నిర్మల చెప్పిన ‘హిందీ ద్వేషం’ నిజమేనా?

ABN , First Publish Date - 2022-10-01T07:41:15+05:30 IST

శ్రీమతి కస్తూరి సత్యసంధతకు నేను గర్విస్తున్నాను. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని, తమిళనాడు స్టేట్ బోర్డ్ సిలబస్‌ను అనుసరించే ఒక పాఠశాలలో..

నిర్మల చెప్పిన ‘హిందీ ద్వేషం’ నిజమేనా?

శ్రీమతి కస్తూరి సత్యసంధతకు నేను గర్విస్తున్నాను. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని, తమిళనాడు స్టేట్ బోర్డ్ సిలబస్‌ను అనుసరించే ఒక పాఠశాలలో చదువుకున్న విద్యార్థినని ఆమె తనకుతాను పరిచయం చేసుకున్నారు. ఆ వెంటనే ఆమె ఒక వాస్తవాన్ని పిడుగుపాటులా వెల్లడించారు. ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఇటీవల ముంబైలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తన విద్యార్థి దశలో తమిళనాడులో హిందీ నేర్చుకోవాలంటే ఎదురయ్యే సమస్యలు, వివక్షల గురించి ప్రస్తావించారు. నిర్మల వ్యాఖ్యలకు ప్రతి స్పందిస్తూ కస్తూరి ఇలా చెప్పారు: ‘ఒక విద్యావిషయిక అంశంగా తొలుత హిందీని, తరువాత సంస్కృతం (తమిళం కాదు)ను చదివాను. ప్రతిభావంతులైన పాఠశాల విద్యార్థులకు లభించే ప్రతీ ఉపకార వేతనాన్ని నేను పొందాను’. ఈ వ్యాసం రాస్తున్న సమయానికి కస్తూరి వెల్లడించిన విషయాలను నిర్మల సీతారామన్ ఖండించలేదు.


తమిళనాడులో పాఠశాల స్థాయిలో హిందీ చదివిన విద్యార్థులకు ప్రతిభా ఉపకారవేతనాలను నిరాకరించేవారని, పలు వివక్షలకు గురిచేసేవారని సీతారామన్ ఆరోపించారు. ‘తమిళనాడులో తాను విద్యార్థినిగా ఉన్నప్పుడు హిందీ చదివినవారిని, చదువుతున్నవారిని పాఠశాలల్లోనూ వీథుల్లోనూ అవహేళన చేసేవారు, అవమానించేవారు. దాదాపుగా వెలివేసేవారు. తమిళనాట ఇప్పటికీ ఆ పరిస్థితులలో మార్పులేదు. తమిళ ప్రజలు చాలా ‘నాగరీకులు’. అయితే హిందీ పట్ల ద్వేషం, ఆ భాషను నేర్చుకోకుండా అడ్డుకోవడం ‘అనాగరికం’ అనీ ఆమె అన్నారు. హిందీ పట్ల ద్వేషభావాన్ని తాను తిరస్కరించానని ఆమె తెలిపారు. నిర్దిష్ట రాజకీయ పార్టీల మూలాలు జస్టిస్ పార్టీలో ఉండడంవల్లో లేదా అవి ‘ద్రావిడియన్ నమూనా’ను విశ్వసిస్తున్నందువల్లో హిందీ పట్ల ద్వేషాన్ని కలిగించాయని ఆమె అన్నారు. నిజంగా తీక్షణమైన మాటలు. తాను ఒక మహాపోరాటాన్ని ప్రారంభిస్తున్నట్టుగా టీవీ తెరపై ఆమె హావభావాలు కన్పించాయి.


గత యాభై ఐదేళ్లుగా తమిళనాడును పరిపాలిస్తున్న డిఎంకె, అన్నాడిఎంకెలు నిర్మల సీతారామన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి తన ఆరోపణలకు రుజువులు చూపాలని ఆర్థిక మంత్రిని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మోహన్ కుమారమంగళం సవాల్ చేశారు అంతేకాదు ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ‘No Data Available Government’ (ఎన్‌డిఏ ప్రభుత్వం)కు చెందినవారని ఆయన ఎత్తిపొడిచారు.


