19 నెలలు నరకం.. Kuwait యజమాని వద్ద పనిచేసేందుకు ఆ తొమ్మిది మంది భారతీయులు వెళ్తే..

ABN , First Publish Date - 2021-08-28T20:20:13+05:30 IST

పొరపాటున పక్కదేశం ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన తొమ్మిది మంది భారతీయ మత్స్యకారులు ఏకంగా 19 నెలలు ఇరాన్ జైలులో నరకం అనుభవించారు. చివరకు అక్కడి భారత కాన్సులేట్ అధికారుల చొరవతో ఇటీవల విడుదలయ్యారు.

19 నెలలు నరకం.. Kuwait యజమాని వద్ద పనిచేసేందుకు ఆ తొమ్మిది మంది భారతీయులు వెళ్తే..

కన్యాకుమారి: పొరపాటున పక్కదేశం ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన తొమ్మిది మంది భారతీయ మత్స్యకారులు ఏకంగా 19 నెలలు ఇరాన్ జైలులో నరకం అనుభవించారు. చివరకు అక్కడి భారత కాన్సులేట్ అధికారుల చొరవతో ఇటీవల విడుదలయ్యారు. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌లో ఉన్న ఇండియన్ కాన్సులేట్.. అంతర్జాతీయ మత్స్యకారుల అభివృద్ధి ట్రస్ట్ అధ్యక్షుడు పి జస్టిన్ ఆంటోనీకి భారతీయ మత్స్యకారుల విడుదల విషయమై ఈ-మెయిల్ ద్వారా లేఖ రాసింది. ప్రస్తుతం భారతీయ మత్స్యకారుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదితో పాటు కాన్సులేట్ అధికారులు వీరిని స్వదేశానికి తరలించే ఏర్పాటులో ఉన్నారు. 


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారికి చెందిన ఆల్బర్ట్ రవి(38), గాడ్విన్ జాన్ వెల్డన్(40), ఆరోకియా లిగిన్(24), జోసెఫ్ బెస్కీ(50), జేసుదాస్(27), డేనాస్(40), సహాయ విజయ్(22), మైఖేల్ అదిమై(45), వెల్లింగ్టన్(36) అనే తొమ్మిది మంది భారతీయ మత్స్యకారులు కువైత్‌లోని ఓ యజమాని వద్ద చేపల వేట పనికి కుదిరారు. ఈ క్రమంలో 2020, జనవరి 15న కువైత్‌లోని ఫహహీల్ నుంచి మూడు బోట్లలో చేపల వేటకు వెళ్లారు. రెండు రోజుల తర్వాత ఇరాన్ అధికారులు ఈ తొమ్మిది మందిని తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించినందుకు అదుపులోకి తీసుకున్నారు.


అనంతరం వారిని బషెర్ జైలుకు తరలించారు. ఇరాన్ జైలులోబందీగా ఉన్న భారత మత్స్యకారులను కువైత్ యజమాని విడిపించేందుకు ముందుకురాలేదు. దాంతో స్వదేశంలోని కుటుంబ సభ్యులు వారిని విడిపించేందుకు ప్రయత్నించారు. దీనిలో భాగంగా అక్కడి ఓ న్యాయవాదికి ఒక్కొ కుటుంబం రూ.90వేల చొప్పున మొత్తం రూ.8.1లక్షలు చెల్లించాయి. కానీ, ఆ న్యాయవాది డబ్బులు తీసుకుని మోసం చేయడంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.  


అనంతరం ఓ సామాజిక కార్యకర్త సాయంతో వారు భారత ప్రధాని, హోంశాఖ మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ, మత్స్య శాఖలోని అధికారుల వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. ఇలా 14 నెలలు గడిపోయాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మత్స్యకారుల అభివృద్ధి ట్రస్ట్ అధ్యక్షుడు పి జస్టిన్ ఆంటోనీ ఈ ఏడాది మార్చిలో ఎన్నికల ప్రచారం కోసం కన్యకుమారికి వచ్చిన హోంమంత్రి అమిత్ షా వద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దాంతో ఆయన ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌లో ఉన్న ఇండియన్ కాన్సులేట్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తెలియజేసి.. మత్స్యకారుల విడుదలకు సహకరించాలని కోరారు.


అమిత్ షా ఆదేశాలతో కాన్సులేట్ అధికారులు మత్స్యకారుల విడుదల కోసం ప్రయత్నించారు. వారి ప్రయత్నాలు ఫలించడంతో శుక్రవారం భారత మత్స్సకారులు బషెర్ జైలు నుంచి విడుదలయ్యారు. దాంతో ఆదివారం తొమ్మిది మందిని బందర్ అబ్బాస్‌లోని ఇండియన్ కాన్సులేట్‌కు తరలించారు.  ప్రస్తుతం భారతీయ మత్స్యకారుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదితో పాటు కాన్సులేట్ అధికారులు వీరిని స్వదేశానికి తరలించే ఏర్పాటులో ఉన్నారు. త్వరలోనే వీరు భారత్‌కు రానున్నారు.   

Updated Date - 2021-08-28T20:20:13+05:30 IST