నిప్పురాజేసిన పర్యటన

ABN , First Publish Date - 2022-08-04T06:44:10+05:30 IST

తైవాన్లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటించిన పక్షంలో అది అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తుందని కాస్తంత ప్రపంచజ్ఞానం...

నిప్పురాజేసిన పర్యటన

తైవాన్లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటించిన పక్షంలో అది అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తుందని కాస్తంత ప్రపంచజ్ఞానం ఉన్నవారెవ్వరైనా చెప్పగలరు. ఈ విషయం ఆమెకూ తెలియదనుకోలేం. అమెరికా పత్రికలే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రముఖ పత్రికలు, అసలే ప్రపంచం ఆర్థిక, యుద్ధ కష్టాల్లో ఉంటే, ఇప్పుడు నీ పర్యటనతో మరో చిచ్చు రేపడమెందుకంటూ సంపాదకీయాలు రాసి నిలువరించే ప్రయత్నాలు చేశాయి. అయినా, ఈ ఎనిమిదిపదుల మొండిఘటం వెనక్కు తగ్గలేదు. ఇప్పుడామె తైవాన్ పర్యటన ముగించుకొని దక్షిణకొరియా చేరుకున్నారు. కానీ, కొద్దిగంటలపాటు ఆమె తైపేలో గడిపిన ప్రభావం మాత్రం ఇప్పట్లో సమసిపోదు. 


