నిను కన్నది కానుపు...

ABN , First Publish Date - 2020-05-18T10:02:26+05:30 IST

తొంగి తేలే నా వ్యామోహ బింబం వంగిన కొమ్మలు రాల్చిన ఒంటరి పూలు సగం మునిగిన బెండుదంట్లు జాడ దొరకని పిచ్చిబంతి కత్తిరించిన నీలాకాశం...

నిను కన్నది కానుపు...

తొంగి తేలే నా వ్యామోహ బింబం

వంగిన కొమ్మలు రాల్చిన ఒంటరి పూలు

సగం మునిగిన బెండుదంట్లు

జాడ దొరకని పిచ్చిబంతి

కత్తిరించిన నీలాకాశం

రశ్మిరజ్జుని ఒడిసిన రంగురంగుల నూనెజిడ్డు 

     ....దిగులు మెట్టు విరిగిపడి, విరగబడ్డ నీటిడొంకకి దిగుడు బావి 


చెదిరింది!   

***

పాదాల మూలం తెలియని తెంపులేని పాయ

కదిలి వచ్చిన సురగంగ సుమాళ ఛాయ

కనిపించే గులకరాళ్ల గుసగుస

వినిపించే పిల్ల చేపల గునగున

దరువు కొండల సెలపాట రణగొణ

మెత్తగించిన మైదానాలకి ఇసకమేటల దీవెన

     ...ఒడ్డున ఒరిగిన ఓటి పడవ పొంచుడు పోటుకి జరిగింది!

                                 ***

పొడవు కాలాల పాటి గుంపుల గుత్తి కానుగు

మూగిన గుబాళింపుల సాటి గుబురు పనస

వాన తీగల పోటీ బెదరు బదనిక పదనిస 

ఎలదేటి రెక్కతో ఎగిరొచ్చే ఎంగిలి పుప్పొడి 

నాటని విత్తుల నవ్వులు రువ్వే గరగరిక పువ్వు

పరువాల పచ్చ పత్రహరిత కణాలతో కాంతి రతి

     ...ఆకుపచ్చని అడవి రాగం ఆకురాలు అరిష్టానికి ఆగింది!

                                 ***

దిగంతాల చీకట్లు కాల్చిన కాంతి దీపం

కలువ దూరాలు కాంచని చంద్ర తాపం

పాలముంతలు పగిలి పారిన తీపి ప్రదాహం

తోకచుక్క తొందర్లకి... వేగుచుక్క వెంపర్లకి వెల్తురు తెర 

పదారు నీడల చెర పక్కకు జారిన కళకళ

వంద యుగాల వలపుమొక్కుల వరదగుడి 

     ...రాకాచంద్రుడి రేతస్సుని రాకాసి రాహువు మింగింది!   

                                 ***

శతాబ్దాల శబ్దం... విడిన ‘వాగార్థాల’ మూగ వాదం 

గాలి మోసిన పాట... రంగు పోల్చని రసోద్రేకం

భాష నేర్వని భావం... మోకులు తెగిన మదగజం 

మహాప్రాణాలు దించిన శిలువకి ఆధునికోత్తర అక్షరం

వరసలు పేర్చిన వాక్యాల మధ్య వ్యాకరణమంత శూన్యం

అచ్చులు హల్లులూ తుడిచేసి, హంసపాదులతో ఆదికావ్యం  

     ...గుట్టుమట్టు ఎరగని గుండె దీగూట్లో కవిత్వం ఆరిపోయింది! 

                                 ***

ఇంకిపోయిన నూతి నీరు

నా పొరల్లోకి

ఊరిందని ఊహించలేదు


ఎండ రెక్కలొచ్చిన ఏరు

నా మబ్బుకి

ఎగిరొచ్చిందని ఎరగనేలేదు


శిశిరాల మోడైన వనం

నా చైత్రాన 

చిగురించిందని చిత్తగించలేదు

గ్రహణాలు మూసిన వెన్నెల

నా లోగిలిలో

అందగించిందని అర్థంకాలేదు

కలలోకి కరిగిన కవిత్వం

నా కడుపున

పుట్టిందని పోల్చుకోలేదు 

(నా చిన్నతల్లి ప్రహర్షకి పుట్టినరోజు కానుకగా)

నరేష్‌ నున్నా

Updated Date - 2020-05-18T10:02:26+05:30 IST