స్మార్ట్‌సిటీలో నైట్‌ బజార్‌, ఫుడ్‌ కోర్టులు

ABN , First Publish Date - 2022-09-25T06:12:20+05:30 IST

కరీంనగర్‌ నూతన హంగులతో స్మార్ట్‌సిటీగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే స్మార్ట్‌రోడ్లు, పార్కులు, లైబ్రరరీలు, స్కూల్స్‌, మార్కెట్లు, టాయిలెట్లు, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌ ఏర్పాటుతో నగర రూపురేఖలు మారుతున్నాయి.

స్మార్ట్‌సిటీలో నైట్‌ బజార్‌, ఫుడ్‌ కోర్టులు
శాతవాహన యూనివర్శిటీ సమీపంలో ఏర్పాటు చేయనున్న నైట్‌ బజార్‌ అండ్‌ ఫుడ్‌కోర్టు (నమూనా)

- ఐదు ప్రధాన రోడ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయం 

- యూనివర్సిటీ రోడ్‌లో చురుగ్గా సాగుతున్న పనులు

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 24: కరీంనగర్‌ నూతన హంగులతో స్మార్ట్‌సిటీగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే స్మార్ట్‌రోడ్లు, పార్కులు, లైబ్రరరీలు, స్కూల్స్‌, మార్కెట్లు,  టాయిలెట్లు, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌ ఏర్పాటుతో నగర రూపురేఖలు మారుతున్నాయి. కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ కంపెనీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో 1,850 కోట్ల రూపాయలతో రూపొందించిన డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)లోని పనులను ఒక్కొక్కటిగా చేపడుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారిగా నగరపాలక సంస్థ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా నైట్‌ బజార్‌, ఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నగరంలో రద్దీగా ఉండే ఐదు ప్రధాన ప్రాంతాలు శాతవాహన యూనివర్సిటీ, కలెక్టరేట్‌, మార్క్‌ఫెడ్‌, ఆర్టీసీ జోనల్‌ వర్క్‌షాప్‌, ఉజ్వలపార్కు సమీపంలో నైట్‌ బజార్‌, ఫుడ్‌ కోర్టులను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా శాతవాహన యూనివర్సిటీ సమీపంలో ఏర్పాటు చేసి ఆ తర్వాత దశలవారిగా నైట్‌ బజార్లను విస్తరించాలని తీర్మానించారు. మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌లతో కూడిన స్మార్ట్‌సిటీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుని యూనివర్సిటీ రోడ్డులో నైట్‌ బజార్‌, ఫుడ్‌ కోర్టు పనులను ప్రారంభించారు.  రెండు నెలల్లో ఈ పనులు పూర్తిచేసేందుకు యూనివర్సిటీ సమీపంలో రేయింబవళ్లు వేగంగా పనులు చేపడుతున్నారు. 

రాత్రి ఏడు నుంచి 12 గంటల వరకు

ఎవరికివారు వారివారి దినచర్యలతో బీజీగా మారుతున్న ప్రస్తుత తరుణంలో కనీసం రాత్రి వేళల్లోనైనా ఉపశమనం పొందడం, కుటుంబసభ్యులతో కలిసి సరదాగా కాలక్షేపం చేసే విధంగా ఈ నైట్‌ బజార్‌, ఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి రోజు రాత్రి ఏడు గంటల నుంచి 12 గంటల వరకు దుకాణాలను తెరచి ఉంచుతారు. రాష్ట్రంలోని కొన్ని చోట్ల ప్రైవేట్‌ వ్యక్తులు రాత్రి మాత్రమే ఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేసుకుంటుండగా రాష్ట్రంలోనే తొలిసారి నగరపాలక సంస్థ ఈ నైట్‌బజార్‌ కమ్‌ ఫుడ్‌కోర్టులను ఏర్పాటు చేస్తున్నది. మొట్టమొదటగా ఏర్పాటు చేయనున్న శాతవాహన యూనివర్సిటీ ఫుడ్‌కోర్టులో దాదాపు 25 నుంచి 30 వరకు స్టాల్స్‌ను ప్రారంభించి ఈ స్టాల్స్‌లో వెజ్‌, నాన్‌వెజ్‌ ఫుడ్‌ ఐటెమ్స్‌తోపాటు పిల్లల ఆటవస్తువులు దొరికే విధంగా దుకాణాలను ఏర్పాటు చేసేందుకు ప్రైవేట్‌ వ్యక్తులకు అద్దెకిస్తారు. ఒక్కో స్టాల్‌లో ఒక రకమైన తినుబండారాలు దొరికేలా రకరకాల దుకాణాలను ఏర్పాటు చేయించేందుకు ప్రణాళిక రూపొందించారు. నైట్‌ బజార్‌కు వచ్చే వాహనదారులు వారి వాహనాలను నిలిపేందుకు పార్కింగ్‌, చక్కటి లైటింగ్‌ ఏర్పాటు చేస్తారు. ప్రతి స్టాల్‌ వద్ద ఆకర్షణీయమైన సీటింగ్‌, కొన్ని స్టాల్స్‌ మధ్య చిన్నపిల్లలు సరదాగా ఆడుకునే విధంగా ఆటవస్తువులు,  చిన్నచిన్న పార్కులు, మంచినీటి వసతి, పబ్లిక్‌ టాయిలెట్లను ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మాత్రమే ఐదుగంటలపాటు నిర్వహించే ఈ నైట్‌ బజార్‌కు వచ్చే సందర్శకుల భద్రత కోసం సీసీ కెమెరాలు, పోలీసులు గస్తీ నిర్వహిస్తారు. మినీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే నగరవాసులేకాకుండా జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వారు కూడా ఆకర్షితులవుతారని భావిస్తున్నారు. నగరశివారులోని శాతవాహన యూనివర్సిటీ రోడ్డులో నైట్‌బజార్‌ కమ్‌ ఫుడ్‌కోర్టు ఏర్పాటు కోసం నెలరోజులుగా రేయింబవళ్ళు పనులు చేపడుతున్నారు. ఈ నైట్‌ బజార్‌ను ప్రారంభించిన తర్వాత దశలవారీగా మిగిలిన నైట్‌ మార్కెట్లను ప్రారంభిస్తామని తెలిపారు. 

రెండు నెలల్లో శాతవాన యూనివర్శిటీ నైట్‌బజార్‌, ఫుడ్‌ కోర్టును ప్రారంభిస్తాం 

-  మేయర్‌ యాదగిరి సునీల్‌రావు 

రాష్ట్రంలోనే తొలిసారిగా కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఐదు నైట్‌బజార్‌ కమ్‌ ఫుడ్‌కోర్టులను ఏర్పాటు చేస్తున్నాము. మొదట శాతవాహన యూనివర్సిటీ సమీపంలో ఏర్పాటు చేసే నైట్‌ బజార్‌ పనులు వేగంగా సాగుతున్నాయి. రెండు నెలల్లో పనులు పూర్తిచేసి ఈ మార్కెట్‌ను ప్రారంభించిన అనంతరం కలెక్టరేట్‌, మార్క్‌ఫెడ్‌, ఉజ్వలపార్కు, జగిత్యాల రోడ్‌ ఆర్టీసీ జోనల్‌ వర్క్‌షాపు సమీపంలో కూడా ఈ నైట్‌బజార్‌, ఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేస్తాం. 

Updated Date - 2022-09-25T06:12:20+05:30 IST