠినం

బ్యాటరీ స్వాపింగ్‌తో ఈ-వాహనాలకు కొత్త రెక్కలు.. చార్జింగ్‌ పరిమితులకు ఇక చెక్‌!


తగ్గేవి

రత్నాలు, వజ్రాలు, 

మొబైల్‌ ఫోన్లు, ఇంగువ, 

కోకో గింజలు, పెట్రో కెమికల్స్‌, తుక్కు ఇనుము


చప్పట్లే చప్పట్లు

నిర్మలా సీతారామన్‌ సుమారు 90 నిమిషాలపాటు నింపాదిగా బడ్జెట్‌ ప్రసంగం చదివారు. మూడు నాలుగు సందర్భాల్లో విపక్ష సభ్యుల నుంచి... అది ఒకరిద్దరు మాత్రమే ఏవో వ్యాఖ్యలు చేశారు. ‘సానుకూల’ ప్రకటనలు వెలువడిన ప్రతిసారీ ప్రధాని సహా అధికార పార్టీ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. 


ఇక ప్రైవేటు అడవులు

దేశవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచేందుకు ప్రైవేటు అడవులు రానున్నాయి. అలాగే అటవీ వ్యవసాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించనుంది. ఇందు కోసం త్వరలో చట్టంలో మార్పులు చేయనుంది. ఇక ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు ప్రారంభించిన సింగిల్‌ విండో పోర్టల్‌ ‘పరివేశ్‌’ పరిధిని కేంద్రం విస్తరించనుంది. 

  

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): బడ్జెట్‌ ప్రసంగంలో ‘రికార్డు’కెక్కిన నిర్మలా సీతారామన్‌ ఈసారి గంటన్నరలోనే ముగించేశారు! అయినా.. అందులో మెరుపులూ లేవు! మరకలూ లేవు! జనాకర్షణ జపమూ లేదు! పూర్తిగా సంస్కరణల మంత్రమూ లేదు! బీజేపీకి అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండడం.. పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండడంతో చాలా మంది చాలా ఆశలు పెట్టుకున్నారు! పంజాబ్‌, యూపీల్లో రైతులను ఆకర్షించడానికి ప్రత్యేక పథకాలు ఉంటాయని భావించారు! మద్దతు ధర చట్టం దిశగా అడుగులు ఉంటాయని అంచనా వేశారు! అవేమీ లేకపోగా.. ఉన్న సబ్సిడీల్లోనూ కోత కోశారు! ఇప్పటికే అమలవుతున్న పథకాలకు కేటాయింపులనూ తెగ్గోశారు! ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కారణంగా ఎదురు దెబ్బలు తినడమో మరో కారణమో తెలియదు కానీ.. సాగు రంగంపై కేంద్ర బడ్జెట్లో శీతకన్నేశారు! ఇక, మధ్య తరగతి మా వెన్నెముక అని బీజేపీ చెబుతూ ఉంటుంది! దాంతో, ఎన్నికల నేపథ్యంలో ఆ వర్గాన్ని ఆకర్షించే చర్యలు ఉంటాయని అనుకున్నారు! కానీ, బడ్జెట్లో మధ్య తరగతి మాటే లేదు! ఇక, వేతన జీవులు! గత బడ్జెట్లోనూ వీరికి ఎటువంటి ఊరట లేదు!


