నీళ్లున్నా.. చేప పిల్లలు కరువు

ABN , First Publish Date - 2022-01-28T06:08:00+05:30 IST

మత్స్యకారులకు ప్రతి ఏటా చేప పిల్లలను ఉచితంగా సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అరకొరగా మాత్రమే చేప పిల్లలను పంపిణీ చేయడంతో మత్స్యకారులపై తీరని భారం పడుతున్నది.

నీళ్లున్నా.. చేప పిల్లలు కరువు

- సగానికిపైగా చెరువుల్లో చేపలు లేవు

- ఉచితంగా సరఫరా చేయని ప్రభుత్వం

- బ్యారేజీలు, 12 రిజర్వాయర్లు, చిన్న చెరువులకే సరఫరా

- మత్స్యకారులపై తీరని భారం


 (ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మత్స్యకారులకు ప్రతి ఏటా చేప పిల్లలను ఉచితంగా సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అరకొరగా మాత్రమే చేప పిల్లలను పంపిణీ చేయడంతో మత్స్యకారులపై తీరని భారం పడుతున్నది. జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, బ్యారేజీల్లో పుష్కలంగా నీళ్లున్నప్పటికీ అందులో పెంచేందుకు చేప పిల్లలు కరువయ్యాయి. ప్రతి ఏటా ఉచితంగా చేప పిల్లలను సరఫరా చేసే ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేనికారణంగా మత్స్యకారులు నష్టపోవాల్సి వస్తున్నది. సగానికి పైగా చెరువులు, కుంటల్లో చేప పిల్లలను పోయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది. జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలతో పాటు 1072 చెరువులు, కుంటలున్నాయి. వీటిలో ప్రతి ఏటా ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పోస్తున్నది. గడిచిన వర్షాకాలంలో సుమారు కోటి 57 లక్షల చేప పిల్లలు పోయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు గానూ గత మే నెలలో ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. పలువురు  కాంట్రాక్టర్లు చేప పిల్లలను సరఫరా చేసేందుకు టెండర్లు వేశారు. ప్రతి ఏటా ఎలాంటి చేపల చెరువులు, ఫారమ్‌లు లేనటువంటి వాళ్లు టెండర్లు వేసి నాసిరకం చేప పిల్లలను సరఫరా చేస్తున్నారని, కొన్ని చెరువులు, కుంటల్లో చేప పిల్లలను పోయకున్నా పోసినట్లు, తక్కువ మొత్తంలో చేప పిల్లలను పోసి ఎక్కువగా పోసినట్లు రికార్డుల్లో పేర్కొంటున్నారనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వం టెండర్లను రద్దు చేసింది. పలు జిల్లాలకు ప్రభుత్వమే నేరుగా సొంత చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి చేసిన చేప పిల్లలతో పాటు బయట కొనుగోలు చేసి తీసుకువచ్చిన పిల్లలను సరఫరా చేస్తున్నారు. 

- చేప పిల్లల విడుదల ఇలా..

అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాకు ఆలస్యంగా నవంబరు, డిసెంబరు మాసాల్లో చేప పిల్లలను సరఫరా చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజీలో 12.21 లక్షలు, సుందిళ్ల బ్యారేజీలో 11.41 లక్షలు, అన్నారం బ్యారేజీలో 8.79 లక్షలు, ఎల్లమ్మ, గుండమ్మ చెరువులో 86,664, అప్పన్నపేట చెరువులో 81 వేలు, నంది మేడారం పెద్ద చెరువులో 6,09,148, కమాన్‌పూర్‌ మండలం గుండారం చెరువులో 1,81,240, పారుపెల్లి పెద్ద చెరువులో 2,60,580, యాతల చెరువులో 90,078 సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి పెద్ద చెరువులో 3,33,160, సుల్తానాబాద్‌ చెరువులో 1,27,878, తేలుకుంట రామప్ప చెరువులో 69,900, పెద్దాపూర్‌ పెద్దచెరువులో 2,91,000, ఈసాల తక్కళ్లపల్లి పెద్ద చెరువులో 1,71,000, కుక్కలగూడూరు బండలవాగు ప్రాజెక్టులో 1,37,460 చేప పిల్లలను పోశామని, అలాగే 372 చిన్న చెరువుల్లో చిన్న సైజువి 33 లక్షల చేప పిల్లలను పోశామని జిల్లా మత్స్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ తక్కువ సంఖ్యలోనే చేప పిల్లలను పోసినట్లుగా తెలుస్తున్నది. మిగతా చెరువులకు ప్రభుత్వం చేప పిల్లలను సరఫరా చేయక పోవడంతో మత్స్యకారులే ఆలస్యంగానైనా చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లో పోశారు. వాస్తవానికి జూన్‌, జూలై మాసాల్లోనే చెరువుల్లో చేప పిల్లలు పోస్తే మార్చి, ఏప్రిల్‌ నాటికి కిలో నుంచి 2 కిలోల సైజు వరకు చేపలు ఎదగడం వల్ల మత్స్యకారులకు మంచి లాభాలు వస్తాయి. గత వర్షాకాలంలో ప్రభుత్వమే సరఫరా చేస్తారని భావించిన మత్స్యకారులు ఎదురు చూస్తూ వచ్చారు. చివరకు నవంబరు, డిసెంబరు మాసాల్లో సొంతంగా కొనుగోలుచేసి చేపపిల్లలను వేసినట్లుగా మత్స్యకారులు చెబుతున్నారు. ఆలస్యంగా పోసిన చేప పిల్లలు ఎదగాలంటే సెప్టెంబరు రావాల్సి ఉంటుందని అంటున్నారు. చేపపిల్లల పంపిణీ విషయంలో ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రణాళికలను రూపొందించక పోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2022-01-28T06:08:00+05:30 IST