Abn logo
Feb 21 2020 @ 01:51AM

గోడకు తలను బాదుకుని.. నిర్భయ దోషి వినయ్‌ నాటకం

  • తలకు, చేతికి గాయం.. మనో వైకల్యం!
  • తల్లిని గుర్తు పట్టడం లేదు: లాయర్‌
  • చికిత్సతర్వాత మెరుగైంది: అధికారులు
  • అతనికి పిచ్చి పట్టింది: న్యాయవాది
  • నివేదిక కోరిన ప్రత్యేక న్యాయస్థానం
  • గుజరాత్‌ దోషి ఉరి అమలు వాయిదా


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: నిర్భయ దోషుల ఉరితీత తేదీ దగ్గరపడుతున్న కొద్దీ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ జైలు గోడకు తలను పదే పదే బాదుకుని స్వల్పంగా గాయపడ్డాడు. జైలు గది ఊచలకు చేతిని ఇరికించుకుని విరగ్గొట్టుకునే ప్రయత్నం చేశాడు. భోజనం మానేసి అన్నీ విసిరేయడం మొదలెట్టాడు. 16వ తేదీన జరిగిన ఈ ఘటనలు ఆలస్యంగా బయటికి వచ్చాయి. సీసీటీవీల ద్వారా నిరంతరం గమనిస్తున్న అధికారులు- అతని ప్రవర్తన చూశాక వెంటనే తిహార్‌ జైలులో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కోలుకున్నాక- ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేయగా వెంటనే మళ్లీ జైలు గదిలో పడేశారు. ఉరి నుంచి తప్పించుకోడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో అతనిలో మానసిక వేదన ఎక్కువైందని, ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడని అతని తరఫు న్యాయవాది ప్రత్యేక కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.


‘వినయ్‌ శర్మ ప్రస్తుతం ఎవరినీ గుర్తుపట్టడం లేదు. ఆఖరికి తన తల్లిని కూడా! మనో వైకల్యం ఎక్కువైంది. స్కిజోఫెర్నియాతో బాధపడుతున్నాడు. వెర్రి చూపులు చూస్తూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. అతనికి మెరుగైన చికిత్స అవసరం. రెండ్రోజుల కిందట నేను స్వయంగా జైలు లోపలికి వెళ్లి అతని పరిస్థితి చూశాను. అతను సరిగా నిద్రపోవడం లేదని, అశాంతిగా ఉన్నాడని చెప్పారు. నన్ను కూడా గుర్తుపట్టడం లేదు.  చేతికి కట్టుతో, తలకు గాయంతో కనిపించాడు’’ అని అతని తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీంతో ప్రత్యేక కోర్టు జడ్జి ధర్మేంద్ర రాణా- వినయ్‌శర్మ ఆరోగ్య స్థితిపై నివేదిక ఇవ్వాలని జైలు అధికారులను కోరారు. 


కాగా- ఓ మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన ఓ వ్యక్తికి విధించిన ఉరిశిక్ష అమలును సుప్రీంకోర్టు నిలిపేసింది. గుజరాత్‌లోని సూరత్‌లో నిరుడు డిసెంబరులో ఈ ఘోరం చోటుచేసుకుంది. అనిల్‌ సురేంద్ర యాదవ్‌ అనే వ్యక్తిని పోక్సో చట్టం కింద దోషిగా తేల్చిన ట్రయల్‌ కోర్టు అతనికి ఉరి విధించడమే కాక- డెత్‌ వారెంట్‌ కూడా జారీ చేసింది. అయితే తనకు న్యాయపరమైన మార్గాలు పూర్తి కాకుండానే డెత్‌ వారెంటిచ్చారని పేర్కొంటూ అనిల్‌ యాదవ్‌ సుప్రీంకెక్కాడు. దీనిని పరిశీలించిన సీజే ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని బెంచ్‌- ఆ వాదనలో నిజముందని అంగీకరించింది. ‘అప్పీలుకు 60 రోజులు గడువుండగా 33 రోజుల్లోనే డెత్‌ వారెంట్‌ ఇచ్చారు. అతను సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోడానికి, క్షమాభిక్ష కోరడానికి అవకాశం కల్పించలేదు. అందుచేత డెత్‌ వారెంట్‌ అమలుపై స్టే ఇస్తున్నాం. అప్పీలు గడువు పూర్తి కాకుండా ట్రయల్‌ కోర్టులు ఇలా డెత్‌ వారెంట్లు ఇవ్వరాదు’’ అని బెంచ్‌ పేర్కొంది.

Advertisement
Advertisement
Advertisement