Nikhat Jareen : సంచలనం.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ బాక్సింగ్ క్రీడాకారిణికి స్వర్ణం

ABN , First Publish Date - 2022-05-20T02:39:44+05:30 IST

భారతీయ మహిళా బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (Nikhat Jareen) సంచలనం సృష్టించింది. భారత్ తరపున బరిలోకి దిగిన జరీనా.. ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్

Nikhat Jareen : సంచలనం.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ బాక్సింగ్ క్రీడాకారిణికి స్వర్ణం

ఇస్తాంబుల్: భారతీయ మహిళా బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (Nikhat Jareen) సంచలనం సృష్టించింది. భారత్ తరపున బరిలోకి దిగిన జరీనా.. ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ 52 కేజీల విభాగంలో స్వర్ణం దక్కించుకుంది. ఫైనల్లో ప్రత్యర్థి బాక్సర్, థాయ్‌లాండ్‌కు చెందిన 24 ఏళ్ల జే. జిట్పోంగ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఏకపక్ష విజయంతో చరిత్ర లిఖించింది. 5-0 తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. మొదటి రౌండ్‌లో తిరుగులేని ఆధిక్యం దక్కించుకుంది. రెండో రౌండ్‌లో ఇద్దరికీ సమానమైన పాయింట్లు లభించాయి. చివరి రౌండ్లలోనూ చెలరేగి ఆడింది. ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. జరీన్ దూకుడు ముందు ప్రత్యర్థి బాక్సర్ నిలవలేకపోయింది. ఈ విజయంతో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 6వ స్వర్ణాన్ని అందించింది. మొత్తంగా ఐదవ క్రీడాకారిణి కాగా మేరీ కోమ్, సరితా దేవీ, జెన్నీ ఆర్‌ఎల్, లేఖ కేసీ వంటి దిగ్గజ బాక్సర్ల సరసన నిలిచింది. 


డజనుమంది భారత బాక్సర్లు మహిళల ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనగా..తెలుగు అమ్మాయి నిఖత్‌ జరీన్‌ ఒక్కతే ఫైనల్‌కు చేరింది. మెగా టోర్నీ ఆరంభం నుంచే దూకుడైన ప్రదర్శనతో ప్రత్యర్థులకు దడపుట్టించిన జరీన్‌ పసిడి పతకాన్ని ముద్దాడింది. ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ టైటిల్‌‌ను భారత్‌కు అందించింది.


తెలంగాణ నుంచి ప్రపంచ స్థాయికి..

నిఖత్ జరీన్ తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన అమ్మాయి. గతంలో పలు ప్రతిష్టాత్మక టైటిల్స్ సాధించింది. అందులో 2వ ఇండియా ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో కాంస్యం దక్కించుకుంది. 2019 థాయ్‌లాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో రజతం, బల్గేరియాలో జరిగిన 73వ స్ట్రాండ్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో స్వర్ణం గెలుచుకుంది. అంతేకాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడాలో జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది.


అభినందనల వెల్లువ..

చరిత్రాత్మక విజయం సాధించిన నిఖత్ జరీన్‌కు అభినందనలు వెల్లువెత్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ జరీన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. టీఎస్ క్రీడల కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి అభినందనలు ప్రకటించారు.

Updated Date - 2022-05-20T02:39:44+05:30 IST