నిత్యావసరాలు మాత్రమే కాదు.. ఇప్పుడు అన్నిటి ధరలూ ఆకాశాన్ని దాటి అంతరిక్షాన్ని తాకుతున్నాయి! దాంతో, ఉద్యోగులకు ఊరట కలిగించేలా పన్ను మినహాయింపులు ఉంటాయని ఆశించారు. కరోనా కారణంగా వైద్యం, ఆరోగ్యంపై ఖర్చు పెరిగింది. ఆరోగ్య బీమాపై శ్రద్ధ పెరిగింది. దాంతో, పన్ను మినహాయింపుల్లో కనీసం ఆరోగ్య బీమా పరిమితిని పెంచుతారని ఆశించారు! కానీ, అందరి ఆశలు, అంచనాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తూచ్‌.. అనేశారు! ఐదు రాష్ట్రాల్లో గెలుపు తథ్యమనే ధీమాతో జనాకర్షణ మంత్రానికి నై చెప్పేశారు! ప్రసంగాన్ని తాను స్వయంగా ట్యాబ్లెట్‌లో చూసి చదువుతూ.. ఈసారి బడ్జెట్‌ను డిజిటల్‌ బాట పట్టించారు! డిజిటల్‌ రూపీకి జైకొట్టారు! డిజిటల్‌ కరెన్సీకి జెండా ఊపారు! క్రిప్టో కరెన్సీ వంటి డిజిటల్‌ ఆస్తుల బదిలీపై 30 శాతం పన్నేశారు! డిజిటల్‌ యూనివర్సిటీ పెడతామన్నారు! ‘ప్రధాని ఈ-విద్య’ పేరిట 200 చానళ్ల ద్వారా ఆన్‌లైన్‌ చదువును అందిస్తామన్నారు! విద్యార్థులకు అందుబాటులోకి ఈ-కంటెంట్‌ తెస్తున్నారు. ఈ-పా్‌సపోర్ట్‌ ప్రవేశపెడుతున్నారు! దాంతో, చిప్‌ ఆధారిత పాస్‌ పోర్టులు రానున్నాయి! రిజిస్ట్రేషన్లూ దేశంలో ఎక్కడి నుంచైనా చేసుకొనే వెసులుబాటు కల్పిస్తున్నారు. డిజిటల్‌ యుగానికి అత్యంత కీలకమైన ‘5జీ’ని వచ్చే ఏడాది దేశంలో ప్రవేశపెట్టనున్నారు!


ప్రైవేటీకరణకు మరో అడుగు!

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే ప్రకటించిన ఎల్‌ఐసీ ఐపీవోను వచ్చే ఆర్థిక సంవత్సరంలో తీసుకొస్తామని చెప్పింది. రక్షణ రంగంలో ప్రైవేటీకరణకు పెద్దపీట వేసింది. డీఆర్డీవో, ఇతర రక్షణ పరిశోధన సంస్థల భాగస్వామ్యంతో ప్రైవేటు సంస్థలు కూడా ఇకపై పెట్టుబడులు పెట్టవచ్చు. పరిశోధనల్లో భాగస్వాములు కావచ్చు. దేశ రక్షణ అవసరాలకు చేసే కొనుగోళ్లలో 68 శాతం దేశీయ కంపెనీల నుంచే కొనుగోలు చేయాలని నిర్ణయించారు. తద్వారా, విదేశీ కంపెనీల నుంచి కొనుగోళ్లను కేవలం 32 శాతానికి పరిమితం చేశారు! దాంతో, రక్షణ ఉత్పత్తుల దిగుమతులు తగ్గనున్నాయి. అలాగే, రక్షణ బడ్జెట్లో పరిశోధన, అభివృద్ధి కేటాయింపుల్లో 25 శాతాన్ని ప్రైవేటు సంస్థలకు కేటాయించనున్నారు. చిన్న, సూక్ష్మ తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ)కు అత్యవసర రుణ హామీ పథకాన్ని మరో ఏడాది కొనసాగించనున్నారు. మరో అంశం ఏమిటంటే, ఆహారం, ఎరువులు, చమురు సబ్సిడీలకు కేటాయించే మొత్తంలో నాలు గో వంతుకుపైగా కోత వేశారు. అంటే, రాబోయే రోజుల్లో పెట్రోలు, డీజిల్‌, ఎరువుల ధరలు భగ్గుమన్నట్టే!