నిప్పుతో ఆడుకుంటే, నిలువెల్లా తగలబడిపోతారు అని చైనా అధ్యక్షుడు ముందే చేసిన హెచ్చరికలకు తగినట్టుగానే, తైవాన్ లో నాన్సీ ఉండగానే చైనా గతంలో లేనంత తీవ్రస్థాయి యుద్ధవిన్యాసాలు చేసింది. తైవాన్ కు అతిసమీపంలోకి యుద్ధట్యాంకులు వచ్చాయి, గగనతలంమీద యుద్ధవిమానాలు క్షణం తీరికలేకుండా విన్యాసాలు చేశాయి, తైవాన్ సరిహద్దుల్లోకి అత్యాధునిక ఆయుధాలన్నీ పోగుబడ్డాయి. ఆమె పర్యటనకు ప్రతీకారంగా తైవాన్ నుంచి కొన్ని దిగుమతులను నిషేధించి, కొన్ని ఎగుమతులను కూడా నిలిపివేసింది. పెలోసీ వచ్చి తైవాన్ ను ఒంటరిగా వదిలేయబోమనీ, అమెరికా అండ ఉంటుందని నాలుగు ధైర్యవచనాలు చెప్పారు. తైవాన్ స్వేచ్ఛాసమాజాన్ని ప్రశంసించి, తియాన్మెన్ స్క్వేర్ నరమేధాన్ని పనిగట్టుకొని ప్రస్తావించి పర్యటన ముగించారు. నలుదిక్కులా తైవాన్ ను కమ్మేస్తూ, ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చునన్న రీతిలో యావత్ ప్రపంచాన్ని చైనా ఇంతగా భయపెట్టడానికి పెలోసీ చైనా బద్ధవ్యతిరేకి కావడం కూడా ఓ కారణం. చైనా విధానాలపైనా, మానవహక్కుల ఉల్లంఘనలపైనా తీవ్రంగా విరుచుకుపడే ఆమె అంటే డ్రాగన్‌కు ఆగ్రహం ఉండటం సహజం. పాతికేళ్ళ తరువాత, తైవాన్ లో కాలూనిన ఒక అత్యున్నతస్థాయి అమెరికా అధికారి ఆమే కావడంతో చైనా ఆగ్రహం నసాళానికి అంటింది. ఆమె పర్యటనతో ఒరిగేదేమీ ఉండకపోగా, పోయేది ఎక్కువేనన్న స్పృహ అమెరికా ప్రభుత్వానికి లేకపోలేదు. యాత్రను నిలువరించడానికి బైడెన్ తరఫున కీలకమైన వ్యక్తులు, భద్రతా సలహాదారులు గట్టిగా ప్రయత్నించారట. తన పార్టీకే చెందినప్పటికీ, స్పీకర్‌ను నియంత్రించగలిగే అధికారం అధ్యక్షుడికి లేకపోవడంతో పాటు, చివరకు నచ్చచెప్పడం కూడా సాధ్యపడలేదు. ఇంతలోగా చైనా బహిరంగ హెచ్చరికలు ఆరంభించడంతో, దానిని కొనసాగించడం కంటే రద్దుచేసుకోవడం వల్లనే తమకు రాజకీయంగా ఎక్కువ నష్టం జరుగుతుందని బైడెన్ ప్రభుత్వం అనుకొని ఉండవచ్చు. డెమోక్రాట్లకు జనామోదం పడిపోతున్నదని అమెరికాలో సర్వేలు చెబుతున్న విషయం తెలిసిందే.  మరోపక్క, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా మరో మూడునెలల్లో మూడోమారు దేశాధినేత కావడానికి దారులు పరిచే కీలకమైన పార్టీ విస్తృత సమావేశాలున్నందున ఇంత తీవ్రంగా ప్రతిస్పందించి ఉండవచ్చును. స్పీకర్ హోదాలో ఆమె జరుపుతున్న ఈ పర్యటనతో బైడెన్ ప్రభుత్వానికి సంబంధం లేదనీ, ఒకే చైనా విధానం విషయంలో ఆమెరికా వైఖరిలో వీసమెత్తు మార్పులేదని నచ్చచెప్పే ప్రయత్నాలు జరిగినా చైనా ఈ పర్యటనను తేలికగా తీసుకోలేదు. ఈ పర్యటన జరిగితే, మిగతాదేశాలన్నీ ఇకపై ధైర్యంగా తైవాన్ తో నేరుగా ఉన్నతస్థాయి సంబంధాలు నెరపే ధైర్యం చేస్తాయన్నది చైనా వాదన. అదే జరిగితే, స్వదేశంలో జిన్ పింగ్ గౌరవం కచ్చితంగా దెబ్బతింటుంది. ఉభయదేశాల పాలకులూ తమ రాజకీయ అవసరాలకోసం చేస్తున్న ఈ తరహా విన్యాసాలు యావత్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తైవాన్ కూడా పెద్దగా ప్రయోజనం లేని పెలోసీ పర్యటనను మనసారా స్వాగతించిందని అనుకోలేమనీ, బహుశా నిలువరించే ప్రయత్నం కూడా చేసి ఉండవచ్చునేమోనని కొందరి అనుమానం. ఈ పర్యటన తరువాత, తైవాన్ మరింత భద్రంగా ఉంటుందని కనీసం పెలోసీ కూడా గట్టిగా చెప్పలేరు. తీవ్ర ఉద్రిక్తతలు రేగిన స్థితిలో ఏ పొరపాటు జరిగినా, అది ఏకంగా ఓ పెనుయుద్ధానికే దారితీసి ఉండేది. ఒకపక్క, అమెరికా దానిమిత్రదేశాలు కలసి ఉక్రెయిన్ విషయంలో రష్యాతో పోరాడుతూంటే, పెలోసీ మొండిగా చైనాతో కూడా తనదేశం ప్రత్యక్షఘర్షణకు దిగాల్సివచ్చే వాతావరణం కల్పించడం విచిత్రం. మొత్తానికి ఈ చైనా విరోధి చేజేతులా మరోమారు దేశాధినేత కావాలనుకుంటున్న చైనా అధ్యక్షుడికి తన చప్పన్నారు ఇంచీల ఛాతీని ప్రదర్శించేందుకు మంచి అవకాశమైతే ఇచ్చింది.

Updated Date - 2022-08-04T06:44:10+05:30 IST