Nirav Modi అప్పగింత మరింత ఆలస్యం.. ‘అప్పగిస్తే ఆత్మహత్య’ యోచనలో నీరవ్?

ABN , First Publish Date - 2022-06-29T18:38:00+05:30 IST

భారత్‌కు బ్యాంక్ మోసం కేసులో పలాయనదారు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ(Nirav Modi) అప్పగింత మంగళవారం

Nirav Modi అప్పగింత మరింత ఆలస్యం.. ‘అప్పగిస్తే ఆత్మహత్య’ యోచనలో నీరవ్?

లండన్ : బ్యాంక్ మోసం కేసులో పలాయనదారు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ(Nirav Modi)ని  భారత్‌(India)కు అప్పగింత మంగళవారం మరోసారి వాయిదాపడింది. నీరవ్ తరపు న్యాయవాది కొత్త అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ దృష్ట్యా అప్పగింత ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. తనను భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకోవాలని నీరవ్ మోడీ యోచిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఒత్తిడిలో ఉన్నారని పిటిషన్‌లో న్యాయవాది పేర్కొన్నారు. నీరవ్‌ని భారత్‌(India)కు అప్పగించడమంటే అతడిని అణచివేయడమే అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్ మెరుగైన జైలు సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్నా ఆ హామీలను నమ్మలేమని లాయర్ సందేహాలు వెలిబుచ్చారు. దీంతో అత్యంత సంక్లిష్టమైన ఈ పిటిషన్‌ దృష్యా విచారణను అక్టోబర్‌కి వాయిదా వేస్తూ యూకే హైకోర్ట్ నిర్ణయించింది. 


ఈ మేరకు దిగువ స్థాయి కోర్ట్ అభిప్రాయాలను తోసిపుచ్చింది. ఆత్మహత్య ఆలోచనలను అధిగమించలేని సామర్థ్యం నీరవ్ మోడీకి లేకపోతే.. ఇతరులు అణచివేయడం ఎలా అవుతుందని దిగువస్థాయి కోర్ట్ న్యాయమూర్తి ఎడ్వర్డ్ ఫిట్జ్‌గెరాల్డ్ ఇటివలే విచారణ సందర్భంగా ప్రశ్నించారు. దీంతో ఉన్నతస్థాయి యూకే హైకోర్ట్‌లో నీరవ్ మోడీ తరపు లాయర్ అప్పీలు చేశాడు. తప్పుగా భావించారని దిగువ న్యాయస్థానం అభిప్రాయాలను హైకోర్ట్ తోసిపుచ్చింది. ఒత్తిడి పరిస్థితులు ఆత్మహత్యకు పురిగొల్పుతాయని, ఈ మేరకు పరిశీలన చేయాల్సి ఉందని తెలిపింది.


కాగా కేసు విచారణలో భాగంగా ఇరుపక్షాలూ మానసిక వైద్యనిపుణులను ఏర్పాటు చేసి నీరవ్ మోడీని పరిశీలించాల్సి ఉంటుంది. ఆ రిపోర్టును కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఎక్కువ సమయమే పడుతుంది. కాబట్టి అక్టోబర్ వరకు విచారణ వాయిదా వేసింది. కాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌(Punjab National Bank)ని పెద్ద మొత్తంలో మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ యూకే(UK)లో తలదాచుకుంటున్నాడు. మనీల్యాండరింగ్ చట్టాల కింద అతడిని భారతీయ న్యాయస్థానాల ముందు నిలబెట్టేందుకు జాతీయ దర్యాప్తు ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి. మోసానికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలను బయటపెట్టాయి. దీంతో నీరవ్ మోడీని భారత్‌కు అప్పగింతకు యూకే హోం సెక్రటరీ ప్రతి పటేల్ గతేడాది ఏప్రిల్ 15న నిర్ణయించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-06-29T18:38:00+05:30 IST