ముంబై : శానిటరీ నాప్కిన్స్, బేబీ డైపర్స్ తయారీదారు ‘నైన్ హైజీన్ అండ్ పర్సనల్ కేర్ (Niine Hygiene and Personal Care)’ కంపెనీ 8 రాష్ట్రాల్లో 2.5 లక్షల మంది బాలికలకు శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేసింది. రుతుచక్ర సమయంలో పరిశుభ్రతపై బాలికలకు అవగాహన కల్పించింది. ఈ నెల 28న రుతుచక్ర పరిశుభ్రత దినోత్సవం, కంపెనీ 5వ వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్టు కంపెనీ ప్రకటించింది. నెల రోజుల వ్యవధిలో ఈ నాప్కిన్స్ పంపిణీ చేశామని పేర్కొంది. కంపెనీ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 7.5 లక్షలమందికి సురక్షితమైన రుతుచక్ర పరిశుభ్రతను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మహిళలకు సాధికారత అందించామని కంపెనీ వివరించింది. భారత్‌లో చాలా తక్కువ శాతం మంది మహిళలు మాత్రమే నాప్కిన్స్ వాడుతున్నారు. మిగతావారు ఇంకా పాత దుస్తులను వినియోగిస్తున్నారు. కాబట్టి భారత్‌లో రుతుచక్ర ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన పెరగాల్సి ఉందని కంపెనీ పేర్కొంది.
ఈ సందర్భంగా నైన్ కంపెనీ వ్యవస్థాపకులు అమర్ తుల్సియాన్ మాట్లాడుతూ.. కేవలం నెల రోజుల వ్యవధిలో 2.5 లక్షల మంది బాలికలకు రుతుచక్ర పరిశుభ్రతపై అవగాహన కల్పించడం తేలకైన విషయం కాదన్నారు. తమ బృందం అంకితభావంతో పనిచేయడంతోనే ఇదంతా సాధ్యమైందని ప్రశంసించారు. రుతుచక్ర ప్రక్రియ జీవసంబంధమైన మార్పులకు సంబంధించినది. అయినప్పటికీ ఈ విషయంలో మహిళలు ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదు. కాబట్టి దేశంలో రుతుచక్ర ప్రక్రియపై అవగాహన, పరిశుభ్రత గురించి అందరికీ అవగాహన పెంచాల్సి ఉందని అమర్ తుల్సియాన్ సూచించారు.
కాగా నైన్ కంపెనీ తక్కువ ధరలకే అత్యుత్తమ నాణ్యతతో నాప్కిన్స్, బేబీ డైపర్స్ తయారుచేస్తోంది. పిరియడ్స్ సమయంలో వినియోగించిన ప్యాడ్ల నిర్వీర్యం, పరిశుభ్రత విషయాల్లో బాలికలు, మహిళలను ప్రోత్సాహిస్తూ ఈ కంపెనీ స్కూళ్లు, కాలేజీల్లో రెగ్యులర్‌గా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని ప్రచారం చేస్తోంది. సామాజిక వాలంటీర్లు, స్వయంసహాయక సంఘాల సహాయాలను కూడా తీసుకుంటోంది. పిరియడ్స్‌పై భ్రమలను చర్చల ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తోంది.