మళ్లీ రాత్రి కర్ఫ్యూ

ABN , First Publish Date - 2022-01-06T15:30:40+05:30 IST

అనుకున్నంతా జరిగింది.. రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ మొదలైంది. ప్రజల నిర్లక్ష్యం, విదేశాల నుంచి వచ్చిపడిన ఒమైక్రాన్‌ ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ తెరలేచింది. రోజురోజుకు కరోనా, ఒమైక్రాన్‌ కేసులు

మళ్లీ రాత్రి కర్ఫ్యూ

- నేటినుంచి నిబంధనలు ప్రారంభం

- ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు

-  శుక్ర, శని, ఆదివారాల్లో ఆలయసందర్శన రద్దు

- సీఎం స్టాలిన్‌ ప్రకటన


చెన్నై: అనుకున్నంతా జరిగింది.. రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ మొదలైంది. ప్రజల నిర్లక్ష్యం, విదేశాల నుంచి వచ్చిపడిన ఒమైక్రాన్‌ ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ తెరలేచింది. రోజురోజుకు కరోనా, ఒమైక్రాన్‌ కేసులు అధికమవుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ‘కఠిన’ నిర్ణయం తీసుకుంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. ఈ లాక్‌డౌన్‌ గురువారం ఉదయం నుంచే అమలులోకి రానుంది. అంతేగాక రాత్రిపూట కర్ఫ్యూ కూడా విధించింది. గురువారం రాత్రి నుండి ఈ కర్ఫ్యూ అమలులోకి రానుంది. రాత్రి 10 నుండి వేకువజాము 5గంటల వరకూ ఈ కర్ఫ్యూ అమలులో వుంటుంది. అదేవిధంగా ఆదివారం కఠిన నిబంధనలతో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ బుధవారం సాయంత్రం ఆదేశించారు. రాష్ట్రంలో వారం రోజుల వ్యవధిలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 605 నుంచి 3 వేలు దాటడం ప్రభుత్వాన్ని దిగ్ర్భాంతికి గురి చేసింది. దీంతో ముఖ్యమంత్రి వైద్య నిపుణులు, ప్రభుత్వ ఉన్నతా ధికారులతో  పలుమార్లు భేటీ అయి చర్చించారు. అంతేగాక బుధవారం శాసనసభ సమావేశం ముగియగానే మళ్ళీ ఆయన అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, కరోనా నియంత్రణా విభాగం కార్యదర్శి ఆర్‌.పూర్ణలింగం తదితర అధికారులు పాల్గొన్నారు. వారి సూచన ల మేరకు ముఖ్యమంత్రి లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు గురువారం నుంచి రాత్రిపూట కర్ఫ్యూను విధించనున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, హోటళ్లు, టీషాపులు, సినిమా థియేటర్లు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. 


ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ నిబంధనలివే...

- నిత్యావసర సేవలు మినహా రాష్ట్రమంతటా సంపూర్ణ లాక్‌డౌన్‌ విధింపు. ఆస్పత్రులు, ఏటీఎంలు, సరకుల వాహన సేవలు, పెట్రోలు, డీజిల్‌ వాహన సేవలకు అనుమతి.

- ప్రభుత్వ, ప్రైవేటు రవాణా, మెట్రోరైలు సర్వీసుల రద్దు

- హోటళ్ళలో ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటలకు పార్శిల్‌ విక్రయాలకు అనుమతి. ఇతర దుకాణాలకు అనుమతి లేదు.

- ఈ నెల 9న, తక్కిన రోజుల్లో రాత్రి పది నుంచి వేకువజాము ఐదు గంటల వరకు విమానాలు, రైళ్లేలో వెళ్లే ప్రయాణికులు సొంత వాహనాలతో వెళ్లేందుకు అనుమతి. విమాన, బస్‌, రైలు టిక్కెట్లు ఉంటేనే వాహనాల్లో వెళ్లేందుకు అనుమతిస్తారు.


కర్ఫ్యూలో మినహాయింపులు..

- ప్రభుత్వ, ప్రైవేటు రవాణా సంస్థల రవాణా సదుపాయాలుయధావిధిగా కొనసాగుతాయి. 

- రాష్ట్రాల నడుమ రవాణా సదుపాయాలు కొనసాగించనున్నారు. నిత్యావసర సేవలైన పాలు, పత్రికల పంపిణీకి అడ్డంకులుండవ్‌

- ఆస్పత్రులు, వైద్య ప్రయోగశాలలు పనిచేస్తా యి. అంబులెన్స్‌ సేవలు కొనసాగుతాయి.

- పెట్రోలు బంకులు 24 గంటలపాటు పనిచేసేందుకు అనుమతి

- పరిశ్రమలు, ఐటీ సంస్థల ఉద్యోగులు గుర్తింపు కార్డులను చూపి విధులకు హాజరు కావచ్చు. ఐటీ ఉద్యోగులు ఇంటినుంచి పని చేసేలా చర్యలు చేపట్టాలి.


తక్కిన రోజుల్లో నిబంధనలు...

- శిశు సంరక్షణ కేంద్రాలు, క్రీడా పాఠశాలలు, ఎల్కేజీ, యూకేజీ నర్సరీ పాఠశాలలు తెరిచేందుకు అనుమతి లేదు.

- అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రత్యక్ష తరగతులకు అనుమతి లేదు.

- పబ్లిక్‌ పరీక్షలు రాయనున్న విద్యార్థులు టీకా వేసుకునేందుకు తరగతులకు హాజరయ్యేందుకు అనుమతి.

- ప్రభుత్వ, ప్రైవేటు వైద్య, వైద్య సంబంధిత కళాశాలలు మినహా అన్ని కళాశాలలు, వృత్తివిద్యా నిలయాల్లో చదువుతున్న విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా ఈ నెల 20 వరకు సెలవు.

- శిక్షణా సంస్థలు, ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లకుకు అనుమతి లేదు.

- ఎగ్జిబిషన్లు, బుక్‌ ఎగ్జిబిషన్ల నిర్వహణకు అనుమతి రద్దు

- బస్సులు, సబర్బన్‌ రైళ్లలో, మెట్రో రైళ్లలో 50 శాతం ప్రయాణికులను మ్రాతమే అనుమతిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాల వాయిదా

- ఉద్యానవనాలు, ప్రైవేటు పార్కుల మూత

- సముద్రతీరాల్లో ఉదయం వాకింగ్‌ వెళ్లేందుకు మాత్రమే అనుమతి

- ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల సందర్శన రద్దు

- చేపలు, కూరగాయల దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా వాటి సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశం

- దుకాణాలు, వాణిజ్య సంస్థలు, ప్రైవేటు సంస్థలు, సినిమాథియేటర్లు తదితర ప్రజలు గుమికూడే ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు రెండు వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేసుకుని ఉండాలి.

- లాక్‌డౌన్‌ సమయంలో డ్యూటీకి వెళ్లే కర్మాగారాలలో పనిచేసే వారు గుర్తింపు కార్డులు కలిగి ఉండాలి.

- శుభ, అశుభ కార్యాల్లో పాల్గొనే వారి సంఖ్యపై ఇటీవల జారీ చేసిన ఆదేశాలు యధావిధిగా కొనసాగుతాయి.

Updated Date - 2022-01-06T15:30:40+05:30 IST