ఆస్తులను కాపాడుకోవడానికే జగన్ డ్రామాలు: నిమ్మల

ABN , First Publish Date - 2021-07-01T21:56:40+05:30 IST

ప్రజలపై దయాదాక్షిణ్యం లేకుండా సీఎం జగన్ ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.

ఆస్తులను కాపాడుకోవడానికే జగన్ డ్రామాలు: నిమ్మల

అమరావతి: ప్రజలపై దయాదాక్షిణ్యం లేకుండా సీఎం జగన్ ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులను ఆదుకుంటానని చెప్పి, నేడు వారిని వరదల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు రూ.3,200కోట్లు చెల్లించాల్సి ఉండగా, మొక్కుబడిగా రూ.550కోట్లు ఇస్తున్నట్లు, నిన్న అర్థరాత్రి జీవోఇచ్చారన్నారు. ఆదీవాసీలు, నిర్వాసితులు కొండలు,గుట్టలపైకెక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతుంటే, ఈ ముఖ్యమంత్రి తనకేమీ పట్టనట్టుగా ఉన్నాడన్నారు. 18 వేలనిర్వాసితుల కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ న్యాయం చేయకుంటే, టీడీపీ వారి పక్షాన ప్రభుత్వంపై పోరాడుతుందని నిమ్మల రామానాయుడు చెప్పారు. 


 ఆస్తులను కాపాడుకోవడానికే సీఎం జగన్ డ్రామాలు ఆడుతున్నారని నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నప్పుడు ప్రతిపక్షంలోఉన్న జగన్ దొంగదీక్షలు చేశారన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక తనే స్వయంగా వెళ్లి, కాళేశ్వరాన్ని ప్రారంభించి కొబ్బరికాయలు కొట్టారన్నారు. జగన్ ఆస్తులను కాపాడుకోవడానికి రాయలసీమ, డెల్టా రైతులనోట్లో మట్టికొట్టడానికి సిద్ధమయ్యారన్నారు.  సీఎం కేసీఆర్ విద్యుదుత్పత్తి పేరుతో కృష్ణా జలాలను తోడేస్తుంటే, ఈ ముఖ్యమంత్రి లేఖలతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్రానికి నీరులేకుండా చేసి,  జగన్ ఏపీ ప్రజల దృష్టిలో శత్రువుగా మారబోతున్నారన్నారు.  తెలంగాణ నుంచి ఏపీ భూభాగంలోకి కృష్ణాజలాలు వస్తాయని గతంలో కూడా బీరాలుపలికారన్నారు. ఆనాడే  మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు మన భూభాగంలో మనసొమ్ముతో మనమే ప్రాజెక్టులు కట్టుకోవాలని చెబితే, ఆయన్ని హేళనచేశారని చెప్పారు.  సీఎం జగన్ ఇప్పుడేమో ఏపీ నీటిని తెలంగాణ పరం చేసి, తెలంగాణలోని ఆంధ్రుల గురించి ఆలోచిస్తున్నానంటూ వక్ర భాష్యాలు చెబుతున్నారని నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. 

Updated Date - 2021-07-01T21:56:40+05:30 IST