పదేళ్ల శ్రమకు ఫలితం

ABN , First Publish Date - 2022-05-21T09:53:03+05:30 IST

అథ్లెట్‌గా మొదలైన ఆమె క్రీడా ప్రస్థానం బాక్సింగ్‌కు మళ్లి ఏకంగా వరల్డ్‌ చాంపియన్‌గా ఎదిగే స్థాయికి చేరింది..

పదేళ్ల  శ్రమకు ఫలితం

పసిడి పతకంతో మరింత బాధ్యత

ఒలింపిక్‌ మెడల్‌ సాధిస్తా

వరల్డ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌

అథ్లెట్‌గా మొదలైన ఆమె క్రీడా ప్రస్థానం బాక్సింగ్‌కు మళ్లి ఏకంగా వరల్డ్‌ చాంపియన్‌గా ఎదిగే స్థాయికి చేరింది..ఈక్రమంలో ఆమె ఎదుర్కొన్న అవమానాలు ఎన్నెన్నో? కానీ తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకొనేందుకు వాటన్నింటినీ భరించింది..పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఆ క్రీడాకారిణి మన తెలుగు బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌..విశ్వవిజేతగా నిలిచిన ఆమెతో ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూ..

వరల్డ్‌ చాంపియన్‌ ట్యాగ్‌ ఎలా ఉంది?

అమ్మానాన్నల ఆశయం, నా పదేళ్ల కష్టం, నిరీక్షణకు ఈ టైటిలే నిదర్శనం. నన్ను చిన్నచూపు చూసిన వారికి ఈ పతకమే సమాధానం. నిఖత్‌ జరీన్‌ అనే పేరు ముందు వరల్డ్‌ చాంపియన్‌ ట్యాగ్‌ చేరడం గర్వంగా ఉంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కఠోరంగా శ్రమించా. ఈ ప్రయాణంలో  కేంద్ర ప్రభుత్వం నెలనెలా అందిస్తున్న ఆర్థిక సాయం, కోచ్‌లు భాస్కర్‌, చిరంజీవి సార్‌, ‘సాయ్‌’ అందించిన సహకారం వెలకట్టలేనిది. ఈ పతకం బాధ్యతను మరింత పెంచింది. త్వరలో జరిగే కామన్వెల్త్‌ క్రీడలే నా తదుపరి టార్గెట్‌. అలాగే వచ్చే ఒలింపిక్స్‌లో దేశానికి కచ్చితంగా పతకం అందిస్తా.


ఈ టోర్నీలో విఫలమై ఉంటే..?

గెలుపోటములను నేను సమానంగా చూస్తా. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఓటములనే ఎక్కువ ఎదుర్కొన్నా. నాకు విజయానందం కంటే పరాజయ బాధ విలువే బాగా తెలుసు. బౌట్‌లో దిగిన ప్రతిసారి గెలిచినా, ఓడినా ఒక కొత్త విషయం నేర్చుకుంటా. నా ప్రతి గెలుపు వచ్చే ఒలింపిక్స్‌లో నా కల సాకారం కోసం వేసే అడుగే. 



ఫైనల్‌ బౌట్‌ ఎలా సాగింది?

అంతకుముందు థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో జిట్‌పొంగ్‌పై విజయం సాధించా. దాంతో ఆమె ఆటపై అవగాహన ఉండడంతో పాటు తనపై గతంలో నెగ్గానన్న సానుకూల దృక్పథంతో బరిలోకి దిగా.  తొలి రెండు రౌండ్లలో విరుచుకుపడి, ఆఖరి రౌండ్‌లో వ్యూహాత్మకంగా ఆడాలనే ప్రణాళికతో రింగ్‌లోకి అడుగుపెట్టా. మొదటి రౌండ్‌లో అనుకున్నది సాధించా కానీ, రెండో రౌండ్‌ ఫలితం ప్రత్యర్థికి అనుకూలంగా వచ్చింది. దాంతో మూడో రౌండ్‌లో చావోరేవో అన్నట్టు తలపడ్డా. అల్లా దయ వల్ల విజయం నన్ను వరించింది.


విజేతగా ప్రకటించగానే బాగా ఉద్వేగానికి లోనయ్యావు?

