ద్రవ్యోల్బణం కన్నా యురేనస్, ప్లూటోలపైనే నిర్మల సీతారామన్‌కు ఆసక్తి : కాంగ్రెస్

ABN , First Publish Date - 2022-07-14T00:52:06+05:30 IST

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ (Nirmala Sitharaman)కు దేశ

ద్రవ్యోల్బణం కన్నా యురేనస్, ప్లూటోలపైనే నిర్మల సీతారామన్‌కు ఆసక్తి : కాంగ్రెస్

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ (Nirmala Sitharaman)కు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కన్నా యురేనస్, ప్లూటోలపైనే ఎక్కువ ఆసక్తి అని కాంగ్రెస్ మండిపడింది. నాసా వెబ్ టెలిస్కోప్ తీసిన చిత్రాలను ట్వీట్ చేయడంలో ఆమె తీరిక లేకుండా గడుపుతున్నారని ఆరోపించింది. ద్రవ్యోల్బణాన్ని ఎలా కట్టడి చేయాలనుకుంటున్నదీ ప్రజలకు వివరించడం లేదని పేర్కొంది. 


ద్రవ్యోల్బణం (Inflation) గణాంకాలను ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ (Gourav Vallabh) విలేకర్లతో మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఎటువంటి ప్రణాళికను రచించారో దేశ ప్రజలకు వివరించడం కన్నా నాసా (NASA) వెబ్ టెలిస్కోప్ తీసిన చిత్రాలను ట్వీట్ చేయడంలో తీరిక లేకుండా గడుపుతున్నారన్నారు. 


నాసా నూతన శక్తిమంతమైన స్పేస్ టెలిస్కోప్ తీసిన చిత్రాలను నిర్మల సీతారామన్ మంగళవారం రీట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని ప్రభుత్వం సమాజాన్ని ఓ వైపు కేంద్రీకృతమయ్యే విధంగా చేస్తోందని, అశాంతిని సృష్టిస్తోందని గౌరవ్ ఆరోపించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పతనమవుతున్న రూపాయి విలువలను పట్టించుకోవడం లేదన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నట్లు గణాంకాలు చెప్తుండటంతో ఆర్థిక మంత్రి ఓ మంచి ప్రణాళికను రచిస్తారని అందరూ భావించారన్నారు. కానీ ఆమెకు ప్రాధాన్యాతాంశాలు వేరే ఉన్నాయన్నారు. ఆమెకు ప్లూటో, యురేనస్, జూపిటర్‌లపై ఆసక్తి ఉందన్నారు. దురదృష్టవశాత్తూ, మన ఆర్థిక మంత్రి ప్లూటో (Pluto), యురేనస్ (Uranus), జూపిటర్లకు దారి చూపిస్తున్నారని, మన ఆర్థిక వ్యవస్థకు దారి చూపలేకపోతున్నారని అన్నారు. 


గడచిన ఎనిమిదేళ్ళలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ దృష్టి ఎక్కడ ఉందో స్పష్టంగా వెల్లడైందన్నారు. పోలరైజేషన్, అశాంతి ముందు వరుసలోకి వచ్చాయన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పతనమవుతున్న రూపాయి విలువ ఈ ప్రభుత్వ ఎజెండాలో లేవన్నారు. గడచిన 45 ఏళ్ళలో అత్యధిక నిరుద్యోగం ప్రస్తుతం దేశంలో ఉందన్నారు. 


రిటెయిల్ ద్రవ్యోల్బణం (Inflation) 7.01 శాతం ఉందని, నిరుద్యోగం (Unemployment) 7.8 శాతం పెరిగిందని, అమెరికా డాలర్‌తో పోల్చినపుడు రూపాయి విలువ 7.8 శాతం క్షీణించిందని చెప్పారు. ఈ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, బీజేపీ (BJP) నేతృత్వంలోని ప్రభుత్వం గాఢ నిద్రలో ఉందని ఆరోపించారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి, సామాన్య భారతీయులకు ఉపశమనం కల్పించడానికి ఈ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. 


Updated Date - 2022-07-14T00:52:06+05:30 IST