సదుపాయాల కల్పనపైనే దృష్టి

ప్రధాన మంత్రి ఎవరైనా.. బీజేపీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తుంది. ఈ బడ్జెట్లో కూడా జరిగిందదే! ప్రభుత్వ పెట్టుబడులను భారీగా పెంచి, మౌలిక సదుపాయాల రంగంలో వేగంగా అభివృద్ధి సాధించడం ధ్యేయంగా కేంద్ర బడ్జెట్‌ కొనసాగింది. జాతీయ రహదారులు; గ్రామీణ రహదారులు, ఇళ్ల నిర్మాణం, రవాణా, మిషన్‌ భగీరథ తరహాలో ఇంటింటికీ తాగునీటి కనెక్షన్లు (హర్‌ ఘర్‌ జల్‌ పథకం); 25 వేల కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌ వేలు; నదుల అనుసంధానం వంటి ప్రాజెక్టులకు నిధులు భారీగా కేటాయించారు. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి గతి శక్తి మాస్టర్‌ ప్లాన్‌కు శ్రీకారం చుట్టారు. అందుకే, బడ్జెట్లో క్యాపిటల్‌ వ్యయం కూడా భారీగా అంటే దాదాపు రూ.2 లక్షల కోట్లు పెరిగింది. గత బడ్జెట్లో ఇది రూ.5.54 లక్షల కోట్లు. ఇప్పుడు క్యాపిటల్‌ వ్యయం కిందే రూ.7.5 లక్షల కోట్లు కేటాయించారంటే ఆ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు, మాస్‌ ట్రాన్స్‌పోర్ట్‌, జల మార్గాలు, లాజిస్టిక్స్‌ మౌలిక సదుపాయాలను ఏడు ఇంజిన్లుగా పేర్కొన్న నిర్మల.. వాటికే పెద్దపీట వేశామని చెప్పారు. ఎక్స్‌ప్రెస్‌ హైవేలకు గత బడ్జెట్లో రూ.1.18 లక్షల కోట్లు కేటాయిస్తే.. ఈసారి దానిని రూ.1.99 లక్షల కోట్లకు పెంచారు!


అంతేనా, రవాణా రంగానికి గత బడ్జెట్లో రూ.2.3 లక్షల కోట్లు కేటాయిస్తే.. ఈసారి అది కాస్తా రూ.3.5 లక్షల కోట్లు అయింది. రాబోయే మూడేళ్లలో 400 వందే భారత్‌ రైళ్లు; వంద వరకూ కార్గో టెర్మినళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. రానున్నది విద్యుత్తు వాహనాల యుగం! అందుకు, చార్జింగ్‌ స్టేషన్లు సమస్య అన్నది ఇప్పటి వరకూ ఉన్న మాట! కానీ, చార్జింగ్‌కు బదులుగా బ్యాటరీ అయిపోతే బ్యాటరీని మార్చుకునే విధానానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. అలాగే, సౌర విద్యుత్తు మాడ్యూళ్లు కావాలంటే మనం చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే! కానీ, ఈ విషయంలోనూ స్వయం సమృద్ధి దిశగా బడ్జెట్లో పావులు కదిపారు. ఇందుకు భారీ కేటాయింపులు చేశారు. అలాగే, స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌ (ఎస్‌ఈజడ్‌) చట్టంలో సవరణలు చేయనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.11.6 లక్షల కోట్లు అప్పులు చేస్తామని బడ్జెట్లో పేర్కొంది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది దాదాపు రూ.2 లక్షల కోట్లు ఎక్కువ!! చివరిగా.. కరోనా కారణంగా ఆదాయాలు పడిపోవడంతో ఖర్చు భారీగా పడిపోయిందని నివేదికలు ఘోషిస్తున్నాయి. కానీ, ప్రజల వినియోగాన్ని (ఖర్చును) పెంచే దిశగా బడ్జెట్లో చర్యలు లేకపోవడం గమనార్హం!!

Updated Date - 2022-02-02T07:54:42+05:30 IST