Abn logo
Sep 27 2021 @ 00:55AM

పెద్దిరెడ్డి వద్దకు నిండ్ర ‘పంచాయితీ’

మంత్రి పెద్దిరెడ్డికి ఫిర్యాదు చేస్తున్న రోజా

నిండ్ర ఎంపీపీ ఎన్నికల వివాదం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్దకు చేరింది. ఎంపీపీ, కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక సందర్భంగా శుక్ర, శనివారాల్లో తలెత్తిన పరిణామాలపై ఎమ్మెల్యే రోజా, శ్రీశైలం దేవస్థానం చైర్మన్‌ చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యర్థి వర్గం ఆదివారం తిరుపతిలో మంత్రిని కలిసి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. 

మంత్రితో చక్రపాణిరెడ్డి వర్గం

విప్‌ ధిక్కరించిన వారిని సస్పెండ్‌ చేయండి


ఫ మంత్రి పెద్దిరెడ్డికి విన్నవించిన ఎమ్మెల్యే రోజా


పుత్తూరు, సెప్టెంబరు 26: ‘పార్టీ ఆదేశాల మేరకు సమన్యాయం పాటిస్తూ ఐదు మండలాలలో  ఎంపీపీ అభ్యర్థులను ఎంపిక చేశాం. నిండ్రలో పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా విప్‌ను ధిక్కరించి, పోటీగా అభ్యర్థులను నిలిపారు. ఇలా చేయడమంటే ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ధిక్కరించినట్లే. ఈ ఘటనకు బాధ్యులైన చక్రపాణిరెడ్డి, ఆయన సోదరుడు భాస్కరరెడ్డితో పాటు మరో 11 మంది నాయకులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి’ అని నగరి ఎమ్మెల్యే రోజా కోరారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆమె మంత్రిని కలిశారు. ఇలాంటి చర్యలను ఉపేక్షిస్తే మిగిలిన నాయకులు, కార్యకర్తలు వారి మార్గంలో నడిచి క్రమశిక్షణను ఉల్లంఘించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక సమయంలోను, ఎంపీపీ ఎన్నికలకు సహకరించకుండా రోడ్డు మీద ధర్నాకు దిగి ప్రభుత్వాన్ని, అధికారులను, తనను దూషించారన్నారు. మంత్రిని, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని కలిసిన వారిలో రోజాతో పాటు పుత్తూరు మున్సిపల్‌ చైర్మన్‌ హరి, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మాహీన్‌, నిండ్ర నేత శ్యామ్‌లాల్‌, కోఅప్షన్‌ సభ్యుడు అనిల్‌, రవీంద్ర పాల్గొన్నారు. 

సస్పెండ్‌ చేస్తామని బెదిరిస్తోంది 


ఎమ్మెల్యేపై మంత్రికి చక్రపాణి రెడ్డి వర్గం ఫిర్యాదు


పుత్తూరు, సెప్టెంబరు 26: ‘నిండ్ర మండలంలో గెలిచిన ఎంపీటీసీలను సస్పెండు చేస్తామని ఎమ్మెల్యే రోజా బెదిరిస్తోంది. పార్టీ నుంచి మమ్మల్ని సస్పెండ్‌ చేయడానికి ఎమ్మెల్యే ఎవరు? మేము ఆమెను గెలిపిస్తే మాపైనే అజమాయిషీ చేస్తూ చులకనగా చూస్తోంది’ అంటూ నిండ్ర పరిణామాలపై  శ్రీశైలం దేవస్థానం చైర్మన్‌ చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలోని ప్రత్యర్థి వర్గం ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేసింది. తమ వర్గంలో మెజారిటీ ఉన్నందున తమ వర్గానికి చెందిన భాస్కరరెడ్డినే మండలాధ్యక్షుడిని చేయాలని కోరారు. నియోజక వర్గంలో పార్టీకి చెడ్డ పేరు ఎవరి వల్ల వస్తుందో ప్రజలకు తెలుసన్నారు. మంత్రిని కలిసిన వారిలో భాస్కరరెడ్డితో పాటు ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు, నాయకులు మనోహర్‌నాయుడు, మురళినాయుడు, దశరథనాయుడు, శివయ్య, సర్పంచులు ఉన్నారు.