తమిళనాడు ప్రభుత్వ అధికారిక విద్యా విధానం త్రిభాషా సూత్రాన్ని తిరస్కరించి, ద్విభాషా సూత్రాన్ని ఆమోదించింది. దీని ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో తమిళం, ఇంగ్లీష్‌ను బోధించేవారు. డిఎంకె, అన్నాడిఎంకె ప్రభుత్వాలు రెండూ ఈ విధానానికే కట్టుబడి ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న, పొందని వేలాది పాఠశాలల్లో హిందీని బోధించే విషయాన్ని ఆయా పాఠశాలల నిర్ణయానికి అవి వదిలివేశాయి. వాటి నిర్ణయాలలో ఏ ప్రభుత్వమూ ఎన్నడూ జోక్యం చేసుకోలేదు. ఈ ఎయిడెడ్, నాన్–ఎయిడెడ్ పాఠశాలలతో పాటు సిబిఎస్ఈకి అనుబంధితమైన 1,417 పాఠశాలలు, ఐసిఎస్ఈకి అనుబంధితమైన 76 పాఠశాలలు, ఐబికి అనుబంధితమైన 8 పాఠశాలు కూడా ఉన్నాయి. ఇంకా 41 ఆంగ్లో–ఇండియన్ పాఠశాలలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 51 కేంద్రీయ విద్యాలయ పాఠశాలలు కూడా ఉన్నాయి. ఈ పాఠశాలలన్నిటిలోనూ హిందీని బోధిస్తున్నారు.


హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అనధికారిక విద్యా విధానం ప్రభుత్వ పాఠశాలల్లో ఏక– భాషా సూత్రాన్నే అమలుపరుస్తోంది. ఆ ఏకైక భాష హిందీ. బోధనా మాధ్యమంగానూ అధ్యయన అంశంగానూ హిందీ మాత్రమే ఉంది. ద్వితీయ భాషలుగా సంస్కృతం, పంజాబీ, మరాఠీ, గుజరాతీని బోధిస్తున్నారు. ఆంగ్ల భాషనూ బోధించాలని హిందీ రాష్ట్రాల విద్యా విధానాలు ప్రతిపాదిస్తున్నాయి. అయితే ఇంగ్లీష్ భాషను బోధించేందుకు అర్హులైన ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. దీనికితోడు ఆంగ్లాన్ని నేర్చుకునేందుకు ముందుకొస్తున్న విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. దక్షిణ భారతీయ భాషల గురించి మాట్లాడేదేముంది? హిందీ భాషా రాష్ట్రాల ప్రభుత్వాలు వాటిని ఉపేక్షిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు సైతం చాలా ఉత్సాహంగా ప్రభుత్వ పాఠశాలల బాటనే అనుసరిస్తున్నాయి.


ఏతావాతా హిందీ భాషా రాష్ట్రాలలో ఏకభాషా విధానం; స్థానిక భాష హిందీ అయినా లేదా ఏదైనా సోదరభాష (ఉదాహరణ. గుజరాతీ, మరాఠీ, పంజాబీ) మాట్లాడే రాష్ట్రాలలో ద్విభాషా విధానం అమల్లో ఉంది. దక్షిణ భారతదేశ రాష్ట్రాలలో మాత్రమే త్రిభాషా సూత్రాన్ని అమలుపరచాలని పట్టుబడుతున్నారు! అయినప్పటికీ దక్షిణాది రాష్ట్రాలలో వేలాది విద్యార్థులు పాఠశాలల్లో హిందీని చదివేందుకు మొగ్గు చూపుతున్నారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ లేదా భారతీయ విద్యా భవన్ లాంటి సంస్థల ద్వారా హిందీని నేర్చుకుంటున్న బాలల సంఖ్య తక్కువేమీ కాదు. 1918లో స్థాపితమైన దక్షిణ భారత హిందీ ప్రచార సభ బోధిస్తున్న హిందీ భాషా కోర్సులలో ఇప్పటికీ ఏటా వేలాది విద్యార్థులు చేరుతున్నారు. ఆ సంస్థ నిర్వహిస్తున్న హిందీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులవుతున్నారు. 2022లో తమిళనాడులో 2,50,000 మంది విద్యార్థులు వివిధ స్థాయిలలో హిందీ పరీక్షలు రాశారు. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే హిందీ భాషా రాష్ట్రాల ప్రజలు ఉద్యోగాలు లేదా వ్యాపారాల రీత్యా దక్షిణాది రాష్ట్రాలకు వలస వస్తున్నారు. వీరు కుటుంబాలలో హిందీ, పని ప్రదేశాలలో ఇంగ్లీష్, బజార్‌లో తాము నేర్చుకున్న స్థానికభాష మాట్లాడుతుంటారు.


