నిరసన సెగ

ABN , First Publish Date - 2021-06-15T05:47:48+05:30 IST

రాష్ట్రంలో ఇసుక కాంట్రాక్టు దక్కించుకున్న జయప్రకాష్‌ పవర్‌ సెక్యూర్స్‌(జె.పి) సంస్థ ప్రతినిధులకు నిరసన సెగ తగిలింది.

నిరసన సెగ
దోనేపూడి పాఠశాల ప్రహరీ, గేటును జేసీబీతో పడగొట్టేందుకు ప్రయత్నంచడంతో అడ్డుకుంటున్న స్థానికులు

పాఠశాల ఆటస్థలంలో ఇసుక డపింగ్‌కు జేపీ సంస్థ యత్నం

ప్రహరీ, గేట్ల పొక్లెయిన్‌తో కూల్చేందుకు సిద్ధం

ఎదురుతిరిగిన గ్రామ యువకులు

కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్‌లకు  ఫిర్యాదు


కొల్లూరు, జూన్‌ 14: రాష్ట్రంలో ఇసుక కాంట్రాక్టు దక్కించుకున్న జయప్రకాష్‌ పవర్‌ సెక్యూర్స్‌(జె.పి) సంస్థ ప్రతినిధులకు నిరసన సెగ తగిలింది. కొల్లూరు మండలం దోనేపూడిలోని 60 ఏళ్లనాటి జడ్పీ ఉన్నత పాఠశాల గ్రౌండ్‌లో ఇసుక డంప్‌చేసి తర్వాత అమ్ముకునే ప్రయత్నంలో భాగంగా ప్రహరీ, గేటును పొక్లెయిన్‌తో సోమవారం కూల్చే ప్రయత్నం చేశారు. ఆటస్థలంలో ఇసుక వ్యాపారమేంటంటూ స్థానిక యువకులు అడ్డుకున్నారు.  ఇంతలోనే పోలీస్‌ సైరన్‌ మోగించుకుంటూ జేపీ సంస్థ ప్రతినిధులు ఓ ప్రైవేటు ఇన్నోవా వాహనంలో వచ్చారు. యువకులను వీడియో తీస్తూ, పరుష పదజాలంతో దూషించటంతో పాటు బెదిరింపులకు దిగారు. స్థానిక ఎస్సీ కాలనీలోని పెద్దలు జోక్యం చేసుకుని తమపై దౌర్జన్యం చేస్తారేంటంటూ ఎదురుతిరిగారు. వల్లభాపురం నుంచి దోనేపూడి వరకు వందల మందిని తొక్కించుకుంటూ వచ్చామని, అడ్డు తప్పుకోకుంటే మీకూ అదే పరిస్థితి ఎదురవుతుందంటూ ప్రతినిధులు బెదిరింపులకు దిగారు. రూ.రెండున్నర కోట్లతో కట్టిన గోడను పగలగొడతామంటే ఎలా వదిలేస్తామని గ్రామస్తులు ప్రశ్నించడంతో కొద్దిసేపు హడావిడి చేసిన ఆ సంస్థ ప్రతినిధులు వీడియోలు తీసుకుని వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో యువకులు ఈ విషయాన్ని వీఆర్వో, తహసీల్దారు దృష్టికి తీసుకు వెళ్లారు. తమ క్రీడా మైదానంలో ఇసుక డంపింగ్‌ వద్దంటూ తహసీల్దారును కోరారు. ప్రైవేటు స్థలాలు లేకపోవటం వల్లే వారు గ్రౌండ్‌ను ఎంపిక చేసుకున్నారని తహసీల్దారు బదులివ్వటంతో యువకులు అవాక్కయ్యారు. తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో, జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం వినతిపత్రాలు అందించారు. ఆటస్థలం కోసం ఎంతవరకైనా వెళతామని గ్రామస్తులు స్పష్టంచేశారు.  

 

 

Updated Date - 2021-06-15T05:47:48+05:30 IST