రైతులు, మహిళలు, పింఛనుదారులకు కేంద్రం బిగ్ రిలీఫ్

ABN , First Publish Date - 2020-03-26T19:51:26+05:30 IST

ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఆందోళన ఎదుర్కొంటున్న రైతులు, స్వయం సహాయక బృందాలకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. 8.69 కోట్ల మంది రైతులకు

రైతులు, మహిళలు, పింఛనుదారులకు కేంద్రం బిగ్ రిలీఫ్

న్యూఢిల్లీ: ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఆందోళన ఎదుర్కొంటున్న రైతులు, స్వయం సహాయక బృందాలకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. 8.69 కోట్ల మంది రైతులకు రూ.2 వేల చొప్పున ఇవ్వనున్నట్టు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా తక్షణమే ఈ సాయాన్ని విడుదల చేస్తామనీ... ఏప్రిల్ మొదటి వారంలో  రైతుల ఖాతాల్లోకి ఈ మొత్తం జమ అవుతుందని ఆమె తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.2 వేల చొప్పున ఒక్కో కార్మికుడికి వేతనం పెంచుతున్నట్టు పేర్కొన్నారు. దీని వల్ల 5 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, పించనుదారులకు రెండు విడతల్లో అదనంగా రూ. వెయ్యి చొప్పున చెల్లిస్తామన్నారు. మధ్యవర్తులతో సంబంధం లేకుండా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా మూడు నెలల్లో ఈ మొత్తం జమచేస్తామని నిర్మల వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా 3 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని ఆర్ధిక మంత్రి తెలిపారు.


జన్‌ధన్ ఖాతాలు కలిగిన 20 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.500 చొప్పున వచ్చే మూడు నెలల పాటు పరిహారం చెల్లించనున్నట్టు ప్రకటించారు. ఉజ్వల పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న దాదాపు 8.3 కోట్ల కుటుంబాలకు వచ్చే మూడు నెలల పాటు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించనున్నామన్నారు. తద్వారా వారికి వంటగ్యాస్ కొరత రాకుండా ఆదుకుంటామని నిర్మల తెలిపారు. స్వయం సహాయక బృందాలకు ప్రస్తుతం ఇస్తున్న రుణాలను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్టు తెలిపారు. దీని ద్వారా 7 కోట్ల కుటుంబాలు లబ్ది పొందుతాయన్నారు. 

Updated Date - 2020-03-26T19:51:26+05:30 IST