తమిళనాడులో హిందీ పట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టే వారని, హిందీ నేర్చుకుంటున్న వారిని పరిహసించేవారని లేదా అవమానపరిచేవారని ఆర్థిక మంత్రి వ్యక్తం చేసిన ఆవేదన నిరాధారమైనది. నాటి తమిళనాడులో గానీ, నేటి తమిళసమాజంలో గానీ హిందీని ద్వేషిస్తున్నారనేది సత్య దూరం. నిర్మల సీతారామన్ ప్రారంభించిన కొత్త యుద్ధరంగం చాలా నేర్పుగా పన్నిన వ్యూహంలో భాగమే. హిందీ భాష విషయమై సమస్యలు సృష్టించి, ప్రజల మధ్య అవి సృష్టించే విభజనలను స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడమే ఆ వ్యూహ లక్ష్యం. ఆ వ్యూహం అమలుకు అపార ఆర్థిక వనరుల తోడ్పాటు ఉన్నది. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులో తన ప్రభావాన్ని విస్తృతపరచుకునేందుకు, కర్ణాటక, తెలంగాణలో తన ఉనికిని పటిష్ఠం చేసుకునేందుకు బీజేపి తెగింపుతో వ్యవహరిస్తోంది. అసాధ్య ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలను చురుగ్గా ముందుకు తీసుకువెళ్లే కార్యభారాన్ని ఆర్థికమంత్రికి అప్పగించినట్లుగా కన్పిస్తోంది. లేదా, ఆమె స్వచ్ఛందంగానే ఆ బాధ్యతలను తన భుజాన వేసుకున్నారేమో?! భాషతో సహా ప్రజా జీవితపు వివిధ అంశాలపై వివాదాలు, ఆందోళనలు రెచ్చగొట్టడం ఆ ప్రయత్నాలలో ప్రధానమైనవి. బీజేపీ కార్యకర్తలు ఇప్పటికే ముస్లిం బృందాలతో వీథి పోరాటాలు చేస్తున్నారు. కలహశీలంగా వ్యవహరిస్తూ ఉద్రిక్తతలు సృష్టించేలా కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలోని బీజేపీ నాయకులను ప్రోత్సహిస్తున్నారు.


ఈ కొత్త యుద్ధరంగంలోకి ఆర్థికమంత్రి ఇష్టపూర్వకంగా ప్రవేశించారంటే నేనేమీ ఆశ్చర్యపోను. అంతకంతకూ పెరుగుతోన్న నిరుద్యోగిత, విజృంభిస్తోన్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న రూపాయి విలువ, అర్థరహిత వ్యాఖ్యలు (‘మేము ఉల్లిపాయలు తినం’), జీఎస్టీ, డీజిల్, పెట్రోల్ ధరలు, పన్ను ఆదాయాల పంపకంపై రాష్ట్ర ప్రభుత్వాలతో తరచు తగవుల ఫలితంగా ప్రజల గౌరవాదరాలను పొందడంలో ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ విఫలమయ్యారు. బహుశా, ఈ కారణంగానే వివాదాలను ఎదుర్కొనేందుకు సదా సంసిద్ధంగా ఉండే, లోక మర్యాదలకు భిన్నంగా పోయే రాజకీయవేత్తగా తనను తాను పునరావిష్కరించుకునేందుకు నిర్మల ప్రయత్నిస్తున్నారు. ఈ కొత్త అవతారంలో ఆర్థిక మంత్రి అభీష్టం నెరవేరాలని కోరుకుంటున్నాను. అయితే ప్రతి చోటా ఆత్మవిశ్వాసంతో, నిజాలను నిర్భయంగా మాట్లాడే ఒక కస్తూరిని ఆమె ఎదుర్కోవలసి ఉంటుందని నేను కచ్చితంగా చెప్పగలను.




Updated Date - 2022-10-01T07:41:15+05:30 IST