నాగపూర్ ఆర్ఎస్ఎస్ క్వార్టర్సులో 9మంది సీనియర్ సభ్యులకు కరోనా

ABN , First Publish Date - 2020-09-19T16:49:25+05:30 IST

నాగపూర్ నగరంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ హెడ్ క్వార్టర్సులో 9 మంది సీనియర్ స్వయంసేవకులకు కరోనా వైరస్ సోకడం కలకలం రేపింది....

నాగపూర్ ఆర్ఎస్ఎస్ క్వార్టర్సులో 9మంది సీనియర్ సభ్యులకు కరోనా

నాగపూర్ (మహారాష్ట్ర): నాగపూర్ నగరంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ హెడ్ క్వార్టర్సులో 9 మంది సీనియర్ స్వయంసేవకులకు కరోనా వైరస్ సోకడం కలకలం రేపింది. మహారాష్ట్రలోని నాగపూర్ సెంట్రల్ నగరంలోని మహల్ ప్రాంతంలో ఉన్న ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో 60 ఏళ్ల వయసు పైబడిన 9 మంది ఫుల్ టైం సీనియర్ స్వయంసేవకులకు కరోనా సోకడంతో వారిని చికిత్స కోసం నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కరోనా సోకిన వారందరూ అధిక రక్తపోటు, మధుమేహం బాధితులని ఆర్ఎస్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కరోనా సోకిన స్వయంసేవకులు ఆసుపత్రిలో కోలుకుంటున్నారని సీనియర్ స్వయంసేవక్ చెప్పారు. 


నాగపూర్ జిల్లాకు చెందిన మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్ కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని మంత్రి నితిన్ రౌత్ తన అనుచరులకు ట్వీట్ ద్వారా తెలిపారు. తనతో కలిసిన అనుచరులు ముందుజాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి ట్వీట్ లో కోరారు. మంత్రి భార్య సుమేధకు కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నాగపూర్ నగరానికి చెందిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కూడా గతంలో కరోనా సోకింది. కరోనా వ్యాప్తితో నాగపూర్ నగరంలో శని, ఆదివారాల్లో జనతా కర్ఫ్యూను విధిస్తూ నగర మేయరు సందీప్ జోషి ఆదేశాలు జారీ చేశారు. 


నాగపూర్ హెడ్ క్వార్టర్సులోని భవనంలో నివశించే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషీలు ఇతర నగరాల్లో పర్యటనల్లో ఉండటంతో వారికి 9 మంది స్వయంసేవకులకు కరోనా సోకిన సమాచారం అందించారు. కరోనా సోకిన స్వయంసేవకులకు అసింప్టమాటిక్ అని సీనియర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త చెప్పారు. ఈ ఘటనతో నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ భవనాలు, గదులను శానిటైజ్ చేయించారు. 

Updated Date - 2020-09-19T16:49:25+05:30 IST