రుణ పునర్‌ వ్యవస్థీకరణను పరిశీలిస్తున్నాం..

ABN , First Publish Date - 2020-08-01T08:10:53+05:30 IST

కొవిడ్‌-19తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు రుణాల పునర్‌ వ్యవస్థీకరణ

రుణ పునర్‌ వ్యవస్థీకరణను పరిశీలిస్తున్నాం..

  • ఆర్‌బీఐతో ఇప్పటికే చర్చలు ప్రారంభించాం.. 
  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి 

న్యూఢిల్లీ: కొవిడ్‌-19తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు రుణాల పునర్‌ వ్యవస్థీకరణ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. రుణాల పునర్‌ వ్యవస్థీకరణ, మారటోరియానికి సంబంధించి ఇప్పటికే భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)తో ఆర్థిక మంత్రిత్వ శాఖ పనిచేయటమే కాకుండా చురుకుగా ఈ అంశాన్ని పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ఫిక్కీ జాతీయ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. రుణ పునర్‌ వ్యవస్థీకరణ అవసరమని సూత్రప్రాయంగా భావిస్తే దానిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతేకాకుండా హెల్త్‌కేర్‌ సహా ఇతర ఉత్పత్తులపై జీఎ్‌సటీ రేట్లను తగ్గించే అంశాన్ని జీఎ్‌సటీ కౌన్సిల్‌ పరిశీలిస్తుందని సీతారామన్‌ తెలిపారు. రుణాలపై మారటోరియం లేదా పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టాలంటూ హాస్పిటాలిటీ రంగం నుంచి డిమాండ్‌ వినిపిస్తున్న డిమాండ్‌పై ఆర్‌బీఐతో ఆర్థిక శాఖ విస్తృత స్థాయిలో చర్చిస్తోందన్నారు.


కొవిడ్‌ కారణంగా తీవ్ర ఇబ్బందుల్లోకి కూరుకుపోయిన హాస్పిటాలిటీ రంగం చేస్తున్న డిమాండ్లను తాను అర్ధం చేసుకోగలనని మంత్రి పేర్కొన్నారు. పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిశీలించటంతో పాటు ప్రభుత్వంలోని వివిధ స్టేక్‌ హోల్డర్లతో విస్తృతంగా చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు. రుణాల చెల్లింపుపై మూడు నెలల మారటోరియాన్ని మార్చి నెలలో ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మారటోరియం గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు.  

Updated Date - 2020-08-01T08:10:53+05:30 IST