ఇటాలియన్ తేనెటీగల పెంపకం... ఏటా 7 లక్షల ఆదాయం!

ABN , First Publish Date - 2021-01-10T17:06:57+05:30 IST

ఇటీవలి కాలంలో యువత ఉద్యోగం చేయడంకన్నా వ్యాపారం చేయడమే ఉత్తమమని భావిస్తోంది. గుజరాత్‌లోని...

ఇటాలియన్ తేనెటీగల పెంపకం... ఏటా 7 లక్షల ఆదాయం!

రాజ్‌కోట్: ఇటీవలి కాలంలో యువత ఉద్యోగం చేయడంకన్నా వ్యాపారం చేయడమే ఉత్తమమని భావిస్తోంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్ కు చెందిన నీలేష్ గోహిల్ తన అభిరుచికి తగిన ఉపాధి మార్గాన్ని ఎంచుకుని విజయాన్ని సాధించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత నీలేష్ తేనెటీగల పెంపకాన్ని చేపట్టాలని భావించాడు. ఇందుకోసం 50 ఇటాలియన్ తేనెటీగల పెట్టెలను ఏర్పాటుచేసి, తేనె తయారు చేయడం ప్రారంభించారు.  ఈ తేనెకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఏడాది వ్యవధిలోనే 200 తేనెటీగల పెట్టెలను ఏర్పాటుచేసి, మరింతగా తేనెను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. దీంతో ఒక్క ఏడాదిలోనే ఏడు లక్షల రూపాయలకు మించిన ఆదాయాన్ని నీలేష్ అందుకున్నారు.


ఈ సందర్భంగా 23 ఏళ్ల నీలేష్ మాట్లాడుతూ తాను తేనెటీగల పెంపకంపై ఆరు నెలల పాటు శిక్షణ పొందానని, 2019లో దీనిని ప్రారంభించానని తెలిపారు. మొదట్లో తన వ్యాపారం గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేసేవాడినని, ఈ విధంగా చాలామందికి తెలియడంతో తాను తయారు చేస్తున్న తేనెకు మరింత డిమాండ్ పెరిగిందన్నారు. ప్రస్తుతం తాను ఏడాదికి 1,800 కిలోల తేనెను తయారు చేస్తున్నానని, దీనిని హోల్‌సేల్‌లో విక్రయిస్తుంటానని తెలిపారు. ఇటాలియన్ తేనెటీగల పెంపకం ద్వారా తేనెను అధికంగా ఉత్పత్తి చేయవచ్చని, నెలకు 150 కిలోల తేనెను ఉత్పత్తి చేసే అవకాశాలుంటాయన్నారు. తేనెటీగల పెంపకానికి తగిన స్థలం ఎంపిక చేసుకోవడం ఎంతో ముఖ్యమని, పూలతోటలు విరివిగా ఉన్న ప్రాంతంలో తేనెటీగల పెంపకాన్ని చేపట్టాలన్నారు. ఇందుకోసం తాను వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తుంటానని, ముఖ్యంగా రాజస్థాన్ వెళుతుంటానని తెలిపారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్, జైపూర్, కోటా తదితర ప్రాంతాల్లో పూల తోటలు అధికంగా ఉంటాయన్నారు. తేనె రూపొందే విధానం గురించి నీలేష్ వివరిస్తూ... ముందుగా తేనెటీగలు పూల నుంచి రసాన్ని సేకరిస్తాయని, తరువాత అవి ఆ రసాన్ని మైనంతో రూపొందించిన పెట్టెలలో నింపుతాయని తెలిపారు. ఈ పెట్టెలలో మొదట్లో తడి చేరుతుందని, అయితే ఆ తేనెటీగలు తమ రెక్కల సాయంతో ఆ తడిని వేరుచేస్తాయన్నారు. ఈ తేనె గూళ్లలో తేనె తయారీ ప్రక్రియకు ఏడు నుంచి ఎనిమిది రోజులు పడుతుందని, తరువాత శుద్ధమైన తేనె తయారవుతుందని అన్నారు. ఐదు తేనె టీగల పెట్టెలకు సుమారు రూ. 20 వేలు ఖర్చవుతుందని, ఒక పెట్టెలో నెలకు ఐదు కిలోల తనెను ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. 

Updated Date - 2021-01-10T17:06:57+05:30 IST