ఫైనల్‌ ముందు రోజు మా అమ్మానాన్నలతో మాట్లాడా. ఎలాగైనా పతకం పట్టేయాలని వాళ్లు నా నుంచి మాట తీసుకున్నారు. అమ్మానాన్నకిచ్చిన మాట నెరవేర్చా. గెల్చిన తర్వాత వాళ్లని తల్చుకున్నప్పుడు ఉద్వేగానికి లోనై ఏడ్చేశా. 


నిజామాబాద్‌ నుంచి ఇస్తాంబుల్‌ వరకు  ప్రయాణం ఎలా ఉంది?

నేను తొలుత అథ్లెట్‌ని. ఆ తర్వాత కొందరు మగపిల్లలు నేను సాధన చేస్తున్న స్టేడియంలోనే బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేసేవారు. ఒక రోజు మా నాన్న జమీల్‌ని నేను బాక్సింగ్‌ ఆడతా అంటే అది ఆడపిల్లలు ఆడేది కాదని అన్నాడు. ఇదే విషయం అమ్మతో చర్చించా. ఆమె కూడా అన్నది. బంధువులు కూడా నిరుత్సాహపరిచేలా మాట్లాడారు. బతిమాలి, మారం చేసి వాళ్లని ఒప్పించా. నేను గొప్ప బాక్సర్‌ని కావాలనుకుంటున్నా. వాళ్ల మాటలు పట్టించుకోను కానీ, మీరు అండగా ఉంటారా? లేదా? అని అమ్మానాన్నలను అడిగా. వాళ్లు మేము నీతో ఉంటామని హామీ ఇచ్చారు. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూడలేదు.


యువ క్రీడాకారిణులకు మీరిచ్చే సలహా?

పిల్లల ఆసక్తిని గమనించి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. ముఖ్యంగా బాలికల విషయానికొస్తే ప్రాక్టీస్‌ సందర్భంగా వారు వేసుకునే వస్త్రాలు, వారు సాధన చేసే విధానం చూసి బంధువులు, ఇరుగు పొరుగు వారు రకరకాలుగా కామెంట్లు చేస్తారు. అలాంటి వారివల్ల ఈ దేశానికి, ఆ పిల్లల కెరీర్‌కి నష్టమే తప్ప లాభం ఉండదు. కాబట్టి నెగిటివ్‌ కామెంట్లు చేసేవారిని అసలు పట్టించుకోవద్దు. మీ లక్ష్యం సూటిగా ఉంటే దానిని చేరుకోవడానికి ఎంత కష్టమైనా పడండి. కచ్చితంగా ఏదో ఒకరోజు ప్రతిఫలం లభిస్తుంది.


దిగ్గజ బాక్సర్ల సరసన చేరడం ఎలా అనిపిస్తోంది?

కెరీర్‌లో నాకు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నా. ప్రధాని దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు నేను సాధించిన పతకం చూసి మురిసిపోతుంటే ఇప్పటివరకు పడిన కష్టమంతా మాయమైంది. 


మేరీకోమ్‌ నుంచి అభినందనలు వచ్చాయా?

సోషల్‌ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు ఎవరి సందేశాలూ చూడలేదు. ఎవరికి తిరిగి కృతజ్ఞతలు కూడా తెలపలేదు.


నిఖత్‌ అంటే ఎవరని గతంలో మేరీకోమ్‌ వేసిన ప్రశ్నకు సమాధానం ?

దేశానికి పతకం అందించాలని శ్రమించా. సాధించా. నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. కెరీర్‌లో ఎదుర్కొన్న అవరోధాలు నన్ను మానసికంగా దృఢంగా తయారు చేశాయి. ఈ సమయంలో కొన్ని విషయాలను పట్టించుకోకపోవడమే మంచిది. 


నా కూతురు సాధించిన పసిడి పతకం మా సామాజికవర్గం ప్రజల ఆలోచననేకాదు..దేశ ప్రజల ఆలోచనా విధానాన్ని కూడా మార్చివేస్తుంది. ఓ మైనారిటీ అమ్మాయి అంతర్జాతీయ పోటీలలో అద్భుత ప్రతిభ చూపడం.. ఇతర అమ్మాయిల్లోనూ ఆత్మవిశ్వాసం నింపుతుంది.          

- జమీల్‌ అహ్మద్‌ (నిఖత్‌ తండ్రి)

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్‌)


Updated Date - 2022-05-21T09:53:03+05:30 IST